హైదరాబాద్: తుంగతుర్తిలో బిఆర్‌ఎస్ నాయకులపై దాడులు జరిగియని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. బిఆర్ఎస్ భవన్ నుంచి కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. బిఆర్‌ఎస్ నాయకులపై దాడిని ఖండిస్తున్నామని, కాంగ్రెస్ దుర్మార్గాలను ప్రజల్లో ఎండగడుతామని హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో లోకసభ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇవాళ ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నేతలతో భేటీ అయ్యానని పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ ఓడిపోతుందని కలలో కూడా అనుకోలేదని, ఇవాళ సుదీర్ఘంగా సమావేశం జరిగిందన్నారు. పదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిపై చర్చ జరిగిందని వివరించారు.
1.82 శాతం ఓట్ల తేడాతోనే ఓడిపోయామని, పార్టీ నిర్మాణంపై దృష్టి పెడితే బాగుండేదని అనే అభిప్రాయానికి వచ్చామని, చిన్న చిన్న లోపాలతోనే ఓడిపోయామని వివరించారు. అభివృద్ధి విషయంలో ఎలాంటి ఫిర్యాదులు లేవని, బిఆర్‌ఎస్‌పై జరిగిన అసత్య ప్రచారాన్ని ఖండించలేకపోయామని వివరించారు. అమలు చేసిన పథకాలను సమర్థవంతంగా ప్రచారం చేసుకోలేకపోయామని కెటిఆర్ బాధను వ్యక్తం చేశారు. కెసిఆర్ సిఎంగా లేరు అన్న విషయాన్ని చాలా మంది వ్యవక్తపరుస్తున్నారని, అభ్యర్థుల మీద వ్యతిరేకతతో ఓటేశామని చాలా మంది అంటున్నారని కెటిఆర్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి గెలిచిందని, కాంగ్రెస్ మోసపూరిత హామీలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. కాంగ్రెస్ కృత్రిమమైన అనుకూలతను సృష్టించిందని ఆయన దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను పుస్తక రూపంలో బిఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చామన్నారు. తెలంగాణ ప్రయోజనాలకు శ్రీరామ రక్ష బిఆర్‌ఎస్ అని కెటిఆర్ పేర్కొన్నారు. తెలంగాణకు ఏకైక ప్రతినిధి బిఆర్‌ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. తెలంగాణ బలం గళం, దళం బిఆర్‌ఎస్ అని తెలిపారు.