Sunday, January 19, 2025

బిజెపి-బిఆర్ఎస్ ఒక్కటైతే కెసిఆర్ కూతురు జైల్లో ఉండేవారా?: కెటిఆర్

- Advertisement -
మల్కాజ్ గిరి: గత ఎన్నికల్లో మల్కాజ్ గిరిలో రేవంత్ రెడ్డి స్వల్ప మెజార్టీ తో గెలిచారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డికి మల్కాజ్ గిరి ఎంతో ఇచ్చిందని, పిసిసి ప్రెసిడెంట్, సిఎం పదవులు రావటానికి మల్కాజ్ గిరి ప్రజలే కారణమన్నారు. అలాంటి రేవంత్ రెడ్డి ఇక్కడి ప్రజలకు ఏమి చేయలేదని, పార్లమెంట్ లో పత్తా లేకుండా పోయారని,  ప్రజలకు కష్టం వస్తే కనబడకుండా పోయారని ఎద్దేవా  చేశారు. ఈ వలస పక్షులకు ఓట్లు వేస్తే గెలిచిన తర్వాత మీకు కనబడరని మండిపడ్డారు. మల్కాజ్ గిరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారి నామినేషన్ కార్యక్రమం సందర్భంగా రోడ్ షో లో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పాల్గొన్ని ప్రసంగించారు.
మల్కాజ్ గిరి వాసులకు 24 గంటలు అందుబాటులో ఉండే రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలని, పదేళ్ల అభివృద్ధి కేసీఆర్ పాలన చూశామని, రేవంత్ రెడ్డి పాలనలో వంద రోజులు అబద్ధం కనిపడిందని చురకలంటించారు.  బడే భాయ్ మోడీ మనకు బడా మోసం చేశారని, చోట భాయ్ రేవంత్ రెడ్డి మనల్ని ఇక్కడ మోసం చేశారని ధ్వజమెత్తారు. గద్దెనెక్కంగా వెంటనే రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడని,  రుణమాఫీ అయ్యిందా? తులం బంగారం వచ్చిందా? మహిళలకు రూ. 2500 వచ్చాయా? అని కెటిఆర్ అడిగారు.  అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి మోసం పార్ట్ -1 అనే సినిమా చూపించారని,  ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు మోసం పార్ట్ -2 సినిమా చూపిస్తున్నారని, ఎక్కడ పోతే అక్కడ దేవుళ్ల మీద ఒట్టు వేసి రుణమాఫీ చేస్తా అంటున్నారని,  ఒక్కసారి మోసపోతే మోసం చేసిన వాడి తప్పు. రెండో సారి మోసం పోతే మోసపోయిన వారిదే తప్పు అని తెలియజేశారు. ఇప్పుడు ప్రజలంతా కేసీఆర్ ను గుర్తు చేసుకుంటున్నారని, హైదరాబాద్ లో ప్రజలంతా బిఆర్ఎస్ కు పట్టం కట్టారన్నారు.
గత పదేళ్లలో హైదరాబాద్ కు, తెలంగాణకు బిజెపి ఏం చేసిందని ప్రశ్నించారు. ఉప్పల్, అంబర్ పేట్ లో పదేళ్లలో రెండు ఫ్లై ఓవర్లు కూడా కట్టలేకపోతున్నారని, తాము 36 ఫ్లై ఓవర్ లు కడితే రెండు కూడా కట్టలేని చేతకాని బిజెపికి ఓట్లు అడిగేందుకు సిగ్గు ఉందా? అని కెటిఆర్ అడిగారు.  ఏం చేశారని అడిగితే చాలు జై శ్రీరామ్ అని అంటారని, శ్రీరామునితో మనకు ఎలాంటి పంచాయితీ లేదని, శ్రీరాముడు కూడా లంగలు, దొంగలను గెలిపించమని ఎప్పడు చెప్పడని, మనం కట్టలేదా యాదగిరి గుడి. కానీ ఓట్ల కోసం మతాన్ని వాడుకోలేదన్నారు. మోడీ అక్షింతలు పంపిస్తే…కేసీఆర్ దేశం మొత్తానికి తినటానికి బియ్యం పంపించారని, మోడీ వచ్చిన నాడు రూ. 400 సిలిండర్. ఇప్పుడు రూ. 1100 అయ్యిందని,
మోడీ వచ్చిన నాడు ముడి చమురు వంద డాలర్లకు బ్యారెల్ ఉందని, ఇప్పుడు ముడి చమురు బ్యారెల్ కు 84 డాలర్లు చేరుకుందని, మరి తగ్గాల్సిన ధరలు ఎందుకు తగ్గలేదని, రూ. 70 పెట్రోల్ రూ. 110 అయ్యిందిని మండిపడ్డారు.
పప్పు, ఉప్పు, చింతపండు, బస్సు, రైలు అన్ని ధరలు పెంచారని, అందుకే మోడీని ప్రజలందరూ ప్రియమైన ప్రధాని కాదు పిరమైన ప్రధాని అని అంటున్నారని కెటిఆర్ చురకలంటించారు.
అసెంబ్లీ ఎన్నికలలో ఈటల రాజేందర్, బండి సంజయ్, రఘునందన్ రావు, అర్వింద్, సోయం బాపురావును ఓడించిందెవరని, బిజెపి లీడర్లు అందరిని బిఆర్ఎస్ మాత్రమే ఓడించిందన్నారు. బిజెపిని ఓడించే దమ్ము లేని కాంగ్రెస్ కు ఓటు వేసి వృథా చేయొద్దని, కొందరు బిజెపి, బిఆర్ఎస్ ఒక్కటి అని ప్రచారం చేస్తున్నారని, నిజంగా బిజెపి, బిఆర్ఎస్ ఒక్కటైతే కెసిఆర్ కూతురు జైల్లో ఉండేదా? అని కెటిఆర్ ప్రశ్నించారు. తప్పుడు ప్రచారాలను మైనార్టీలు నమ్మవద్దని, బిజెపిని ఓడించే దమ్ము లేకనే రాహుల్ గాంధీ కేరళ నుంచి పోటీ చేస్తున్నారని, మరోసారి కాంగ్రెస్ కు ఓటు వేస్తే మొత్తం పథకాలను రేవంత్ రెడ్డి బంద్ చేస్తారని, ఏమీ చేయకపోయినా సరే ఓట్లు వేశారంటూ అన్ని పథకాలను ఆపేస్తారని, కాంగ్రెస్ చెప్పిన అన్ని పథకాలు అమలు కావాలంటే బిఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు. అందరం కలిసికట్టుగా పనిచేసి మళ్లీ కెసిఆర్ చుట్టు రాజకీయాలు తిరిగే పరిస్థితి తీసుకొద్దామని కెటిఆర్ పిలుపునిచ్చారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News