Sunday, January 19, 2025

త్వరలోనే స్టేషన్ ఘన్‌పూర్‌కు ఉప ఎన్నిక:కెటిఆర్

- Advertisement -
- Advertisement -

త్వరలోనే స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గానికి ఉపఎన్నిక వస్తుందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ జోస్యం చెప్పారు. ఈ ఉపఎన్నికలో బిఆర్‌ఎస్ నుంచి రాజయ్య గెలుపు ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. హైకోర్టులో తీర్పు సానుకూలంగా వస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. మిగతా వాళ్లపై నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో గురువారం స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి పలువురు కాంగ్రెస్ నేతలు కెటిఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరారు. కెటిఆర్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఎ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎంఎల్‌ఎ రాజయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, సభాపతి రాజకీయ పక్షపాతం చూపిస్తూ ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడం లేదని పేర్కొన్నారు.

ప్రస్తుతం దేశంలో వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం కష్టంగా ఉందన్నారు. 14 సీట్ల స్వల్ప తేడాతో కోల్పోయామని చెప్పారు. అందులో సగం గెలిచినా కథ వేరేలా ఉండేదని పేర్కొన్నారు. పార్లమెంటు ఎన్నికలు రెండు కూటముల మధ్య నడిచిందని చెప్పారు. స్టేషన్ ఘన్‌పూర్ ప్రజలు, తాము వేరే రకంగా మోసపోయామని వివరించారు. కెసిఆర్ ఉన్నప్పుడు కరెంటు పోతే వార్త, రేవంత్ రెడ్డి వచ్చాక కరెంటు ఉంటే వార్త అని ఎద్దేవా చేశారు. మొదటి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రెండు ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. రెండు లక్షల ఉద్యోగాల మాట బోగస్ అని యువతకు అర్థం అయిందన్నారు. మైసూర్ బజ్జీలో మైసూర్ ఎంత వాస్తవమో, జాబ్ క్యాలెండర్‌లో జాబ్‌లు అంతే అని ఎద్దేవా చేశారు.

త్వరలోనే పార్టీ కార్యక్రమాల్లో కెసిఆర్ : త్వరలోనే కెసిఆర్ పార్టీ కార్యక్రమాలు ఇస్తారని కెటిఆర్ చెప్పారు. కొద్ది రోజుల్లో నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తారన్నారు. కెసిఆర్ పూర్తి చేసిన సీతారామ ప్రాజెక్టుకు సిఎం రేవంత్ రెడ్డి వెళ్లి రిబ్బన్ కట్ చేశారని ఎద్దేవా చేశారు. డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క చెప్పినట్లు రూ.75 కోట్లతో 1.25 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చే మాట వాస్తవం అయితే ఇక నుంచి అన్ని ప్రాజెక్టులకు అలాగే చేయాలని కోరారు. పిఆర్ స్టంట్లు, నాటకాలతో ప్రజలను ఎక్కువ రోజులు మోసం చేయలేరని హితవు పలికారు.స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు అని బిసి డిక్లరేషన్‌లో చెప్పారు. బిసిలకు మోసం చేసి రిజర్వేషన్లు పెంచకుండానే రేవంత్ రెడ్డి స్థానిక ఎన్నికలు పెడతారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ నేతలు ప్రజల్లో తిరగలేని పరిస్థితి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News