మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అమెరికా పర్యటన ముగిసింది. శనివారం ఉదయం కెటిఆర్ విదేశి పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. గత కొన్ని నెలలుగా మార్టీ ఫిరాయింపులపై బిఆర్ఎస్ పోరాడుతోంది. ఈ క్రమంలో కెటిఆర్ అమెరికా వెళ్ళిన అనంతరం కౌశిక్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి.. పార్టీ మారిన వారికి చీరలు, గాజులు పంపుతానని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీసింది. దీంతో కాంగ్రెస్ మహిళా నేతలు కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇదిలా వుంటే.. తాను బిఆర్ఎస్ లోనే ఉన్నానని చెప్పిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ నివాసానికి వెళ్లి ఆయన ఇంటిపై పార్టీ జెండా ఎగరవేస్తానని కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. దీనికి కౌంటర్ గా గాంధీనే.. కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లి నిరసన తెలిపారు.
అయితే, ఆయన అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంటిపై కోడి గుడ్లు, టమాటాలు, రాళ్లలతో దాడి చేశారు. ఇద్దరు ఎమ్మెల్యేల సవాళ్లు ప్రతిసవాళ్లతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగింది. వెంటనే సీన్ లోకి ఎంటరైన హరీశ్ రావుతోపాటు పలువురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిపీ ఆఫీస్ వద్ద ఆందోళనకు దిగడంతో అందరినీ అరెస్టు చేసి పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున బిఆర్ఎస్ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. కెటిఆర్ అమెరికా పర్యటనలో ఉండగా.. జరిగిన ఈఘటనను కెటిఆర్ తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వల్లే ఈ దాడి జరిగిందని మండిపడ్డారు. ఇక, రెండు వారాల అమెరికా పర్యటన తర్వాత హైదరాబాద్‌కు వచ్చిన కేటీఆర్.. ఈ ఘటనపై ఎలాంటి కార్యచరణ ప్రకటిస్తారోనని బిఆర్ఎస్ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.