Friday, December 27, 2024

60 ఏళ్ల తెలంగాణ ఉద్యమంపై చెరిగిపోని సంతకం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి తెలంగాణను విముక్తి చేయడానికి మరో సంకల్ప దీక్ష చేపట్టాల్సిన అవసరం ఉందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. 2009 నవంబర్ 29న కెసిఆర్ చేపట్టిన దీక్ష దేశ రాజకీయాలను కదిలించిందని పేర్కొన్నారు. నవంబర్ 29న 33 జిల్లా పార్టీ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున దీక్షా దివస్ నిర్వహించబోతున్నామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా దీక్ష దివస్ నిర్వహించాలని పార్టీ శ్రేణులకు కెటిఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, మహమూద్ అలీ, ఎంఎల్‌ఎలు పద్మారావు, ముఠా గోపాల్, కె.పి.వివేకానంద, కాలేరు వెంకటేశ్‌లతో కలిసి కెటిఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కెటిఆర్ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి పాలనలో ఉమ్మడి రాష్ట్రం నాటి నిర్బంధాలు మళ్లీ వచ్చాయన్నారు. కెసిఆర్ స్పూర్తితో కాంగ్రెస్ కబంద హస్తాల నుంచి తెలంగాణ ప్రజలను కాపడుకుంటామని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా 2001, ఏప్రిల్ 27 నాడు గులాబీ జెండాను ఎగరవేసిన నాయకులు కెసిఆర్ అని పేర్కొన్నారు.

మహోజ్వల ఉద్యమాన్ని మలుపుతిప్పిన రోజు
తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని మలుపు తిప్పి, 60 ఏండ్ల తెలంగాణ ఉద్యమ చరిత్రపై కెసిఆర్ అనే చెరిగిపోని సంతకం చేసిన మహానాయకులు కెసిఆర్ అని కెటిఆర్ కొనియాడారు. 2009, నవంబర్ 29న కెసిఆర్ నిరాహార దీక్ష మహోజ్వల ఉద్యమాన్ని మలుపుతిప్పిన రోజు అని మనందరికి తెలుసు అని, నవంబర్ 29, 2009 స్వరాష్ట్ర కల సాకారానికి పునాది వేసిన రోజుగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే శుభదినం అని వ్యాఖ్యానించారు. తెంగాణ ప్రజలు ముక్త కంఠంతో మా తెలంగాణ మాకు కావాలని నినదించారని చెప్పారు. కెసిఆర్ సచ్చుడో..తెలంగాణ తెచ్చుడో అని తెగువను ప్రదర్శించిన నాయకుడికి అండగా నిలబడి దేశ రాజకీయ వ్యవస్థను కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కదిలించిన ఒక సందర్భం దీక్షా దివస్ అని పేర్కొన్నారు. అందరినీ మెప్పించి ఒప్పించి, దేశ రాజకీయ వ్యవస్థను,

రాష్ట్రంలో ఉండే రాజకీయ వ్యవస్థను కులమతాలకు అతీతంగా కలిపింది దీక్షా దివస్ అని కెటిఆర్ గుర్తు చేశారు. కెసిఆర్ నాయకత్వం.. ఉద్యమంలో కానీ, పరిపాలనలో కానీ చెరగని ముద్ర వేసిందని వ్యాఖ్యానించారు. రెండు జాతీయ పార్టీలకు బుద్ది చెప్పే విధంగా కదం తొక్కుతామని అన్నారు. ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన కెసిఆర్ స్పూర్తితో ముందుకు వెళతామని స్పష్టం చేశారు. రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బిజెపిల మెడలు వంచుతామన్నారు. 29న దీక్షా దివస్‌తో పార్టీ శ్రేణులు కదం తొక్కాలని విజ్ఞప్తి చేశారు. అన్ని జిల్లాలకు సీనియర్ నాయకులను ఇంచార్జిలుగా నియమించినట్లు వెల్లడించారు. ఈ నెల 26న ప్రతి జిల్లాలో ముఖ్య నాయకులు కార్యకర్తలతో సన్నాహాక సమావేశాలు నిర్వహిస్తారని, 29న దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహించబోతున్నామని అన్నారు.

డిసెంబర్ 9న మేడ్చల్ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
నవంబర్ 29న ఘనంగా దీక్ష దివస్ నిర్వహించాలని పార్టీ శ్రేణులకు కెటిఆర్ పిలుపునిచ్చారు. ఈ ఉత్సవాలలో పార్టీ ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, ఎంపీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎంఎల్‌ఎలు, పార్టీ నేతలతో పాటు బిఆర్‌ఎస్ కుటుంబ సభ్యులందరూ పాల్గొంటారని చెప్పారు. అయితే దీక్ష దివస్‌లో కెసిఆర్ పాల్గొనటం లేదని చెప్పారు. కెసిఆర్ దీక్ష విమరణ రోజు డిసెంబర్ 9న మేడ్చల్ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణతో దీక్షా దివస్ ముగిస్తామని తెలిపారు. తెలంగాణ తల్లికి ప్రణమిల్లుతూ ఉత్సవాలు నిర్వహిస్తామని అన్నారు.దీక్షా దివస్‌తో పాటు తెలంగాణ తల్లి విగ్రహా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గులాబీ కుటుంబ సభ్యులకు పిలుపునిస్తున్నానని పేర్కొన్నారు.

29న నిమ్స్ హాస్పిటల్‌లో అన్నదానం కార్యక్రమం
మలిదశ తెలంగాణ ఉద్యమంలో నిమ్స్ హాస్పిటల్ పాత్ర ఎంతో ఘనమైనదని కెటిఆర్ పేర్కొన్నారు. నాడు కెసిఆర్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నిమ్స్‌కు తరలించడంతో.. నిమ్స్ హాస్పిటల్ మలిదశ ఉద్యమానికి కేంద్ర బిందువుగా మారిదని గుర్తు చేశారు. కాబట్టి నవంబర్ 29న నిమ్స్ హాస్పిటల్లో అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తామని కెటిఆర్ తెలిపారు. ఆనాటి కార్యక్రమాలు, ఉద్యమ జ్ఞాపకాలను మళ్లీ గుర్తు తెచ్చే విధంగా మీడియా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కెసిఆర్ తెలంగాణ సమాజాన్ని ఐక్యం చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో మళ్లీ రగిలించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని కెటిఆర్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News