Wednesday, January 22, 2025

ధాన్యం.. దండయాత్ర

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:ధాన్యం కొనుగోలు వ్యవహారంపై కేంద్రంపై దండయాత్ర చేసేందుకు టిఆర్‌ఎస్ పార్టీ సమాయత్తమైంది. ఈ మేరకు ప్రత్యేకంగా ఒక యాక్షన్ ప్లాన్‌ను రూపొందించింది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు, నిరసన కార్యక్రమాలను చేపట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఈ నెల 4 నుంచి 11వ తేదీ వరకు ఐదెంచలుగా ఉద్యమ కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించింది. 4వ తేదీన అన్ని మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు, 6న నాగ్‌పూర్, బెంగళూరు, ముంబయి, విజయవాడ జాతీయ రహదారులపై రాస్తారోకోలు, 7న హైదరాబాద్ మినహా 32 జిల్లా కేంద్రాల్లో మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యుల నేతృత్వంలో నిరసనలు, 8న అన్ని గ్రామ పంచాయతీల్లో రైతుల ఇళ్లపై నల్ల జెండాలు ఎగరవేసి నిరసనలు తెలుపనుంది. 11వ తేదీన మంత్రులు, టిఆర్‌ఎస్ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీకి చెందిన పలువురు ప్రముఖ నేతలు, రైతు సంఘ నేతలతో కలిసి ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టాలని తలపెట్టినట్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ వెల్లడించారు. శనివారం టిఆర్‌ఎస్ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. ఉప్పుడు బియ్యం కొనమని కేంద్రం మరోసారి స్పష్టం చేసిన నేపథ్యంలో…ఇక కేంద్రంపై ఉద్యమం తప్పదని హెచ్చరించారు.
ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్రం అనుసరిస్తోన్న వైఖరికి నిరసగా టిఆర్‌ఎస్ పార్టీ ఉద్యమం.. ఈ స్థాయిలో ఉండబోతుందో కేంద్రానికి చూపించబోతున్నామన్నారు. తెలంగాణ రైతులను అవమానించిన కేంద్ర ప్రభుత్వానికి, తప్పుడు ప్రకటనలతో ఆగం చేసిన రాష్ట్ర బిజెపి నాయకలుకు బుద్ది చెప్పే విధంగా ఆందోళన కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఈ నేపథ్యంలో టిఆర్‌ఎస్ నిర్వహించే ఆందోళన కార్యక్రమాల్లో రైతులు, రైతు సంఘాల నేతలు కూడా పెద్దసంఖ్యలో పాల్గొనాలని ఈ సందర్భంగా కెటిఆర్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని ప్రతి గింజ కొనుగోలు చేసేంతవరకు ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఇక తగ్గేదేలేదన్నారు. ఎంత దూరమైన పోతామన్నారు.

కేంద్ర ప్రభుత్వం పేదల ప్రజలను దోచి కార్పొరేట్లకు ధారదత్తం చేస్తోందని కెటిఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో మోడీ సర్కార్ రాష్ట్ర రైతులను మోసం చేసే విధంగా వ్యవహరిస్తోందన్నారు. యాసంగిలో పండించిన మొత్తం ధాన్యం కేంద్రమే కొనుగులు చేయాలని సిఎం కెసిఆర్ మొదలుకుని సంబంధిత మంత్రులు, అధికారులు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ…. బిజెపి సర్కార్ మొండిగా వ్యవహరిస్తోందని కెటిఆర్ మండిపడ్డారు. మోడీ సర్కార్‌కు అసలు తలా తోక లేనిదన్నారు. కార్పొరేట్లకు వత్తాసు పలికేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయంటూ ఆయన విరుచుకుపడ్డారు. రైతులపై ఏ మాత్రం ప్రేమలేని ప్రభుత్వమని ఆయన విమర్శించారు. ప్రతి యేటా వడ్లు కొనుగోలు చేసే బాధ్యత కేంద్రానిదే అన్నారు. కనీసం ఆహార భద్రత కింద ధాన్యం కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.

