ప్రజల పక్షాన పోరాడుతున్న నర్సాపూర్ ఎంఎల్‌ఎ సునీతా లక్ష్మారెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తీవ్రంగా ఖండించారు. నల్లవల్లి, ప్యారానగర్‌లో డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న ప్రజలను కలిసేందుకు వెళితే అక్రమంగా అరెస్టు చేయడం దారుణమని ఒక ప్రకటనలో మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఒక ఎంఎల్‌ఎకు నిరసన తెలిపే హక్కు కూడా లేదా..? అని ప్రశ్నించారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అని ధ్వజమెత్తారు. ఇప్పటికే డంపింగ్ యార్డు ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న అనేక గ్రామాల ప్రజలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్‌లోని లగచర్ల తరహాలోనే అర్థరాత్రి వేళ పోలీసులు ప్రజల ఇళ్లకు వెళ్లి భయాందోళనలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలన అని ఊదరగొట్టి… ప్రజలను భయపెట్టే నిరంకుశ వైఖరిని విడనాడకపోతే రాష్ట్ర ప్రభుత్వం మరో లగచర్ల తరహా ఉద్యమాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. అక్రమంగా అరెస్టు చేసిన బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ సునీతా లక్ష్మారెడ్డితోపాటు.. బిఆర్‌ఎస్ నేతలను, అక్రమంగా నిర్బంధించిన అమాయకులైన ప్రజలను బేషరతుగా విడుదల చేయాలని కెటిఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బిఆర్‌ఎస్ నాయకుల అరెస్టుల పట్ల హరీష్ రావు ఆగ్రహం
సంగారెడ్డి జిల్లా నల్లవల్లి, ప్యారానగర్ గ్రామాల పరిధిలో జిహెచ్‌ఎంసి డంపింగ్ యార్డ్ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న స్థానిక ప్రజలు, రైతులకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన నర్సాపూర్ ఎంఎల్‌ఎ సునీతా లకా్ష్మరెడ్డి, బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేయడాన్ని మాజీ మంత్రి హరీష్‌రావు ఎక్స్ వేదికగా తీవ్రంగా ఖండించారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటు విషయంలో స్థానికుల అభిప్రాయాలను తుంగలో తొక్కుతూ, ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. రైతులు, స్థానికుల ఆవేదన ఈ ప్రభుత్వానికి ఎందుకు అర్థం కావడం లేదని అడిగారు. ప్రజలను, ప్రజా ప్రతినిధులను అర్ధరాత్రి నుండి ఎందుకు అక్రమ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారని ప్రశ్నించారు. గుమ్మడిదల మండలంలోని నల్లవల్లి,
ప్యారనగర్ గ్రామాల్లో 144 సెక్షన్ విధించి, భయానక వాతావరణ సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్రకటి ఎమర్జెన్సీని తలపిస్తున్నారని, ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే..? అని నిలదీశారు. సిఎం రేవంత్‌రెడ్డి పాలనలో ప్రజలు, ప్రజా ప్రతినిధులకు వారి అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పుకునే హక్కే లేదా..? అని ప్రశ్నించారు. ప్రజా పాలన పేరిట అధికారంలోకి వచ్చి, అప్రజాస్వామీక విధానాలు అనుసరించడం మీకే చెల్లిందంటూ సిఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. అరెస్టు చేసిన ఎంఎల్‌ఎ సునీత లక్ష్మారెడ్డితో పాటు, బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని, డంపింగ్ యార్డ్ ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఎంఎల్‌ఎ సునీతా లక్ష్మారెడ్డి అరెస్ట్ దుర్మార్గం : సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
నల్లవల్లి, ప్యారా నగర్‌లో డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన బిఆర్‌ఎస్ నర్సాపూర్ ఎంఎల్‌ఎ సునీతా లక్ష్మారెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ రైతు సమస్యల అధ్యయన కమిటీ చైర్మన్ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఒక ప్రకటనలో ఖండించారు. రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజా పాలన కాదని, ఎమర్జెన్సీ పాలన అని పేర్కొన్నారు. ప్రజల సమస్యల మీద గొంతెత్తుతున్న వారి గొంతు నొక్కుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం నిరంకుశ వైఖరి వీడకుంటే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.