మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో ఏర్పాటైన ఖమ్మం ఐటీ హబ్ ముందంజలో ఉందని పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ప్రశంసించారు. మంగళవారం ఖమ్మం ఐటి హబ్ ప్రథమ వార్షిక నివేదికను మంత్రి కెటిఆర్‌కు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ..ఐటి రంగంలో ఉపాధితో పాటు వృత్తి నైపుణ్యతను పెంపొందించేందుకు టాస్క్ ద్వారా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఐటి ఎగుమతుల విలువ రూ.1,45,522 అన్నారు. రాష్ట్రంలో ఐటి రంగంలో 6,28,615 మందికి ఉద్యోగాలు చేస్తున్నారని వెల్లడించారు.ద్వితీయ శ్రేణి నగరాల్లో సమాచార సాంకేతికతను విస్తరిస్తున్నామని, 1800 అంకురాలు (స్టార్టప్స్) ఏర్పాటయ్యాయని మంత్రి తెలిపారు. సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ కృషితో ఐటి రంగంలోనూ ఖమ్మంకు ప్రథమ స్థానం లభించిందని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు.మంత్రి కెటిఆర్ కృషితో ఖమ్మం ఇతర ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు దిగ్గజ ఐటీ కంపెనీలు కూడా ఆసక్తి చూపిస్తున్నాయని అజయ్‌కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి వంటి రంగాల్లోనే కాదు పరిశ్రమలు, ఐటీ రంగాల్లోనూ అద్భుతంగా పురోగమిస్తోంది అని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు.
కెటిఆర్‌ను కలిసి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్..
నూతన సంవత్సరం పురస్కరించుకుని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్, వరంగల్ జిల్లా నేతలు ప్రగతిభవన్‌లో మంగళవారం టిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు, ఐటి,పురపాలక, పరిశ్రమల శాఖల మంత్రి కెటిఆర్‌ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాను అన్ని విధాల అగ్రగామిలో నిలిపేందుకు సహకరించాలని కెటిఆర్‌ను వారు కోరారు. కలిసిన వారిలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, నన్నపనేని నరేందర్, టిఆర్‌ఎస్ నేతలు ఉన్నారు.
KTR Praised Khammam IT Hub