మహబూబ్‌నగర్ జిల్లాలో ఆసుపత్రుల ఆధునీకరణపై కెటిఆర్ ప్రశంసలు
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రజారోగ్యమే పరమావధిగా తెలంగాణ ప్రభుత్వం అకుంఠిత దీక్షతో పనిచేస్తోంది. ఆరోగ్య సంరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల్లోని మండల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లను ఆధునీకరిస్తోంది. ఆ దిశగా రూపకల్పన చేస్తోంది. పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు లభించాలన్నదే ప్రభుత్వ అంతిమ లక్షం. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ నిరంతరం మానిటరింగ్ నిర్వహిస్తూ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లను పునరుద్ధరిస్తూ పేద ప్రజలకు వైద్యం అందుబాటులోకి తేవాలనే సదుద్దేశాన్ని నెరవేరుస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఆయా జిల్లాల్లోని మండల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ల ఆధునీకరణ దిశగా వైద్యారోగ్య శాఖ నడుం బిగించింది. ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో పేద ప్రజలకు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లే ఆశాకిరణాలుగా నిలుస్తున్నాయి. ప్రజా ప్రతినిధుల సహకారాన్ని సైతం తీసుకుని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ల ఆధునీకరణ పనులు చేపడుతూ వస్తోంది.
మహబూబ్‌నగర్ జిల్లాలోని బాలానగర్, కోయిల్కొండ మండలాల్లోని ఆరోగ్య కేంద్రాలు ఇందుకు ప్రతీకగా నిలుస్తున్నాయి. నాడు ఆయా కమ్యూనిటీ సెంటర్‌లు ఏ పరిస్థితుల్లో ఉన్నాయి.. నేడు ఏ విధంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చి పేద ప్రజలకు మరింత మెరుగైన కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లుగా రూపాంతరం చెందాయనే విషయాన్ని పై రెండు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లు ఉదాహరణగా పేర్కొనవచ్చు. ఇదే విషయాన్ని మంత్రి కెటిఆర్ తన ట్విట్టర్‌లో ప్రస్తావించారు. ఆయా కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లు నాడు, నేడుతో కూడిన ఫోటోలను సైతం తన ట్విట్టర్‌లో ఆయన పొందుపర్చారు. ఆయా కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లు ఆధునీకరణతో పాటు పేద ప్రజలకు మరింత మెరుగైన వైద్యాన్నందించేలా తీర్చిదిద్దడంలో కృషి చేసిన రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు, జడ్చర్ల, నారా యణపేట ఎంఎల్‌ఎలకు మంత్రి కెటిఆర్ అభినందనలు తెలిపారు.