Monday, December 23, 2024

మహానగరానికి సమృద్ధిగా తాగునీటి వసతి

- Advertisement -
- Advertisement -

మహానగరానికి సమృద్ధిగా తాగునీటి వసతి
భవిష్యత్తులో నీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు
త్వరలో వందశాతం మురుగునీటి శుద్ది నగరంగా చరిత్రకెక్కుతుంది
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన పట్టణ ప్రగతిలో మంత్రి కెటిఆర్ వెల్లడి

మన తెలంగాణ/ హైదరాబాద్: భవిష్యత్తులో హైదరాబాద్ నగర జనాభా ఎంత పెరిగినా అందుకు తగిన నీటి వసతి ఉందని పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మాదాపూర్ లోని శిల్ప కళా వేదిక లో శుక్రవారం జరిగిన పట్టణ ప్రగతి దినోత్సవ వేడుకలకు హాజరై మాట్లాడుతూ 2050 వరకు జనాభా రెండితలు పెరిగినా అందుకు తగిన నీటి వసతి ఉన్న ఏకైక నగరం హైదరాబాద్ అని తెలిపారు. భవిష్యత్తులో తాగు నీటి ఎద్దడి రాకుండా అనేక ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనికోసం ప్రస్తుతం సుంకిశాల ప్రాజెక్టు నిర్మిస్తున్నామని తెలిపారు. కొండపొచమ్మ సాగర్, మల్లన్న సాగర్ ల నుంచి నీరు సరఫరా చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వివరించారు. త్వరలో 100శాతం మురుగును శుద్ధి చేసే నగరంగా హైదరాబాద్ చరిత్రకెక్కనుందని పేర్కొన్నారు. ఇందులో జలమండలి అధికారులు, సిబ్బంది, కార్మికుల పాత్ర ఎంతో ఉందని కొనియాడారు.

మురుగు నీటిని పూర్తిగా శుద్ధి చేయడంతో చెరువులు, నదులు కలుషితం కాకుండా కాపాడుకోవచ్చన్నారు. ఔటర్ రింగు రోడ్డు తో పాటు ఓఆర్‌ఆర్ బయట 5 కిమీ వరకు సీవెరేజ్ మాస్టర్ ప్లాన్ జలమండలి తయారు చేసి ఇచ్చిందని గుర్తు చేశారు. అనంతరం ఎండీ దాన కిశోర్ ప్రసంగిస్తూ ప్రస్తుతం మహా నగరానికి సమృద్ధిగా నీరు ఇస్తున్నామని, భవిష్యత్తు అవసరాలకు తగిన ప్రణాళికలు రచించామన్నారు. ఒకప్పుడు నగరంలో తాగునీటి కోసం ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలపై ఆధారపడే వాళ్లమని, ప్రస్తుతం అలాంటి అవసరం లేదన్నారు. 2014లో 307 ఎంజీడీల తాగు నీరు సరఫరా చేసేదని ప్రస్తుతం 560 ఎంజీడీల నీరు అందిస్తున్నామని తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఏర్పడ్డ తర్వాత గోదావరి డ్రింకింగ్ వాటర్ సరఫరా ఫేజు-1, కృష్ణా మూడు ఫేజుల ద్వారా నగరంతో పాటు ఓఆర్‌ఆర్ వరకు సమృద్ధిగా నీళ్లు సరఫరా చేస్తున్నట్లు వివరించారు.

నగరానికి నిరంతర నీటి సరఫరా కోసం రింగ్ మెయిన్ ప్రాజెక్టు చేపడుతున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తు తరాల కోసం సుమారు రూ.2214 కోట్లతో సుంకిశాల ప్రాజెక్టును ప్రభుత్వం నిర్మిస్తుందన్నారు. ఇవన్నీ ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక మంత్రి కేటీఆర్ లు ఇచ్చిన చేయూత వల్లే సాధ్యమైందన్నారు. అంతేకాకుండా నగర తాగునీటి భవిష్యత్తు అవసరాల కోసం కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ నుంచి దాదాపు 20 టీఎంసీల తాగునీటికి హామీ ఇచ్చారని వివరించారు. నెలకు 20 వేల లీటర్ల వరకు ఉచిత తాగు నీరు అందిస్తున్నామని 62 శాతం జనాభా లబ్ధి పొందుతుందని అన్నారు. దీనికోసం ఇప్పటిదాకా రూ.828 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. నగరంలో కొత్తగా నిర్మిస్తున్న 31 ఎస్టీపీలు త్వరలో అందుబాటులోకి వస్తాయని ఫలితంగా రోజూ ఉత్పన్నమయ్యే మురుగు నీటిని వంద శాతం శుద్ధి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ విప్ లు బాల్క సుమన్, అరికెపూడి గాంధీ, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సీడీఎంఏ కమిషనర్, డైరెక్టర్ సత్యనారాయణ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, జలమండలి ఈడీ డా. ఎం. సత్యనారాయణ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
అంతకుముందు కాచిగూడలో జరిగిన వార్డు కార్యాలయం ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ తో పాటు జలమండలి ఎండీ దానకిశోర్ పాల్గొన్నారు. ఇందులో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ప్రజలు అధికారుల వద్దకు కాదని అధికారులే ప్రజల వద్దకు వచ్చి పనిచేసేందుకే వార్డు కార్యాలయాల వ్యవస్థను ఏర్పాటు చేశామని తెలిపారు. వార్డు కార్యాలయ సిబ్బందికి తగిన యంత్రాలు, నిధులు ఇచ్చి ప్రోత్సహిస్తామని తెలిపారు. సిటిజన్ చార్టర్ ద్వారా నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు.

జలమండలి ఎండీ దానకిశోర్ మాట్లాడుతూ నగరంలో ఇప్పటికే ఉత్తమమైన మున్సిపల్ సేవలు అందిస్తున్నామని అన్నారు. వాటిని ప్రజల ఇంటి ముందుకు తీసుకు రావడానికే ఈ వార్డు కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దీంతో సమస్యలు సత్వరంగా పరిష్కరించడానికి వీలవుతుందని, ప్రజలకు మేలైన సేవలు అందిచ్చవచ్చని పేర్కొన్నారు. కాచిగూడలో ఉత్పన్నమవుతున్న తాగు నీరు, ముగు నీరు సమస్యలకు పరిష్కరించడం కోసం రూ. 18 కోట్లు కేటాయించామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News