Friday, September 27, 2024

ఫార్మాసిటీ రద్దు వెనుక వేల కోట్ల భూ కుంభకోణం

- Advertisement -
- Advertisement -

ఫార్మా సిటీ రద్దు వెనుక వేల కోట్ల భూ కుంభకోణం ఉందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి తన అన్నదమ్ములకు వేల కోట్లు దోచిపెట్టేందుకు ఈ భూమాయ కుట్ర చేస్తున్నాడంటూ విమర్శించారు. హైదరాబాద్ ఫార్మాసిటీ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలనే కాకుండా.. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని కూడా మోసం చేస్తోందని ధ్వజమెత్తారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వానికి శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ ఫార్మాసిటీని రద్దు చేసి రైతులకు భూమిని తిరిగి ఇస్తామని హామీ ఇచ్చిన మాట వాస్తవం కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు. కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఫార్మా సిటీని రద్దుచేస్తున్నామని, ఆ స్థానంలో ఫార్మా విలేజీలు, ఫార్మా క్లస్టర్లు ఏర్పాటుచేస్తామని అసెంబ్లీతోపాటు అనేక వేదికలపై ప్రకటించిందని గుర్తుచేశారు.

ఫార్మాసిటీ రద్దు విషయంలో మాయ మాటలతో మభ్యపెట్టి, అనేక ఆర్థిక అవకతవకలకు, భూదందాలకు తెర లేపుతోందని విమర్శించారు. ఇదే హైదరాబాద్ ఫార్మాసిటీని పేరు మార్చి ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సిటీ అని రకరకాల కొత్త పేర్లను తెరపైకి తెచ్చి అతి పెద్ద అవినీతి కుంభకోణానికి కాంగ్రెస్ సర్కార్ స్కెచ్ వేసిందని మండిపడ్డారు. సర్కార్ చేస్తున్న ఈ మాయాజాలం రాష్ట్ర ప్రజలకు ఇప్పటికే అర్థమైపోయిందని కెటిఆర్ స్పష్టం చేశారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును, న్యాయమూర్తులను కోర్టులో సమర్పించే ఆఫిడవిట్ లేదా వినిపించే వాదనల ద్వారా మోసం చేయడానికి ప్రయత్నిస్తే అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు. అలాగే ఈ అవినీతి కాంగ్రెస్ సర్కారుకు ప్రజాకోర్టులో కూడా శిక్ష తప్పదని కెటిఆర్ హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News