అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఓటమి
పార్లమెంటులో ఒక్క సీటూ రాలేదు
కవితను ఐదు నెలలు జైల్లో పెట్టారు
10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు
పార్టీ స్థాపించిన పాతికేళ్లలో దయనీయ స్థితి
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఎన్నికలు వస్తే కేసీఆర్‌దే అధికారం
కాంగ్రెస్ పాలనపై ప్రజలకు మనసు విరిగింది
కేసీఆర్ నాయకత్వంలో బీఆర్‌ఎస్ పోరాటం చేస్తోంది
నమ్మి నానబోస్తే షార్ట్ ఫిల్మ్ ప్రివ్యూకు హాజరైన బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
డిసెంబర్ 9న మాజీ సర్పంచ్‌ల ఛలో ఢిల్లీ
పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని అసెంబ్లీ ముట్టడికి పిలుపు
తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను కలిసిన రాజన్న సిరిసిల్ల జిల్లా తాజా మాజీ సర్పంచులు
మన తెలంగాణ/హైదరాబాద్: గత సంవత్సరం బీఆర్‌ఎస్ పార్టీకి అత్యంత గడ్డు కాలమని, పార్టీ స్థాపించిన పాతికేళ్లలో ఇంతటి దయనీయ స్థితి ఎప్పుడూ రాలేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ అన్నారు. శనివారం తెలంగాణ భవన్ లో రసమయి బాల కిషన్ రూపొందించిన ‘నమ్మి నానబోస్తె’ షార్ట్ ఫిల్మ్ ను ఆయన వీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సంవత్సర కాలంలో ఏం జరిగిందో కండ్లకు కట్టినట్టు చూపించారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా ఓడిపోయాం.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలతో ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు. ఎమ్మెల్సీ కవితను ఐదు నెలలు జైల్లో పెట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీకి ఒక్క సీటూ రాలేదు.
పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. పార్టీ స్థాపించిన పాతికేళ్లలో ఇంతటి దయనీయ స్థితి ఎప్పుడూ రాలేదు’అని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కు కాంగ్రెస్ కు మధ్య 1.8 శాతం ఓట్ల తేడా మాత్రమే ఉందని అన్నారు. బీఆర్‌ఎస్ పోరాడే తత్వాన్ని కోల్పోలేదని చెప్పారు. అధికారం మాత్రమే కోల్పోయిందని, అసెంబ్లీలో ప్రజల సమస్యలను లేవనెత్తుతామని చెప్పారు. బీఆర్‌ఎస్ ప్రజల్లో అభిమానం తగ్గలేదని అన్నారు. ఈ మధ్యే సర్వే రిపోర్టులు వచ్చాయని అన్నారు. కాంగ్రెస్ పై ఏడాదిలోనే వ్యతిరేకత వచ్చిందని చెప్పారు. గాంధీభవన్ బోసిపోయిందని, తెలంగాణ భవన్ కళకళలాడుతోందన్నారు.
కాంగ్రెస్ పాలనపై ప్రజలకు మనసు విరిగింది:
ఏడాది పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు మనసు విరిగిందని, మళ్లీ ఎన్నికలు వస్తే కేసీఆర్‌దే అధికారమని ఓ సర్వే ప్రతినిధి చెప్పారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తన వద్దకు ఎన్నికల సర్వేకు సంబంధించిన ఓ ప్రతినిధి వచ్చారని, కాంగ్రెస్ ఏడాది పాలన గురించి చాలా చెప్పారన్నారు. బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఇప్పుడు ఎన్నికలు వస్తే ఎలా ఉంటుందో సదరు ప్రతినిధి తనకు వివరించారన్నారు. సహజంగా ఏ ప్రభుత్వం మీద అయినా మూడు నాలుగేళ్ల తర్వాత ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాత్రం ఏడాదిలోనే వచ్చినట్లు చెప్పాడని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్‌ఎస్ పోరాటం బాగా చేస్తోందని, దీనిని కొనసాగిస్తే తిరిగి కేసీఆర్‌కు అధికారం దక్కుతుందని ఆయన చెప్పారన్నారు.
తెలంగాణ భవన్ నిత్యం కళకళలాడుతుంటే గాంధీ భవన్ మాత్రం బోసిపోతోందన్నారు. లగచర్ల ఘటనపై తమ లీగల్ సెల్ బృందం బాధితుల తరపున పోరాటం చేస్తోందన్నారు. జైల్లో ఉన్న గిరిజన రైతులను తప్పకుండా విడిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. లగచర్ల అంశంపై ఇప్పటికే జాతీయ మానవ హక్కుల కమిషన్, ఎస్సీ-ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. బకాయిలు ఇప్పించాలని మాజీ సర్పంచ్‌లు, తమ సమస్యలను అసెంబ్లీలో మాట్లాడాలని ఆశా వర్కర్లు తమను కోరుతున్నారన్నారు. ఈరోజు చాలామంది తెలంగాణ భవన్‌కు వచ్చి సమస్యలను విన్నవించుకున్నట్లు కేటీఆర్ తెలిపారు. నమ్మి నానబోస్తే షార్ట్ ఫిల్మ్ గురించి మాట్లాడుతూ ఇది గుండెను తట్టే విధంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలు రగిలిపోతున్నారన్నారు. ప్రజల తరపున,ప్రభుత్వంపై తప్పకుండా పోరాటం చేస్తామన్నారు. మనకు అధికారం మాత్రమే పోయిందని, పోరాట చేవ, యావ మాత్రం పోలేదన్నారు.
కేటీఆర్‌ను కలిసిన తాజా మాజీ సర్పంచులు:
అసెంబ్లీ సమావేశాల్లో సర్పంచ్ ల సమస్యను లెవనెత్తుతామని కెటిఅర్ హమీ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన తాజా మాజీ సర్పంచులు, 2019- 24 మధ్యకాలంలో సర్పంచులుగా పనిచేసిన వారు, తెలంగాణ భవన్‌లో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని కలిసి తమ సమస్యలను వినిపించారు. వారు తమ పదవీ కాలంలో గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బిల్లుల గురించి కేటీఆర్ ని అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని అభ్యర్థించారు. తమ పదవీ కాలంలో పల్లె ప్రగతి, రైతు వేదిక, వైకుంఠధామం, డంపింగ్ యార్డ్, పల్లె ప్రకృతి వనం, తదితర అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసినప్పటికీ, వాటికి సంబంధించిన బిల్లులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని మాజీ సర్పంచులు తెలిపారు.
గత సంవత్సరం కాలంగా ఈ బిల్లుల విడుదల కోసం తమ వంతు పోరాటం చేస్తూనే ఉన్నామని, ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. సకాలంలో బిల్లులు రాక చాలా మంది సర్పంచులు తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని, అప్పుల భారం తట్టుకోలేక కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. భార్య పిల్లలపై ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి, భూములను అమ్ముకొని, ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న తమ పరిస్థితిని వారు వివరించారు. గ్రామాల్లో తిరగలేక, తలెత్తుకొని నడవలేని స్థితికి చేరుకున్నామని వారు కేటీఆర్ కి మొరపెట్టుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచినా తమకు రావాల్సిన బిల్లులను విడుదల చేయకపోవడం బాధాకరమని, ఇది ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనమని వారు పేర్కొన్నారు. బిల్లుల విడుదల కోసం అనేకసార్లు ప్రస్తుత ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా, ఎటువంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.