ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కేలా గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ వ్యవహరిస్తున్నారని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మండిపడ్డారు. తెలంగాణ భవన్ లో మంగళవారం మంత్రి కెటిఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. “బిజెపి నాయకురాలిగా గవర్నర్ వ్యవహరిస్తున్నారు. సర్కారియా కమిషన్ ప్రకారం తమిళిసై గవర్నర్ కాకూడదు. దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ ఇద్దరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తులనే ఎమ్మెల్సీలుగా కెబినెట్ సిఫార్సు చేసింది. ఎమ్మెల్సీ కోటా అభ్యర్థులను గవర్నర్ ఆమోదిస్తారని అనుకున్నాం. గవర్నర్ మనసుతో ఆలోచించి ఉంటే తిరస్కరించేవారు కాదు. రాజకీయాల్లో ఉన్నవారిని సిఫార్సు చేయవద్దని గవర్నర్ అన్నారు.
తమిళిసై గవర్నర్ అయ్యే ముందు వరకు తమిళనాడు బిజెపి అధ్యక్షురాలిగా ఉన్నారు. తమిళిసై ఇప్పటికీ బిజెపి నాయకురాలిగా వ్యవహరించట్లేదా?. తెలంగాణలోనే కాదు మిగిలిన రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. గవర్నర్లు, మోడీ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎవరిని నామినేట్ చేయాలనేది మా హక్కు. గవర్నర్ల వ్యవస్థతో ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్నారు. జోతిరాధిత్య సింథియాను రాజ్యసభకు ఎలా నామినేట్ చేశారు?. బిజెపి పాలిత రాష్ట్రాల్లో బిజెపి వాళ్లు ఫిట్.. మా నాయకులు ఫిట్ కాదా?. ఎవరు ఫిట్, ఎవరు అన్ ఫిట్ అనేది ప్రజలే నిర్ణయిస్తారు. వచ్చే ఎన్నికల్లో బిజెపి అడ్రెస్ లేకుండా పోతుంది. బిజెపికి అన్ని సీట్లల్లో డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయం” అని అన్నారు.