Sunday, January 19, 2025

దమ్ముంటే ఫార్ములా-ఈ రేస్‌పై అసెంబ్లీలో చర్చ పెట్టండి:కెటిఆర్

- Advertisement -
- Advertisement -

దమ్ముంటే ఫార్ములా -ఈ రేస్ అంశంపై రాష్ట్ర శాసనసభలో చర్చ పెట్టాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. ఈ మేరకు బుధవారం కెటిఆర్ సిఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. ఫార్ములా -ఈ రేస్ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని నెలలుగా గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం మీద, ముఖ్యంగా తన మీద అనేక నిరాధార అరోపణలు చేస్తున్నదని పేర్కొన్నారు. ఈ విషయం మీద ఈ వారం సిఎం ఆధ్వర్యంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో గంటన్నర సేపు చర్చ కూడా జరిగినట్టు వార్తా కథనాలు వచ్చాయని చెప్పారు. ఈ అంశం మీద నాలుగు గోడల మధ్య చర్చ కన్నా రాష్ట్ర శాసనసభలో నాలుగు కోట్ల మంది ప్రజల ముందు చర్చ జరగితే నిజానిజాలు ఏమిటో అందరికీ తెలుస్తాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి మంచి జరగాలనే సదుద్దేశంతో గత ప్రభుత్వం ఫార్ములా -ఈ రేస్ నిర్వాహకులతో ఒక ఒప్పందం చేసుకున్నదని కెటిఆర్ లేఖలో స్పష్టం చేశారు.

ఈ రేస్ వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సుమారు రూ.700 కోట్లు లబ్ది చేకూరిందని నీల్సన్ సంస్థ నివేదిక స్పష్టం చేసిందని, 2024లో మరో దఫా రేస్ జరగవలసి ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని ఏకపక్షంగా రద్దు చేయడం చేసిందని గుర్తు చేశారు. అప్పటి నుండి రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ రేస్ గురించి అనేక అవాస్తవాలను మీడియా ద్వారా ప్రచారం చేసి, ఇందులో ఏదో జరిగిందనే అపోహలు సృష్టించే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదని అన్నారు. ఫార్ములా -ఈ రేస్ ఒప్పందం అంతా పారదర్శకంగా జరిగిందని, రేస్ నిర్వాహకులకు చెల్లింపులు కూడా పారదర్శకంగానే జరిగాయని ఇదివరకే తాను వివరంగా చెప్పినట్లు పేర్కొన్నారు. అయినా మీ ప్రభుత్వం మాత్రం దుష్ప్రచారం మానడం లేదని సిఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలకు నిజాలేమిటో తెలుసుకునే హక్కు ఉన్నదని, కనుక శాసనసభలో ఈ అంశంపై చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. దీనిపైన శాసనసభలో సవివరమైన చర్చ జరిగితే నిజానిజాలేమిటో నిగ్గుతేలుతాయని కెటిఆర్ తెలిపారు.

ఈ అంశంపై చర్చ పెట్టాలని కోరుతూ స్పీకర్‌కు బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ విజ్ఞప్తి
ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంపై ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే చర్చ పెట్టాలని కోరుతూ బుధవారం స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్‌రావు నేతృత్వంలో ఆ పార్టీ ఎంఎల్‌ఎలు వినతిపత్రం సమర్పించారు. స్పీకర్‌ను కలిసిన వారిలో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు వేముల ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, చింత ప్రభాకర్, కాలేరు వెంకటేష్ ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News