Sunday, January 19, 2025

వినోద్ కుమార్ గళం.. కరీంనగర్‌కు బలం : కెటిఆర్

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు వినోద్ కుమార్ గళం కరీంనగర్‌కు బలం అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ హ్యాండిల్లో ఆయన ఒక పోస్టు పెట్టారు. బిఆర్‌ఎస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన వినోద్ కుమార్‌కు భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో వినోద్‌కుమార్ చురుకైన పాత్ర పోషించారని కెటిఆర్ ఎక్స్ వేదికగా కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన నిక్క్సాన ఉద్యమకారుడు బోయినపల్లి వినోద్ కుమార్ అని పేర్కొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ వినోద్ కుమార్.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001లో ఏర్పాటైన టిఆర్‌ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరని పేర్కొన్నారు. 2004లో ఎంపీగా గెలిచిన తర్వాత పార్లమెంట్‌లో 32 పార్టీలు తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇవ్వడంలో వినోద్ కుమార్ కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు.

2014లో కరీంనగర్ ఎంపీగా గెలిచిన వినోద్ కుమార్ అనుక్షణం నియోజకవర్గ అభివృద్ధి కోసం.. తెలంగాణ రాష్ట్రం కోసం తన గళాన్ని బలంగా వినిపించారని చెప్పారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, హక్కుల కోసం అత్యధిక చర్చల్లో పాల్గొన్నారని, పార్లమెంట్‌లో 500 పైచిలుకు ప్రశ్నలు సంధించి.. దేశంలోనే అత్యధిక ప్రశ్నలు వేసిన ఎంపీల్లో రెండో స్థానంలో నిలిచారని తెలిపారు. కరీంనగర్ పట్టణం స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు ఎంపిక అవ్వడంలో, జాతీయ రహదారులు, రైల్వే లైన్ రావడంలో వినోద్‌కుమార్ కీలకపాత్ర పోషించారని అన్నారు. విద్యుత్, సాగునీరు, హైకోర్టు, 95 శాతం స్థానిక రిజర్వేషన్లు.. ఇలా తెలంగాణకు సంబంధించిన వివిధ అంశాలపై పార్లమెంట్‌లో, ఢిల్లీలో వినోద్ కుమార్ అలుపెరగని పోరాటం చేశారని పేర్కొన్నారు. కరీంనగర్ పార్లమెంటు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే వినోద్ కుమార్.. మన కరీంనగర్ అభివృద్ధి కోసం.. మన సమస్యల పరిష్కారం కోసం..

బిఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థిగా మరోసారి మన ముందుకు వస్తున్నారని చెప్పారు. కొన్నేళ్లుగా కలగానే మిగిలిపోయిన ట్రిపుల్ ఐటీ వంటి సంస్థలు కరీంనగర్‌కి రావాలంటే లోక్‌సభలో వినోద్ కుమార్ గొంతు వినిపించాలని అన్నారు. వినోద్ కుమార్ గళం.. కరీంనగర్‌కు బలం.. కారు గుర్తుకే ఓటేద్దాం.. వినోద్ కుమార్ గారిని గెలిపిద్దాం అని కెటిఆర్ ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News