ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలకు నిషేధం విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ఇవ్వడం పట్ల బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఉత్తర్వులు విద్యార్థుల ఆందోళనలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పాలన అందిస్తామని ఏడో గ్యారెంటీగా హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నరలోనే ఆ హామీని తుంగలో తొక్కిందని మండిపడ్డారు. నిరసన తెలిపే హక్కును రద్దు చేయాలనే ఉద్దేశంతోనే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళనలపై నిషేధం విధించడం అత్యంత దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం రోడెక్కకూడదంటూ అల్టిమేటం జారీ చేయడం,
ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ రోజులను తలపిస్తోందని, ఇది ప్రజాస్వామిక హక్కులపై ఒత్తిడి తీసుకురావాలనే కుట్ర అని పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో విద్యార్థులకు సరఫరా అవుతున్న భోజనంలో పురుగులు, బ్లేడ్లు లభించడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రత్యక్ష నిదర్శనమని వ్యాఖ్యానించారు. అలాంటి దారుణాలు, ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన ప్రభుత్వం, నిరంకుశంగా విద్యార్థుల గొంతునొక్కే దారుణ చర్యలకు పాల్పడుతోందన్నారు. నిర్బంధ పాలనతో విద్యార్థులను అణచివేయాలనే ప్రభుత్వ యత్నాలను సహించబోమని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉస్మానియా యూనివర్సిటీని సైతం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశంగా నడిపించేందుకు చూస్తే, ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని కెటిఆర్ హెచ్చరించారు.
సింగరేణికి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్.. ప్రైవేటైజేషనేనా..? : కెటిఆర్
కాంగ్రెస్,బిజెపి కలిసి తెలంగాణ కొంగుబంగారమైన సింగరేణి సంస్థను ప్రైవేటుకు కట్టబెట్టే కుట్ర అక్షర సత్యమని తేలిపోయిందని కెటిఆర్ అన్నారు. బిఆర్‌ఎస్ చెప్పిందే నిజమవుతోందని వ్యాఖ్యానించారు. ఇప్పటికే రెండు బొగ్గు బ్లాక్లులను ప్రైవేటుపరం చేసి, ఇప్పుడు ఉన్నతస్థాయి ఉద్యోగాలను కూడా ప్రైవేటుకు కట్టబెట్టడం, ముంచుకొస్తున్న ముప్పుకు మరో ప్రమాద హెచ్చరిక అని పేర్కొన్నారు. దేశంలోనే వందేళ్ల చరిత్ర కలిగిన తొలితరం ప్రభుత్వరంగ సంస్థను బలోపేతం చేయాల్సింది పోయి నిర్వీర్యం చేసి నీరుగార్చే కుతంత్రాలు కార్మికుల హక్కులకు మరణశాసనాలే అని ఆవేదన వ్యక్తం చేశారు. లాభాల పంట పండించి దేశ విద్యుత్ అవసరాలు తీర్చడంలో మూలస్తంభంలా నిలిచినందుకు సింగరేణి సంస్థకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్.. ప్రైవేటైజేషనేనా..? అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన సింగరేణిని కాపాడుకునేందుకు బిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో జంగ్ సైరన్ మోగిస్తామని వెల్లడించారు. కార్మికుల సంఘటిత శక్తిలో ఉన్న బలాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చవిచూపిస్తామని హెచ్చరించారు.