Thursday, December 26, 2024

95% మా ఘనతే

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : పదేళ్లలో కెసిఆర్ హయాంలో జరిగిన ఉపాధి కల్పన తప్ప కాంగ్రెస్ హయాంలో కొత్తగా జరిగిందేమీ లే దని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు అన్నారు. 95 శాతం ప్రభుత్వ ఉద్యోగా లు స్థానిక యువతకు మాత్రమే ఉన్న రాష్ట్రాలు దేశంలో తెలంగాణ తప్ప వేరే ఏవైనా ఉన్నా యా అని ప్రశ్నించారు.అటెండర్ మొదలు గ్రూప్ వన్ ఉద్యోగాల వరకు 95 శాతం స్థానికులకే సాధించిన ఘనత కెసిఆర్‌ది మాత్రమేన ని వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఆంధ్రప్రేదశ్‌లో కాంగ్రెస్ పార్టీ పదేళ్ల
పాలనలో 26,084 ఉ ద్యోగాలు మాత్రమే భర్తీ చేశారని పేర్కొన్నారు. వాటిలో 2004 నుంచి 2014 వరకు తెలంగాణ రాష్ట్రానికి 42 శాతం అంటే 10 వేల ఉద్యోగాలు మాత్రమే వచ్చాయని, ఏటా వెయ్యి ఉద్యోగాలు మాత్రమే వచ్చాయని వివరించారు. కానీ కెసిఆర్ ప్రభుత్వ కాలంలో 2.32 లక్షల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చామని గుర్తు చేశారు.

అందులో 1.60 లక్షల ఉద్యోగాల భర్తీ పూర్తయిందని కెటిఆర్ వెల్లడించారు. 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం రేవంత్‌రెడ్డి పచ్చి అబద్దాలు చెప్తున్నారని ఆక్షేపించారు. కెసిఆర్ చేపట్టిన ఉద్యోగాలను కూడా తన ఖాతాలో వేసుకోవడం ముఖ్యమంత్రి రాజకీయ దివాళా కోరుతనంగా అభివర్ణించారు. కాంగ్రెస్ పదేళ్లలో ఏడాదికి వెయ్యి ఉద్యోగాలు ఇస్తే, తమ ప్రభుత్వం తొమ్మిదిన్నరేళ్లలో ఏడాదికి 19 వేల ఉద్యోగాలు ఇచ్చిందని కెటిఆర్ తెలిపారు. తెలంగాణ భవన్‌లో శనివారం బిఆర్‌ఎస్ నేతలు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, మాగంటి గోపినాథ్, కర్నె ప్రభాకర్, మెతుకు ఆనంద్, గ్యాదరి కిశోర్‌లతో కలిసి కెటిఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ హయాంలో భర్తీ చేసిన ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలను గణాంకాలతో వెల్లడించారు.

30 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఎప్పుడు ఇచ్చారో చెప్పాలి
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక 32 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కెటిఆర్ మండిపడ్డారు. ఆ 32 వేల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన వివరాలను కెటిఆర్ బట్టబయలు చేశారు. ఈ ఉద్యోగాలకు రేవంత్ రెడ్డి కేవలం నియామక పత్రాలు మాత్రమే అందజేశారని స్పష్టం చేశారు. 32,517 ఉద్యోగాలు ఇచ్చింది కెసిఆర్ ప్రభుత్వమే తేల్చిచెప్పారు. తాము అధికారంలోకి రాగానే 30 వేల ఉద్యోగాలు ఇచ్చానని రేవంత్ రెడ్డి, మంత్రులు ఊదరగొడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం 30 వేల ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవం అయితే ఏ తేదీన నోటిఫికేసన్ ఇచ్చారు..? రాతపరీక్ష ఎప్పుడు నిర్వహించారు..? ఫలితాలు ఎప్పుడు ఇచ్చారో తెలంగాణ నిరుద్యోగులకు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఉద్యోగాల భర్తీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇష్టమొచ్చినట్టు అబద్దాలు చెబుతున్నారని పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో గురుకులాల్లో 9,210 టిజిటి, పిటిజి పోస్టుల భర్తీకి ఏప్రిల్ 2023లో నోటిఫికేషన్ ఇచ్చామని, ఆగస్టు 2023లో రాతపరీక్షలు నిర్వహించామని తెలిపారు.ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 2024లో విడుదలయ్యాయని, ఈ పోస్టుల భర్తీని కూడా తన ఖాతాలో వేసుకోవడం రేవంత్ రెడ్డి రాజకీయ దివాలాకోరు తనానికి నిదర్శనమని విమర్శించారు. పోలీసు శాఖలో 17,516 ఉద్యోగాలకు ఏప్రిల్ 2022లో నోటిఫికేషన్ ఇచ్చి, జూన్ 2023లో రాతపరీక్షలు నిర్వహించామని, అక్టోబర్ 4, 2023లో ఫలితాలు వచ్చాయని తెలిపారు.

అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో భర్తీ ప్రక్రియ ఆగిపోయిందని, పోలీసు ఉద్యోగాల భర్తీ కెసిఆర్ హయాంలోనే జరిగిందని, రేవంత్ రెడ్డి నియామక పత్రాలు ఇచ్చి బుకాయించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. అలాగే 5,204 స్టాఫ్ నర్సు ఉద్యోగాల భర్తీకి డిసెంబర్ 2022లో నోటిఫికేషన్ జారీ చేసి, ఆగస్టు 2, 2023న రాతపరీక్ష నిర్వహించామన్నారు. డిసెంబర్ 23, 2023న ఫలితాలు ప్రకటించామని, ఇవి కూడా తానే ఇచ్చినట్టు రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారని విమర్శించారు. అదేవిధంగా 587 ఎస్‌ఐ, ఏఎస్‌ఐ పోస్టులకు ఏప్రిల్ 2022లో నోటిఫికేషన్ జారీ అయిందని, ఏప్రిల్ 2023లో రాతపరీక్ష నిర్వహించి, ఆగస్టు 7 2023లో ఫలితాలు ప్రకటించామని, కానీ న్యాయపరమైన చిక్కుల వల్ల నియామక పత్రాలు ఇవ్వలేకపోయామని పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు రేవంత్ రెడ్డి కేవలం నియామక పత్రాలు మాత్రమే ఇచ్చారని, 32 వేల ఉద్యోగాలు భర్తీ చేసింది మాత్రం కెసిఆర్ అని స్పష్టం చేశారు. తొమ్మిదిన్నరేండ్ల కాలంలో 1.60 లక్షల ఉద్యోగాలు పూర్తిస్థాయిలో భర్తీ చేయగా, 32 వేల ఉద్యోగాలు కొన్ని కారణాల వల్ల ఆగిపోయాయని, ఇవి అవి మొత్తం కలుపుకుంటే కెసిఆర్ భర్తీ చేసిన ఉద్యోగాలు ఒక లక్షా 92 వేల పైచిలుకు ఉద్యోగాలు అని కెటిఆర్ వివరించారు.

కెసిఆర్ హయాంలో 2,32,308 ఉద్యోగాల భర్తీకి అనుమతి..
కెసిఆర్ హయాంలో 2 లక్షల 32 వేల 308 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చిందని, అందులో 2 లక్షల 2 వేల 735 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశామని కెటిఆర్ తెలిపారు. టిఎస్‌పిఎస్‌సి ద్వారా 60,918 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తే, 54,015 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యాయని, 35,250 ఉద్యోగాలు భర్తీ కాగా, మరో 18,765 ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ కొనసాగుతోందన్నారు. అలాగే పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 50,425 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తే, 48,247 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యాయని, అందులో 47,068 ఉద్యోగాలు భర్తీ కాగా, 1179 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. గురుకుల రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా 17,631 ఉద్యోగాలకు అనుమతిస్తే, 12,904 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ కాగా, 3,694 ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు.అందులో 9,210 ఉద్యోగాలు భర్తీ దశలో ఉన్నాయని తెలిపారు.

డిఎస్‌సి ద్వారా 34,100 ఉద్యోగాలకు అనుమతి ఇస్తే, 28,534 ఉద్యోగాలకు నోటిఫికేసన్లు ఇచ్చామని, అందులో 22,892 భర్తీ చేశామని, మరో 5,642 ఉద్యోగాలు భర్తీ దశలో ఉన్నాయని వివరించారు. మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్దు ద్వారా 14,283 ఉద్యోగాలకు అనుమతి ఇస్తే, 9684 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశామని, అందులో భర్తీ చేసింది 2047 ఉద్యోగాలు అని, మిగతా 7637 ఉద్యోగాలు భర్తీ దశలో ఉన్నాయన్నారు. విశ్వవిద్యాలయాలకు ఉమ్మడి నియామక బోర్డు తలపెడితే అప్పటి గవర్నర్ అడ్డుపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. తద్వారా యూనివర్సిటీల కామన్ బోర్డు ద్వారా జరగాల్సిన 105 ఉద్యోగాలకు భర్తీ జరగలేదని అన్నారు. మొత్తంగా కెసిఆర్ హయాంలో 2,32,308 పోస్టులకు అనుమతి ఇచ్చామని, అందులో 2,02,735 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశారని, వాటిలో 1,60,083 ఉద్యోగాలు భర్తీ అయ్యాయని చెప్పారు. మిగిలిన 42,652 ఉద్యోగాలు భర్తీ దశలో ఉన్నాయని తెలిపారు.

