Monday, January 20, 2025

చేనేతకు వరాల చేయూత

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: చేనేతకు చేయూత అందిస్తున్నట్టు మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. చేనేత మిత్ర కింద ప్రతి చేనేత కార్మికుడికి, ప్రతి మగ్గానికి నెలకు రూ. 3 వేల చొప్పున వారి బ్యాంక్ అకౌంట్‌లో డైరెక్ట్‌గా జమ చేస్తామని మంత్రి కెటిఆర్ ప్రకటించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సోమవారం హైదరాబాద్ మన్నేగూడలో నేషనల్ హ్యండ్ల్యూమ్ డే దినోత్సవాన్ని జరిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ ఈ నెలతో పాటు వచ్చే నెల కూడా ఈ చేనేత మిత్ర పథకాన్నిఅమలు అయ్యేలా చూస్తామని కెటిఆర్ హామీ ఇచ్చారు. నేతన్నల విజ్ఞప్తి మేరకు ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు కెటిఆర్ గుర్తుచేశారు. ఈ సందర్భంగా నేతన్నలకు కెటిఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

ప్రధాని చేనేత మీద 5 శాతం జీఎస్టీ వేశారు
చేనేత మీద 5 శాతం జీఎస్టీ వేసిన మొట్టమొదటి ప్రధాని మోడీ అని కెటిఆర్ మండిపడ్డారు. చేనేత వద్దు అన్ని రద్దు అనేలా కేంద్రం తీరు ఉందని కెటిఆర్ ధ్వజమెత్తారు. కేంద్రం చేనేతకారులపై మరిన్ని భారాలు వేస్తుందన్నారు. చిన్నప్పుడు చేనేతకారుల ఇంట్లో ఉండి సిఎం కెసిఆర్ చదువుకున్నారని, చేనేత కార్మికుల గురించి సిఎం కెసిఆర్‌కు తెలిసినంత ఎవరికి తెలియదని, అందులో భాగంగానే కెసిఆర్ చేనేతకు చేయూత పథకం తీసుకొచ్చారని కెటిఆర్ గుర్తు చేశారు.
చేనేతలకు రూ. 200 కోట్ల రుణాలు..
చేనేతలకు డిసిసిబి, టెస్కాబ్ ద్వారా రూ. 200 కోట్ల రుణాలు అందిస్తున్నామని కెటిఆర్ తెలిపారు. చేనేతలు తమ నివాసాల వద్ద షెడ్ నిర్మించుకునేందుకు సాయం చేస్తామని ఆయన ప్రకటించారు. నేతన్నకు చేయూత ద్వారా 59 నుంచి 75 ఏళ్ల వరకు బీమా అమలు చేస్తున్నామన్నారు. ఈ పథకం ద్వారా రూ. 5 లక్షల బీమా కల్పిస్తామన్నారు. చేనేత హెల్త్ కార్డుల ద్వారా ఓపి సేవల కింద రూ. 25 వేలు ఇస్తామని కెటిఆర్ ప్రకటించారు. రూ. 40.50 కోట్లతో 10,652 ఫ్రేమ్ మగ్గాలు అందుబాటులోకి తెస్తామని కెటిఆర్ పేర్కొన్నారు. కొత్తగా 16 వేల మగ్గాలను ఇవ్వాలని నిర్ణయించామని, దీనికి తెలంగాణ చేనేత మగ్గం అని పేరు పెట్టామని కెటిఆర్ ప్రకటించారు. నేటి నుంచి తెలంగాణ చేనేత మగ్గం పథకం అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

నేతన్నల కోసం చేనేత హెల్త్ కార్డు..
మృతి చెందిన కార్మికుల కుటుంబానికి టెస్కో సాయాన్ని రూ. 25 వేలకు పెంచుతామని కెటిఆర్ ప్రకటించారు. నేతన్నల కోసం చేనేత హెల్త్ కార్డు ప్రారంభిస్తున్నామని తెలిపారు. చేనేత కార్మికులను కాపాడుకుంటానని 2001లోనే సిఎం కెసిఆర్ మాట ఇచ్చారని, ఇచ్చిన మాట ప్రకారం సిఎం కెసిఆర్ నేతన్నలకు అండగా నిలుస్తున్నారన్నారు. వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్‌టైల్స్ పార్కు ఏర్పాటు చేశామన్నారు. శ్రామికులుగా సూరత్ వెళ్లి పారిశ్రామికులుగా స్వరాష్ట్రం తిరిగి వచ్చారన్నారు. ఉప్పల్‌లో అద్భుతమైన హ్యాండ్లూమ్ మ్యూజియం నిర్మిస్తామని, పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్కును రూ. 12.60 కోట్లతో పునరుద్ధరణ చేస్తున్నామని కెటిఆర్ తెలిపారు.

కేంద్రంలో తప్పకుండా సంకీర్ణ ప్రభుత్వమే వస్తది
కేంద్రంలో తప్పకుండా సంకీర్ణ ప్రభుత్వమే వస్తదని, ఆ సంకీర్ణ ప్రభుత్వంలో మనపాత్ర తప్పకుండా ఉంటదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వానికి నేతన్నల గురించి తెల్వదని కెటిఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో ఇంటిరీయర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పాటు కావాలంటే మన ప్రభుత్వం ఉండాలని కెటిఆర్ తెలిపారు. నేషనల్ టెక్స్‌టైల్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు కావాలంటే కేంద్రంలో మన పాత్ర ఉండాలని, కేంద్రం నుంచి కూడా అదనంగా డబ్బులు తెచ్చుకోవాలని కెటిఆర్ పేర్కొన్నారు. కేంద్రం రద్దు చేసిన అన్నింటిని తిరిగి ప్రారంభించాలని, ఎవరైతే మీకు కష్టకాలంలో అండగా ఉన్నారో వారిని తప్పకుండా ఆదరించాలని కెటిఆర్ సూచించారు. తప్పకుండా భవిష్యత్‌లో ప్రభుత్వం మీ వెన్నంటి నడుస్తుందని, రాష్ట్రంలో తిరిగి తప్పకుండా కెసిఆర్ ముఖ్యమంత్రి అవుతారని, అందులో ఎలాంటి అనుమానం లేదని కెటిఆర్ స్పష్టం చేశారు.

ఉప్పల్ శిల్పారామంలో చేనేత భవన నిర్మాణానికి శంకుస్థాపన
జాతీయ చేనేత దినోత్సం సందర్భంగా ఉప్పల్ శిల్పారామంలో చేనేత మ్యూజియం నిర్మాణానికి మంత్రి కెటిఆర్ శంకుస్థాన చేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ ఎల్.రమణతో కలిసి ఈ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. 500 గజాల స్థలంలో దీనిని నిర్మిస్తున్నారు. అదేవిధంగా చేనేత వస్త్రాల వ్యాపార నిర్వహణ, క్రయ,విక్రయాదారుల సమావేశాలు, సదస్సుల నిర్వహణ కోసం చేనేత కన్వెన్షన్ సెంటర్‌ను సైతం ప్రభుత్వం నిర్మించనుంది. దీనికోసం ఉప్పల్ భగాయత్‌లో 2,375 గజాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News