Thursday, December 19, 2024

గవర్నర్ గవర్నర్‌లా ఉంటే గౌరవిస్తాం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: సమస్యలపై సమాధానం చెప్పలేక అంశాన్ని తప్పుదోవ పట్టించేందుకు గవర్నర్ అంశాన్ని తీసుకొస్తున్నారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. సిరిసిల్ల కలెక్టరేట్‌లో ఇష్టాగోష్టిగా మాట్లాడిన మంత్రి కేటీఆర్.. గవర్నర్ చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించారు. తమకు గవర్నర్‌తో పంచాయితీ ఎందుకు ఉంటుందని వ్యాఖ్యానించారు. తాము ఎక్కడ కూడా గవర్నర్ పదవికి భంగం కలిగే విధంగా వ్యవహరించలేదని స్పష్టం చేశారు. గవర్నర్ అలా ఎందుకు ఊహించుకుంటున్నారో.. ఎందుకు స్పందిస్తున్నారో..? అర్థం కావడం లేదన్నారు. శాసనసభ సంవత్సరంలో మొదటి సమావేశం అయితే గవర్నర్ ప్రసంగం ఉండాలని రాజ్యాంగంలో రాసి ఉందని.. కానీ అది తొలి సమావేశం కాదు కాబట్టి పిలవలేదని వివరణ ఇచ్చారు. కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీగా ఆమోదించనందుకు అవమానిస్తున్నారని అన్నట్లు తాను విన్నట్టు తెలిపారు. ఒక రాజకీయ నాయకురాలు గవర్నర్ కావచ్చు కానీ.. రాజకీయనాయకుడు ఎమ్మెల్సీ కాకూడదా..? అని వ్యాఖ్యానించారు. గవర్నర్ కాక ముందు తమిళిసై.. తమిళనాడు బిజెపి అధ్యక్షురాలు కాదా..? అని ప్రశ్నించారు. ‘గవర్నర్‌కు ఎక్కడ అవమానం జరిగింది.. ఎవరు ఎవర్నీ అవమానించారు. గవర్నర్.. గవర్నర్‌గా వ్యవహరిస్తే తప్పకుండా గౌరవిస్తాం. గవర్నర్ వ్యవస్థతో మాకెందుకు పంచాయితీ ఉంటుంది. కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్సీ విషయంలో అభ్యంతర పెట్టినందుకు అవమానిస్తారా..? అని గవర్నర్ చెప్పినట్లు విన్నాను. కౌశిక్‌రెడ్డి ఎంఎల్‌సి అయ్యేందుకు రాజకీయ నేపథ్యం అడ్డు వచ్చిందా..? తమిళనాడు బిజెపి అధ్యక్షురాలు.. గవర్నర్ అయ్యేందుకు రాజకీయ నేపథ్యం అడ్డురాలేదా..? గవర్నర్ మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి. గవర్నర్ ఎందుకు ఊహించుకుంటున్నారు..? నరసింహన్ గవర్నర్‌గా ఉన్నప్పుడు మాకు ఎలాంటి పంచాయితీ లేదు. గవర్నర్ విషయంలో రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటున్నాం.శాసనసభ తొలి సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉండాలని ఉంది. సమావేశం ప్రొరోగ్ కాలేదు.. అందుకే గవర్నర్ ప్రసంగం లేదు. గవర్నర్ అవమానంగా తీసుకుంటే మేము చేయగలిగిందేమి లేదు‘ అని మంత్రి కెటిఆర్ వెల్లడించారు.

KTR Reacts on Guv Tamilisai Comments

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News