హైదరాబాద్: రాష్ట్రంలోనే కాకుండా మహారాష్ట్రలో కూడా పార్టీ విస్తరించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కానీ దురదృష్టవశాత్తు 2023 ఎన్నికల్లో ఓటమిపాలయ్యమని పేర్కొన్నారు. కెసిఆర్ మీద నమ్మకం ఉంది.. కెసిఆర్‌ను తెలంగాణ కోరుకుంటుందని ఆయన వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వస్తామని దీమా వ్యక్తం చేశారు. ఎవరెన్ని కించపర్చినా మేం కుంగిపోమని కేటీఆర్ స్పష్టం చేశారు.
బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం కెటిఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. 24 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ పార్టీకి తోడుగా ఉన్న తెలంగాణ ప్రజలకు రుణపడి ఉంటామని తెలిపారు. తెలంగాణ కోసం అమరులైన అమరవీరులకు పాదాభి వందనాలు.. తెలంగాణ కోసం పోరాడిన లక్షలాది మందికి రుణపడి ఉంటామని తెలిపారు. అటు బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనంగా నిర్వహిస్తున్నారు.