హైడ్రా, మూసీ పేరుతో ప్రజల ఇండ్లు, హెచ్‌సియులో పక్షుల గూళ్లు..నోరున్న జనంపైకి బుల్డోజర్, నోరు లేని మూగజీవాల మీదకు బుల్డోజర్ అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పేర్కొన్నారు. మూసీలో, హైడ్రాలో మూటల వేట- ఆఖరికి హెచ్‌సియులోనూ కాసుల వేట అని విమర్శించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వ్యవహారంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, సిఎం రేవంత్‌రెడ్డి వ్యవహార శైలిపై కెటిఆర్ ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. పంటలు ఎండుతున్నాయి నీళ్లు లేవంటూ రైతుల గోస,- అర్ధరాత్రి బుల్డోజర్ దెబ్బలకు వన్యప్రాణాల హాహాకారాలు, చదువులు చెప్పే చోట విధ్వంసం – విలువగల భూములపై వికృత క్రీడ అని మండిపడ్డారు. ప్రజలను పాలించే నాయకుడివా భూములు చెరబట్టే రియల్ ఎస్టేట్ బ్రోకర్‌వా..? అంటూ సిఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. అప్పుడు ఫుట్‌బాల్‌తో నీకు ఆటవిడుపు.. ఇప్పుడు మూగజీవాల ప్రాణాలతో, భావిభారత భవిష్యత్ విద్యార్థులతో ఆటలా..? అని అడిగారు.
ఇది ప్రజాపాలన కాదు…ప్రజలను హింసించే పాలన అని, ఇది అప్రకటిత ఎమర్జెన్సీ అమలులో ఉన్న ఇందిరమ్మ రాజ్యం అని వ్యాఖ్యానించారు. మొదట పర్యావరణ పరిరక్షణ పేరుతో చాలా మంది పేదల ఇండ్లను కూల్చివేశారు, ఆ తర్వాత అభివృద్ధి పేరుతో గిరిజన గ్రామాలను వెంబడించారని.. బంజరు భూములు, బల్లులు కూడా గుడ్లు పెట్టవు అన్నారని పేర్కొన్నారు. ఇప్పుడు మీరు జంతువుల గూళ్ళను వెంటాడి సామూహిక హత్యలు చేస్తారంటూ మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి నడుపుతున్నది ప్రభుత్వమా లేక బుల్డోజర్ కంపెనీనా… ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధివా లేక రియల్ ఎస్టేట్ ఏజెంట్‌వా..? అని ప్రశ్నించారు. విధ్వంసం ఒక్కటే సిఎం ఎజెండా అని, ఖజానాకు కాసులు నింపుకోవడమే ఆయన లక్ష్యం అని పేర్కొన్నారు. సెలవు దినాల్లో, అర్ధరాత్రి బుల్డోజర్లు ఎందుకు నడుస్తున్నాయి రేవంత్ రెడ్డి..? అని ముఖ్యమంత్రిని నిలదీశారు. కోర్టులు అంటే సిఎంకు ఎందుకు అంత భయం, హెచ్‌సియు భూముల వెనుక ఆయన దాస్తున్న నిజం ఏమిటి..? అని కెటిఆర్ ప్రశ్నించారు.