Monday, December 23, 2024

బిజెపి తీర్థం పుచ్చుకుంటే… భారా ఖూన్ మాఫ్!

- Advertisement -
- Advertisement -

చీల్చడం, కూల్చడం బిజెపి నైజం
మోడీ సర్కార్ అరాచకాలకు నిదర్శనాలు ఇవిగో
ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ట్వీట్ రీ ట్వీట్ చేసిన మంత్రి కెటిఆర్

న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ ప్రజలు ఎన్నుకున్న బిజెపియేతర రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోయడానికి, ఇతర పార్టీలనుంచి బిజెపిలోకి ఫిరాయింపులను ప్రోత్సహించడానికి, ప్రతిపక్ష పార్టీలను వేధించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను పావులుగా ఉపయోగించుకుంటోందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. దీనికి తాజా ఉదాహరణ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అక్కడ అధికారంలో ఉన్న ఆప్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మనీశ్ సిసోడియాను సిబిఐ అరెస్టు చేయడమే. ఈ క్రమంలో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ‘ఈక్వాలిటీ బిఫోర్ లా’ అనే శీర్షికతో మోడీ ప్రభుత్వ అరాచకాల చిట్టాను ట్వీట్ చేశారు. మహారాష్ట్రలో నారాయణ రాణే, పశ్చిమ బెంగాల్‌లో సువేందు అధికారి, అసోంలో హిమంత బిశ్వ శర్మ తదితర నాయకులను కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి మోడీ సార్కర్ ఎలా దారికి తెచ్చుకున్నదో ఆ ట్వీట్‌లో వివరించారు.

కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యెడియూరప్ప అవినీతి కేసు ఉదంతాన్ని కూడా అందులో ప్రస్తావించారు. వీరే కాకుండా మహారాష్ట్రలో శివసేన ఎంఎల్‌ఎ యామినీ యాదవ్, ఆమె భర్త యశ్వంత్ యా దవ్, అదే పార్టీకి చెందిన మరో ఎంఎల్ ప్రతా ప్ సర్నాయక్ ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గంలోకి చేరగానే వారిపై నమోదైన కే సులు ఎలా మాయమయ్యాయో కూడా ప్ర శాంత్ భూషణ్ ఆ ట్వీట్‌లో వివరించారు. ఈ ట్వీట్‌కు ఆయన ‘ హౌ ద మోడీ గవర్నమెంట్ మిస్‌యూజెస్ ద ఏజన్సీస్ టు టాపెల్ గవర్నమెంట్స్, ఇండ్యూస్ డిఫెక్షన్స్ అండ్ హరాస్ అపోజిషన్స్’ అన్న క్యాప్షన్ ఇచ్చారు. ప్రశాం త్ భూషణ్ చేసిన ఈ ట్వీట్‌ను మంగళవారం తెలంగాణ మంత్రి కెటిఆర్ రీ ట్వీట్ చేశారు.

ప్రశాంత్ భూషణ్ ట్వీట్‌లోని మొదటి వ్యక్తి నారాయణ రాణే. రూ.300 కోట్ల మనీ ల్యాండరింగ్ రాకెట్‌లో నిందితుడుగా ఉన్న ఈయన ఇప్పుడు కేంద్ర మంత్రి. శివసేనకు చెందిన ఈయన గతంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా పని చేశారు. తర్వాత కాంగ్రెస్‌లో చేరిన ఆయన ఆ తర్వాత బిజెపిలో చేరి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావడమే కాకుండా కేంద్ర మంత్రి కూడా అయ్యారు. రాణే బిజెపిలో చేరగానే ఆయనపై ఉన్న కేసు దర్యాప్తు ఆగిపోయింది. ఇక పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ మంత్రివర్గంలో మంత్రిగా కూడా పని చేసిన సువేందు అధికారి నారదా స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బిజెపి ప్రలోభాలకు లొంగి ఆ పార్టీలో చేరడమే కాకుండా గత అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ అధినేత్రిమమతా బెనర్జీపై కూడా పోటీ చేసి విజయం సాధించారు కూడా.

అయితే ఆ ఎన్నికల్లో బిజెపి మెజారిటీ సాధించలేకపోవడంతో కొద్దిలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని కోల్పోయిన సువేందు ప్రస్తుతం బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు. బిజెపిలో చేరగానే ఆయనపై దర్యాప్తును నిలిపి వేశారు. ఇక ప్రస్తుతం అసోం ముఖ్యమంత్రిగా ఉన్న హిమంత బిశ్వశర్మదీ అదే కథ. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో లంచం ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన ఆ తర్వాత బిజెపిలో చేరడమే కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అయ్యారు. బిజెపిలో చేరగానే ఆయనపై ఉన్న కేసు దర్యాప్తు ఆగిపోయింది.

ఇక కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యెడియూరప్ప ఉదంతం అయితే వీటన్నిటికీ భిన్నమైనది. లంచం ఆరోపణలతో పాటుగా మైనింగ్ కుంభకోణంలో అవినీతికి పాల్పడినట్లు లోకాయుక్త విచారణలో నిర్ధారణ కావడంతో ముఖ్యమంత్రి పదవికి, శాసన సభ్యత్వానికీ రాజీనామా చేసిన ఆయన భారతీయ జనతా పార్టీపై అలకతో ఆ పార్టీనుంచి వైదొలగి సొంత పార్టీ కూడా పెట్టారు. అయినప్పటికీ ఆయనను బేషరతుగా తిరిగి బిజెపిలోకి చేర్చుకోవడమే కాకుండా మరోసారి ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టి గౌరవించింది మోడీ ప్రభుత్వం.

మహారాష్ట్రలో శివసేన ఎంపి భావనా గవ్లీ అయిదు సార్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసినా విచారణకు హాజరు కాలేదు. అయితే ఇటీవల శివసేనలో సంభవించిన చీలిక నాటకంలో ఏక్‌నాథ్ షిండే వర్గంలో చేరిన ఎంపి ప్రస్తుతం లోక్‌సభలో ఆ వర్గం చీఫ్‌విప్‌గా ఉన్నారు. అలాగే మహారాష్ట్రకే చెందిన శివసేన నేత యశ్వంత్ జాదవ్, ఎంఎల్‌ఎ అయిన ఆయన భార్య యామినీ జాదవ్‌లు ఫేమా ఉల్లంఘనలకు సంబంధించి ఇడి దర్యాప్తును ఎదుర్కొంటున్నారు. వారు షిండే వర్గంలోకి ఫిరాయించడంతో ఆ కేసు ఏమయిందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.

అలాగే మనీలాండరింగ్ కేసులో ఇడి దాడులను కూడా ఎదుర్కొన్న మరో శివసేన ఎంఎల్‌ఎ ప్రతాప్ సర్నాయక్ షిండే వర్గంలో చేరగానే ఆ కేసును మూసివేశారు. మహారాష్ట్రలో శివసేన చీలిక వర్గం నేత ఏక్‌నాథ్ షిండే ముఖ్యమంత్రి కావడానికి కమలం పార్టీ ఆడిన ఫిరాయింపుల నాటకమే కారణమనే విషయం అందరికీ తెలిసిందే. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా కొండవీటి చాంతాడంత పొడుగు ఉంటుంది. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఒత్తిళ్ల కారణంగానో , ప్రలోభాలకు లొంగిపోయో ఇతర పార్టీలనుంచి బిజెపిలో చేరిన ప్రతినేతా ఆ పార్టీనుంచి ఏదో ఒక విధంగా లబ్ధి పొందుతూ వచ్చారనేది జగమెరిగిన సత్యం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News