Thursday, January 23, 2025

ప్రపంచ దేశాలకు భారత్ దిక్సూచి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రపంచ దేశాలకు భారతదేశం ఒక దిక్సూచి వంటిందని రాష్ట్ర ఐటి, పరిశ్రములు, మున్సిపల్ శాఖ మంత్రి కె. తారకరామారావు అన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా మన దేశం కొనసాగుతోందన్నారు. సర్వమతాలకు పుట్టినిల్లు భారతదేశం అని కొనియాడారు. భారత్‌లో అద్భుతమైన వనరులు ఉన్నాయన్నారు. అపార ఖనిజ సంపద ఉందన్నారు. ఏ దేశానికి తీసుపోని విధంగా అన్ని రంగాల్లో అగ్రస్థానంలో దూసుకపోయే సత్తా కూడా ఉందన్నారు. అన్నింటి కంటే మన దేశంలో ఉన్న యువశక్తి, యువ ప్రతిభకు లోటులేదన్నారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ఆదివారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సబ్ ఏరియా హెడ్ క్వార్టర్స్ సైనికులు రెండు రోజుల పాటు నిర్వహించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవానికి మంత్రి కెటిఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం అభివృద్ధిలో మనకంటే కొన్ని దేశాలు ముందు వరసలో ఉన్నప్పటికీ మునుముందు భారతదేశమే అన్నింటికి మార్గదర్శకంగా నిలుస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లో ప్రపంచ దేశాలతో పోటీపడే సత్తా భారత దేశానికి కొదవ లేదన్నారు. ఒక విధంగా చెప్పాలంటే భారత్ సకల సంపదకు నిలయమన్నారు. అయితే, పాలకులు సరైన దిశలో దేశాన్ని ముందుకు తీసుకవెళ్లగలిగితే అద్భుతమైన ఫలితాలను సాధించేందుకు అవకాశముంటుందన్నారు. ఈ నేపథ్యంలో భారత్‌దేశాన్ని మరో దేశంతో పోల్చలేమని కెటిఆర్ వ్యాఖ్యానించారు. మన దేశానికి విశిష్టత ప్రపంచ దేశాల్లోనే అత్యున్నతమైనదన్నారు. అందుకే మేరా భారత్ మహాన్ అనే మాట వింటే తెలియని అనుభూతి మనలో కలుగుతుందన్నారు. అమితమైన దేశభక్తి గుండె నిండా నింపుకున్నట్లు ఉంటుందన్నారు. మన సైనికుల ప్రతిభాపాఠవాలు కళ్ళముందు కదలాడుతుంటాయన్నారు. అలాగే దేశం కోసం అసువులు బాసిన ఎంతో మంది మహానేతలు, స్వాతంత్య్ర సమరయోధులు, స్పూర్తి ప్రధాతల త్యాగాలు మదిలో సృషిస్తాయని కెటిఆర్ అన్నారు. అందుకే భారతదేశం చాలా విశిష్టమైనదన్నారు. చైనాతో అనేక విషయాల్లో పోటీ పడుతున్నప్పటికీ మన ప్రత్యేకతలు వేరన్నారు. ప్రతి 100 కిలోమీటర్లకు విభిన్న సంస్కృతి మన దేశంలో కనిపిస్తుందన్నారు. ఇలాంటి సంస్కృతి మరో దేశంలో కనిపించదన్నారు.

మూడు వారాల తరువాత బయటకొచ్చిన కెటిఆర్
కాలి నొప్పితో బాధపడుతున్న కెటిఆర్ మూడు వారాల తరువాత ఆజాదీ కా అమృత్ మహోత్సవానికి హాజరయ్యారు. చేతికి కర్రసాయం తీసుకని ఈ కార్యక్రమంలో సుమారు గంటన్నర పాటు గడిపారు. ఈ సందర్భంగా దేశభక్తి గీతాలకు సైనిక బృందాల నృత్యాలు, సాంస్కృతిక వేడుకలను ఆయన వీక్షించారు. సంతోషంతో పులకరించిపోయారు. అనంతరం తెలుగు రాష్ట్రాల్లో అమరులైన సైనిక కుటుంబాలకు మహావీర్ పురస్కారాలను మంత్రి కెటిఆర్ అందజేసి గౌరవించారు. అలాగే దేశ, రాష్ట్ర ప్రజలకు 75వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కాలిగాయం వల్ల మూడు వారాలుగా ఇంట్లోనే ఉన్నానన్నారు. మూడు వారాల తర్వాత తాను పాల్గొన్న తొలి కార్యక్రమం ఆజాదీ కా మహోత్సవం కావడం చాలా ఆనందంగా ఉందని ఈ సందర్భంగా కెటిఆర్ వ్యాఖ్యానించారు.

KTR Participate Azadi ka Amrit Mahotsav in Parade Ground

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News