Friday, January 24, 2025

నమ్మించి మోసం చేయటమనే నైజం:కెటిఆర్

- Advertisement -
- Advertisement -

నమ్మించి మోసం చేయటమనే నైజం కాంగ్రెస్ పార్టీ నరనరాల్లోనే ఉందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వ్యాఖ్యానించారు. ఆరు గ్యారంటీలు, అభయ హస్తం అంటూ ఇక్కడి ప్రజలను మోసం చేసేందుకు ముందుగా ఢిల్లీ నుంచి వచ్చి నాంది పలకింది రాహుల్ గాంధీనే అని పేర్కొన్నారు. ఎఐసిసి అగ్రనేత రాహుల్‌గాంధీ రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా కెటిఆర్ ఆయనకు బహిరంగ లేఖ రాశారు. యథా రాజా తథా ప్రజా అన్నట్లు ఆ తర్వాత రాహుల్ గాంధీ బాటలోనే ఇక్కడి నాయకులు నడుస్తున్నారని విమర్శించారు. ఆరు గ్యారంటీల అమలు బాధ్యత తనది అని చెప్పిన రాహుల్ గాంధీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువైపు తొంగి కూడా చూడలేదని, మూడు వందల రోజులైనా ఒక పరిమిత ఉచిత బస్సు మినహా ఒక్క గ్యారంటీని అమలు చేయలేదని పేర్కొన్నారు.

రైతులకు రుణమాఫీ అని చెప్పి సగం మందికి కూడా రుణాలు మాఫీ చేయలేదని, కానీ జాతీయ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్‌లో మాత్రం పూర్తి రుణమాఫీ చేసేశామంటూ సిగ్గులేకుండా అబద్దాలను ప్రచారం చేసుకున్నారని మండిపడ్డారు. ఒక్క రుణమాఫీయే కాదు రైతు భరోసాను ఎత్తగొట్టారు…బోనస్‌ను బోగస్ చేశారని విమర్శించారు. కనీసం రైతులు పండించిన పంటను కూడా కొనుగోలు చేయలేదని అన్నారు. నమ్మి ఓటు వేసినందుకు తెలంగాణలోని సబ్బండ వర్గాలను మోసం చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్న కాంగ్రెస్ పార్టీ తీరును సమాజం గమనిస్తోందని వ్యాఖ్యానించారు. నిరుద్యోగులు, విద్యార్థులు, రైతులు, అంగన్‌వాడీలు, పోలీసులు.. ఇలా అన్ని వర్గాల వాళ్లు ప్రతి రోజు రోడ్లపై ధర్నాలు, నిరసనలు చేసే పరిస్థితికి తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా పోలీసులను పోలీసులతోనే కొట్టించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు.

సిఎం రేవంత్ రెడ్డి హింసించే పులకేసిలా తయారయ్యారు : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హింసించే పులకేసి మాదిరిగా తయారయ్యారని కెటిఆర్ పేర్కొన్నారు. మూసీ, హైడ్రా పేరుతో పేద, మధ్య తరగతి ప్రజల పొట్ట కొడుతున్నారని, హైడ్రా, మూసీ పేరు చెబితినే ప్రజలు హడలిపోయే పరిస్థితి తీసుకొచ్చారని చెప్పారు. ప్రజలకు గూడు కట్టిస్తామంటూ నమ్మబలికి వాళ్ల గూడును చెదరగొట్టిన గొప్ప పాలన కాంగ్రెస్ ప్రభుత్వానిదని విమర్శించారు. పేద, మధ్య తరగతి ప్రజలను ఇళ్లను కూలగొడుతుంటే వాళ్ల చేసిన ఆర్తనాదాలు మీకెందుకు వినబడలేదని రాహుల్‌గాంధీని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. తెలంగాణలో చిన్న పిల్లాడు పిలిచినా వస్తా అని బీరాలు పలికినా మీరు ఇన్నాళ్లు ఎక్కడ దాక్కున్నారు… స్వయంగా అశోక్ నగర్‌కు వచ్చి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలకు నాది భరోసా అని చెప్పి ఆ నిరుద్యోగులను మోసం చేస్తున్నందుకు సిగ్గు అనిపించటం లేదా..? అంటూ రాహుల్‌గాంధీకి ప్రశ్నల వర్షం కురిపించారు.

అశోక్ నగర్‌లో నిరుద్యోగుల దగ్గరకు వెళ్లే దమ్ముందా..? : రాహుల్ గాంధీకి అశోక్ నగర్‌లో నిరుద్యోగుల దగ్గరకు వెళ్లే దమ్ముందా..? అని కెటిఆర్ ప్రశ్నించారు. మీకు రక్షణ కల్పిస్తున్న పోలీసులా దగ్గరకు వెళ్లేందుకు..?.. మూసీ, హైడ్రా బాధితులను పరామర్శించేందుకు..?.. ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుల దగ్గరకు వెళ్లేందుకు..? ఆటో డ్రైవర్ల దగ్గరకు వెళ్లేందుకు..? …అసలు తెలంగాణ ప్రజల ముందు వచ్చే రాహుల్‌గాంధీకి దమ్ముందా..? అని అడిగారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఏమాత్రం అంచనా వేయకుండా నేల విడిచి కాంగ్రెస్ చేసిన సాము కారణంగా తెలంగాణ భవిష్యత్ తలకిందులుగా మారిందని విమర్శించారు. తీరా చేయాల్సిన అన్యాయమంతా చేసి కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జు ఖర్గే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మించి హామీలు ఇస్తే ఆ రాష్ట్రం దివాళా తీస్తుందని స్వయంగా ఆయనే నొక్కి వక్కాలిస్తున్నారని పేర్కొన్నారు. ఇచ్చిన హమీలు నెరవెర్చకుండా సబ్బండ వర్గాలను మోసం చేసినందుకు, అభివృద్ది పథంలో ఉన్న తెలంగాణను అవీనీతి తెలంగాణాగా మార్చినందుకు యావత్తు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News