ధాన్యం కొనుగోళ్లపై ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో టిఆర్‌ఎస్ ఎంపీలు కేంద్రాన్ని ప్రశ్నిస్తే.. నూకలు తినాలని రాష్ట్ర రైతులు, ప్రజలను అవమానించిందని కెటిఆర్ మండిపడ్డారు. అలాగే రైతుల పక్షాన వెళ్లిన మంత్రులను అవమానించారన్నారు. ఇదే పద్దతి అని ఆయన ప్రశ్నించారు. రైతు సమస్యల వచ్చిన రాష్ట్ర మంత్రుల బృందానికి కనీస మర్యాద ఇచ్చే సంస్కారం కూడా కేంద్రానికి ఉండదా? అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యాసంగిలో వరి సాగు వద్దని రైతులకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ముందుగానే విజ్ఞప్తి చేశామన్నారు. కేంద్రం యాసంగి ధాన్యం కొనుగోలు చేయదని కూడా రైతులకు చెప్పామన్నారు. కానీ యాసంగిలో ధాన్యం పండిస్తే కేంద్రమే కొంటుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పెద్దపోటుగాడిలా చెప్పారన్నారు. మూడు సందర్భాల్లో బండి సంజయ్ మాట్లాడిన వీడియోలను ఈ సందర్భంగా కెటిఆర్ మీడియా ముందుంచారు. రైతులను వడ్లు వేసేలా బిజెపి నేతలు రెచ్చగొట్టారన్నారు. ఇప్పుడేమో ధాన్యం కొనుగోలుపై కేంద్రం చేతులెత్తేసిందన్నారు. రైతులు పండించిన ధాన్యానికి ఎవరు బాధ్యత తీసుకుంటారని ప్రశ్నించారు.
అందుకే కేంద్రం, రాష్ట్ర బిజెపి నేతల తీరుకు నిరసనగానే ప్రత్యేకంగా ఉద్యమ కార్యాచరణ చేపట్టాల్సి వస్తోందన్నారు. అప్పటికి కేంద్రం నుంచి తగు స్పందన రాని పక్షంలో తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. ఈ నిరసనలకు సమాంతరంగా లోక్‌సభ, రాజ్యసభలోనూ కేంద్రం వైఖరిని ఎండగడతామన్నారు. ధాన్యం కొనాలని అన్ని గ్రామాలు, మండల పరిషత్‌లు, మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్‌లు, పిఎసిఎస్‌ల నుంచి ప్రధానికి, కేంద్రమంత్రి పీయూష్‌గోయల్‌కు తీర్మానాలను ఇప్పటికే పంపించామన్నారు.

బిజెపి నేతల మానసిక పరిస్థితిపై అనుమానాలు
రాష్ట్ర బిజెపి నాయకుల మానసిక పరిస్థితిపై అనుమానాలొస్తున్నాయన్న కెటిఆర్ అన్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడిల్డు తలో మాట మాట్లాడుతన్నారన్నారని మండిపడ్డారు. అసలు వారికే స్పష్టత లేదని ఆయన విమర్శించారు. బండి మానసిక పరిస్థితి సరిగా ఉందో లేదో తమకు తెలియదన్నారు. ఆయన మెంటల్ కండిషన్‌పై తమకు అనుమానాలున్నాయని చురకలంటించారు. అందుకే తలోరకంగా ప్రకటనలు ఇస్తూ.. రైతులను కూడా ఆయోమయానికి గురి చేశారన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కూడా రైతులను కన్ఫ్యూజ్ చేసేలా మాట్లాడారన్నారు. ప్రతి ఏడాది భారత సర్కారు ఆనవాయితీగా ధాన్యం కొంటదని చెప్పారన్నారు. రా రైస్, పారా బాయిల్ రైస్.. ఏదైనా కేంద్ర ప్రభుత్వమే కొంటదని రైతులకు కిషన్‌రెడ్డి భరోసా ఇచ్చారన్నారు.

తెలంగాణ సర్కారుకే కేంద్రం చెప్పిందని… కానీ రాష్ట్ర ప్రభుత్వానికే అర్థం కాలేదన్నట్లుగా ఆయన మాట్లాడారని మంత్రి కెటిఆర్ దుయ్యబట్టారు. ఆయన మాట్లాడిన వీడియోను కూడా కెటిఆర్ మీడియా ముందుంచారు. ఇక కేంద్రం పెద్దలు కూడా అదే బాటలో పయనిస్తున్నారన్నారు.ఎలాంటి ధాన్యాన్ని అయినా కేంద్రం కొంటుందని గతంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట ఇచ్చి.. ప్రస్తుతం మాట తప్పారన్నారు. ఈ నేపథ్యంలో ఎవరు కరెక్టు అని ప్రశ్నించారు. ఢిల్లీలో ఉన్న బిజెపి కరెక్టా? సిల్లీ బిజెపి నేతలు కరెక్టా? వడ్లు కొంటారా? లేదా? అని కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా వన్ నేషన్, వన్ రేషన్ ఉన్నప్పుడుధాన్యం విషయంలో పంజాబ్ కో విధానం? తెలంగాణకో విధానమా? అని కెటిఆర్ ధ్వజమెత్తారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాల్సిన అవసరముందన్నారు. కేంద్ర సర్కారు తన వైఖరి మార్చుకునే వరకు రాజీలేని పోరాటం చేస్తామని ఆయన స్పష్టంచేశారు. ఈ సమావేశంలో మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్‌గౌడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపి రంజిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

KTR Press Meet on Paddy at TRS Bhavan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News