Monday, December 23, 2024

దక్షిణాది ‘లోక్’దగా

- Advertisement -
- Advertisement -

లోక్ సభ డిలిమిటేషన్లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం
కేంద్రం విధానాల మేరకు జనాభాను నియంత్రిస్తే లోక్‌సభ సీట్లను కోల్పోవడం బాధాకరం
దక్షిణాది రాష్ట్రాల ప్రజలు, నాయకులు రాజకీయాలకతీతంగా ఈ అన్యాయంపైన గళమెత్తాలని కెటిఆర్ పిలుపు
హైదరాబాద్: 2026వ సంవత్సరం తర్వాత జనాభా ప్రతిపాదికన జరగనున్న లోక్‌సభ స్థానాల డిలిమిటేషన్ వలన దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని మంత్రి కె.టి. రామారావు పేర్కొన్నారు. అధిక జనాభాతో సతమతమవుతున్న దేశాన్ని కాపాడుకునేందుకు, జనాభా నియంత్రణ పద్ధతులు పాటించాలని దశాబ్దాల నుంచి కేంద్రం చెబుతున్న మాటలను, విధానాలను నమ్మి ప్రగతిశీల విధానాలతో జనాభా నియంత్రణ చేసిన దక్షిణాది రాష్ట్రాలు ఈరోజు తీవ్ర అన్యాయానికి లోనయ్యే అవకాశం ఉందని అన్నారు. ప్రగతిశీల విధానాలతో ముందుకు పోతున్న దక్షిణాది రాష్ట్రాలు ఈ నూతన డీలిమిటేషన్ వలన తక్కువ లోక్‌సభ స్థానాలు పొందడం అన్యాయం, బాధాకరమని వ్యాఖ్యానించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తులను పట్టించుకోకుండా జనాభా నియంత్రణ చేయని రాష్ట్రాలు, ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలు లోక్ సభ సీట్ల పెంపులో లబ్ధి పొందుతున్నాయని, ఇది దురదృష్టకరమని పేర్కొన్నారు.

జనాభాను నియంత్రించిన రాష్ట్రాలు శిక్షించబడుతున్నాయి
జనాభా నియంత్రించిన కేరళ, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు ఈరోజు తీవ్రంగా తమ ప్రగతిశీల విధానాలకు శిక్షించబడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం జనాభా నియంత్రణ మాత్రమే కాకుండా అన్ని రకాల మానవాభివృద్ధి సూచీల్లోనూ దక్షిణాది రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయని, కేవలం 18 శాతం జనాభా కలిగిన దక్షిణాది రాష్ట్రాలు 35 శాతం జాతీయ స్థూల జాతీయోత్పత్తికి నిధులు అందిస్తున్నాయని తెలిపారు.

జాతీయ ఆర్థిక అభివృద్ధికి, దేశ అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తున్న దక్షిణాది రాష్ట్రాలు అసంబద్ధమైన లోక్‌సభ డిలిమిటేషన్ విధానం వలన భవిష్యత్తులో తమ ప్రాధాన్యత కోల్పోరాదని పేర్కొన్నారు. తమ ప్రగతిశీల విధానాలకు లబ్ధి పొందాల్సిన చోట తీవ్రమైన అన్యాయానికి గురవుతున్న దక్షిణాది రాష్ట్రాల వాణిని వినిపించాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న అన్యాయంపైన దక్షిణాది రాష్ట్రాల నాయకులు, ప్రజలు గళమెత్తాలని మంత్రి కెటిఆర్ పిలుపునిచ్చారు.

Also Read: ఓఆర్‌ఆర్ అవకతవకలపై సిఎంకు బండి సంజయ్ బహిరంగ లేఖ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News