Saturday, December 21, 2024

సమంత, నాగచైతన్య విడాకులకు కెటిఆర్ కారణం

- Advertisement -
- Advertisement -

మంత్రిగా ఉన్న సమయంలో కెటిఆర్ అనేక మంది సినిమా హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారని, సమంత, నాగచైతన్య విడిపోడానికి కారణం కెటిఆర్ అని అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. కెటిఆర్ తీరుతో సినీ పరిశ్రమలో కొంతమంది ఇబ్బంది పడ్డారని, కొందరు హీరోయిన్లు సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకుంటే మరికొందరు త్వరగా పెళ్లి చేసుకున్నారని మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారు. సినిమా పరిశ్రమలో ఈ విషయం బహిరంగ రహస్యమన్నారు. గతంలో ఎన్ కన్వేన్షన్‌ను కూల్చుతామని కెటిఆర్ సినీ హీరో నాగార్జునను బెదిరించారన్న ఆరోపణలు వచ్చాయని ఆ సమయంలో సమంత పేరు బయటకు వచ్చిందని, అందులో భాగంగానే సమంత, నాగచైతన్యకు విడాకులు అయ్యాయని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు.

గాంధీభవన్‌లో బుధవారం విలేకరులతో జరిగిన చిట్‌చాట్‌లో మరో మంత్రి పొన్నం ప్రభాకర్, పిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌లతో కలిసి మంత్రి కొండా సురేఖ మాట్లాడారు. ఈ సందర్భంగా కొండా మాట్లాడుతూ బిసి మహిళనైన తనపై అసభ్యకర పోస్టులు పెట్టడం బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను కించపరిచేలా పోస్టులు పెట్టాలని కెటిఆర్ ఆ పార్టీ కార్యకర్తలకు చెప్పినట్లు ఉందన్నారు. గతంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారా అందరినీ ఇబ్బందులకు గురిచేశారన్నారు. కెటిఆర్ మత్తు పదార్థాలకు అలవాటు పడి వారిని కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు నిర్వహించారని మంత్రి కొండా విమర్శించారు. బ్లాక్ మెయిల్ చేసి వాళ్ల జీవితాలతో కెటిఆర్ ఆడుకున్నారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. కెటిఆర్ మాదిరిగానే అందరూ ఉంటారని అనుకుంటున్నారని మంత్రి కొండా సురేఖ దుయ్యబట్టారు. అకౌంట్ తనది కాదని మాజీ మంత్రి కెటిఆర్ అంటున్నప్పుడు పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకత్వానికి చెప్పాలి కదా అని మంత్రి కొండా ప్రశ్నించారు. వారిని పార్టీ నుంచి బహిష్కరించాల్సిన అవసరం ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

మంత్రి సీతక్క, మేయర్ విజయలక్ష్మి మీద అసభ్యకర…
అర్ధరాత్రి నడి రోడ్డుపై మహిళ ఒంటరిగా నడిస్తేనే నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లని మహాత్మా గాంధీ చెప్పారని, కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఆమె అవేదన వ్యక్తం చేశారు. మహిళలు, చిన్న పిల్లలు బయటకు వెళితే సురక్షితంగా ఇంటికి తిరిగి వస్తారన్న నమ్మకం లేదని కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. యువత మాదక ద్రవ్యాలకు బానిసై దారుణాలకు పాల్పడుతున్నారని దీనివల్ల అనేక కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోతున్నాయన్నారు. గతంలో ఎస్టీ మహిళ, మంత్రి సీతక్క, మేయర్ విజయలక్ష్మి మీద అసభ్యకరంగా పోస్టులు పెట్టారని ఇప్పుడు బిసి మహిళనైన తనపై కూడా అసభ్యకరంగా పోస్టులు పెట్టడం బాధాకరమని మంత్రి కొండా ఆవేదన వ్యక్తం చేశారు.

కెటిఆర్‌కు తల్లి అక్క, చెల్లెలు లేరా?
బిఆర్‌ఎస్‌లో తాను ఐదేళ్లు పని చేశానని తన వ్యక్తిత్వం అందరికీ తెలుసని కొండా సురేఖ అన్నారు. కెటిఆర్‌కు తల్లి అక్క, చెల్లెలు లేరా? అని మంత్రి కొండా ప్రశ్నించారు. రాజకీయ విలువలు దిగజారిపోయాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తప్పు చేస్తే ఎత్తి చూపాలి తప్పితే వ్యక్తుల వ్యక్తిత్వాన్ని దెబ్బతీయవద్దని మంత్రి కొండా హితవు పలికారు. బిఆర్‌ఎస్ సోషల్ మీడియా నుంచి అసభ్యకరమైన పోస్టులు వస్తే ఊరుకునేలేదని ఆమె హెచ్చరించారు. దుబాయ్ నుంచి మూడు అకౌంట్‌ల ద్వారా ఈ అసభ్యకర పోస్టులు పెడుతున్నారని, మనుషుల మధ్య అనుబంధాలు, సంబంధ విలువలు ఉన్నాయా అని మంత్రి కొండా సురేఖ ప్రశ్నించారు.

అభ్యంతకర వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సుమోటోగా…
బిఆర్‌ఎస్ పార్టీలో బొడిగ శోభ, రేఖా నాయక్, తనకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదని మంత్రి కొండా ప్రశ్నించారు. మహిళలను బిఆర్‌ఎస్‌లో ఎదగనివ్వరని, కుటుంబ పాలన నడవాలన్న ఉద్ధేశ్యంతో తమకు పదవులు ఇవ్వలేదని మంత్రి కొండా ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై సోషల్ మీడియాలో చేసిన అభ్యంతకర వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుందన్నారు. తాము బిఆర్‌ఎస్ మాదిరిగా సోషల్ మీడియాను దుర్వినియోగం చేయమని మంత్రి కొండా తెలిపారు. మూసీ చుట్టూ ఉన్న వారిని గుర్తించి వారికి డబుల్ బెడ్ రూం లు ఇచ్చిన తరువాత వారిని ఖాళీ చేయిస్తామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. బతుకమ్మ పండుగకు ఏమీ ఇవ్వాలన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని మంత్రి కొండా సురేఖ తెలిపారు.

మహిళా మంత్రుల పట్ల కెటిఆర్ తీరు అవమానకరం: మంత్రి పొన్నం
మహిళా మంత్రుల పట్ల కెటిఆర్ తీరు అవమానకరంగా ఉందని, ఆయన వ్యవహార శైలిని మార్చుకోవాలని రవాణా శాఖ మంత్రి, పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. కెటిఆర్ చిల్లర రాజకీయాలు మానుకోవాలని మంత్రి పొన్నం సూచించారు.
హరీష్‌రావుకు ఉన్న సామాజిక స్పృహ కెటిఆర్‌కు లేదు: మహేశ్‌కుమార్ గౌడ్
టిపిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ బావకు ఉన్న సోయి బామ్మర్ధికి లేదన్నారు. కొండా సురేఖపై సోషల్ మీడియాలో వచ్చిన వ్యాఖ్యలను కెటిఆర్ ఎందుకు ఖండించలేదన్నారు. హరీష్‌రావుకు ఉన్న సామాజిక స్పృహ కెటిఆర్‌కు లేదన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News