Sunday, December 22, 2024

కేంద్రం తెలంగాణను శత్రు దేశంగా చూస్తుంది: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

సిరిసిల్ల ః  తెలంగాణను కేంద్ర ప్రభుత్వం శతృదేశంగా చూస్తూ ఆర్థిక ఆంక్షలు అమలు చేస్తోందని, రాష్ట్రానికి రావాల్సిన గ్రామీణ ఉపాధి హమీ నిధులు రూ.లు 1200 కోట్లు ఇవ్వడం లేదని ఐటి, పురపాలక, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. సోమవారం సిరిసిల్ల కలెక్టరేట్‌లో నిర్వహించిన జాతీయ ఉత్తమ గ్రామ పంచాయతీల అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు రూ.లు కోటి లోగా బకాయలున్న వాటి సమస్యలు పరిష్కరించడానికి గత నవంబర్, డిసెంబర్‌వరకున్న బకాయలు తీర్చడానికి ఈ నెల 31లోగా రాష్ట్ర ప్రభుత్వం రూ.లు 1300 కోట్లు విడుదల చేయనున్నట్లు మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు.

తెలంగాణపై కేంద్రం ఆర్థిక ఆంక్షలు అమలు చేస్తూ కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వక పోగా అనేక నిధులు తగ్గించిందన్నారు.మరో వైపు కేంద్రం పని చేస్తున్న ప్రభుత్వంగా గుర్తించి అనేక అవార్డులు, ప్రశంసలు అందిస్తోందని, కాని నిధులు మాత్రం ఇవ్వడం లేదనన్నారు.ఈ విషయంలో ఎవరైనా ఆర్‌టిఐ ద్వారా సమాచారం కూడా తీసుకోవచ్చన్నారు. సర్పంచులు, ప్రజాప్రతినిధులు ఈ విషయంపై గ్రామాల్లో తగినట్లుగా ప్రచారం చేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం గ్రామ పాలన, పారిశుధ్యం, పచ్చదనం బాగుండాలని కొత్త పంచాయత్‌రాజ్ చట్టం తెచ్చిందన్నారు. దేశంలోని 28 రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. కేంద్రంకు రాష్ట్రంతో ఎన్ని రాజకీయ వైరుధ్యాలున్నా తప్పనిసరిగా అనివార్యంగా దేశంలోని టాప్ 20 గ్రామపంచాయతీల్లో 19 తెలంగాణలోనే ఉన్నాయని తేల్చక తప్పలేదన్నారు.

ఉత్తమ జిల్లా పరిషత్‌గా సిరిసిల్ల జిల్లా రెండు సార్లు జాతీయ స్థాయిలో నిలిచిందన్నారు. గతంలో ఎక్కడో కేరళలో, లేదా అంకాపూరో, గంగదేవపల్లో ఆదర్శగ్రామాలుగా ఉండేవని తెలంగాణ స్వరాష్ట్రంలో సిఎం కెసిఆర్ మార్గదర్శనంలో ఇప్పుడు తెలంగాణలోని 12769 గ్రామపంచాయతీలు పల్లె ప్రగతి ద్వారా ఆదర్శంగా మారి అభివృధ్ధిలో ఒకదానికొకటి పోటి పడుతున్నాయన్నారు. ఇప్పుడు అనేక రాష్ట్రాల నుండి మన రాష్ట్రంలోని ఉత్తమ గ్రామాలను సందర్శిస్తున్నారన్నారు. తెలంగాణ సుపరిపాలనపై ముస్సోరిలోని లాల్‌బహదూర్‌శాస్త్రీ అకాడమీలో ఐఏఎస్ అభ్యర్థులకు పాఠాలు బోధించడం మనందరికి గర్వకారణమన్నారు.సిఎం కెసిఆర్ పాలనలో ప్రజాప్రతినిధులుగా కొనసాగడం అందరి అదృష్టమన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళాక సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్‌కుమార్, జడ్‌పి సిపి అరుణ, శాసన సభ్యులు చెన్నమనేని రమేష్‌బాబు, రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, ఎంఎల్‌సి ఎల్ రమణ, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, నాఫ్‌కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, రైతుబంధు చైర్మన్ గడ్డం నర్సయ్య, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, కలెక్టర్ అనురాగ్ జయంతి, అతనపు కలెక్టర్ సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 27 ఉత్తమ గ్రామ పంచాయతీల సర్పంచులకు, ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో అవార్డులు అందించారు. ఈ కార్యక్రమంలో బలగం సినిమా దర్శకుడు యెల్దండి వేణును మంత్రి కెటిఆర్ సత్కరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News