Wednesday, January 22, 2025

రాష్ట్రంలో జల విప్లవానికి నాంది పలికాం: కేటిఆర్

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో జల విప్లవానికి నాంది పలికాం
తక్కువ సమయంలో కాళేళ్వరం.. పాలమూరు లిఫ్ట్‌స్కీమ్‌లు పూర్తి
ప్రభుత్వ సమర్ధతకు అద్దం పట్టిన ప్రాజెక్టులు
మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ఏర్పడిన తొమ్మిదేళ్లలో కాళేశ్వరం, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను తక్కువ వ్యవధిలో నిర్మించడం ద్వారా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు చైతన్యవంతమైన నాయకత్వంలో రాష్ట్రంలో జలవిప్లవానికి నాంది పలికామని మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు అన్నారు. వరి ఉత్పత్తిలో కూడా రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని పేర్కొన్నారు. రాష్ట్రానికి న్యాయంగా కేటాయించిన ప్రతి నీటి చుక్కను సాగునీటికి వినియోగించాలన్నదే ముఖ్యమంత్రి అకాంక్ష అని మంత్రి పేర్కొన్నారు.మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావుతో పాటు ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ శనివారం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 16న పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షించారు.

ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్, నీటిపారుదల, పోలీసు, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నాగర్ కర్నూల్ జిల్లా నార్లాపూర్ గ్రామంలో జరిగే కార్యక్రమంలో పాల్గొని పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభిస్తారని, అనంతరం బహిరంగ సభ ఉంటుందని కెటిఆర్ తెలియజేసారు. ఒకప్పుడు ఎండిపోయిన మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల భూములకు ఇప్పుడు పాలమూరు-రంగారెడ్డి ద్వారా ఎంతో మేలు జరగడం గర్వకారణమని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు. పోలీసులు జిల్లా యంత్రాంగంతో సమన్వయంతో పని చేయాలని, రైతులను సభాస్థలికి తీసుకువచ్చే బస్సులు మరియు ఇతర వాహనాలకు తగిన పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. హైదరాబాద్‌కు తాగునీరు అందించడమే కాకుండా గతంలో మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలకు పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేస్తూ పెద్దఎత్తున ప్రచారాన్ని చేపట్టాలని అధికారులను మంత్రి కేటిఆర్ ఆధికారులకు సూచనలిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News