రేవంత్ హయాంలో ఒక్క ఉద్యోగానికి నోటిఫికేషన్ రాలేదు
కెసిఆర్ హయాంలో 1,60,083 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేశామని కెటిఆర్ తెలిపారు. ఏడాదికి 2 లక్షలు ఉద్యోగాలు ఏడాదిలో ఇస్తామన్నారని రేవంత్‌రెడ్డి అన్నారని, కానీ ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదని విమర్శించారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం గ్రూప్ -1 కింద 503 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే.. దాన్ని రద్దు చేసి కొత్తగా 60 పోస్టులు కలిపి మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చారని, దాన్ని కొత్త నోటిఫికేషన్ అంటున్నారని అన్నారు. 50 వేల పోస్టులతో మెగా డిఎస్‌సి ఇస్తామన్నారని, కానీ తాము 5,089 పోస్టులతో డిఎస్‌సి నోటిఫికేషన్ ఇస్తే దాన్ని కూడా రద్దు చేశారని చెప్పారు. 50 వేల ఉద్యోగాలతో డిఎస్‌సి నోటిఫికేషన్ వస్తదని అనుకుంటే.. 5,089 పోస్టులకు అదనంగా మరో 5913 కలిపి 11 వేల ఉద్యోగాలతో కొత్త నోటిఫికేషన్ ఇచ్చారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా నోటిఫికేషన్లు ఇవ్వకపోగా 2 లక్షల ఉద్యోగాల మాట తుంగలో తొక్కారని మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్‌కు అతీగతీ లేదని, 4 వేల నిరుద్యోగ భృతి హామీ ఇవ్వలేదని శాసనసభలోనే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పచ్చి అబద్దం చెప్పారని కెటిఆర్ మండిపడ్డారు.

టెట్ ఫీజును రూ.2 వేలకు పెంచారు
ప్రభుత్వ ఉద్యోగాలకు నిర్వహించే రాత పరీక్షలకు రూపాయి కూడా ఫీజు తీసుకోనని రేవంత్ రెడ్డి అన్నారని, కానీ టెట్ ఫీజును రూ.400 నుంచి రూ.2 వేలకు పెంచారని కెటిఆర్ పేర్కొన్నారు. తాము కష్టపడి పరిశ్రమలు తెస్తే..వాటిని రేవంత్ పాతరేస్తున్నారని విమర్శించారు. ఫార్మా సిటీ పేరిట 12 వేల ఎకరాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ పెట్టి, ప్రత్యక్షంగా, పరోక్షంగా 5 లక్షల ఉద్యోగాల సృష్టికి రంగంమంతా సిద్దం చేస్తే దానిని కూడా రేవంత్ రద్దు చేశారని చెప్పారు. ఫార్మా సిటీని పక్కనపెట్టి.. రియల్ ఎస్టేట్ చేస్తానని రేవంత్ రెడ్డి అంటున్నాడని కెటిఆర్ ధ్వజమెత్తారు.

తెలంగాణ యువతకు తీవ్ర అన్యాయం..
ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో యధేచ్చగా తెలంగాణకు రావాల్సిన ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో తీవ్రమైన వివక్ష, అన్యాయం జరిగిందని కెటిఆర్ గుర్తు చేశారు. దాన్ని నిరసిస్తూ ఎన్నో సందర్భాల్లో కెసిఆర్ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారని, హైదరాబాద్‌ను ఫ్రీ జోన్‌గా ప్రకటించడాన్ని నిరసిస్తూ కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేశారని తెలిపారు. ఉమ్మడి ఎపిలో రాష్ట్రపతి ఉత్తర్వులను యధేచ్చగా, ఇష్టానుసారంగా నాటి ప్రభుత్వాలు తుంగలో తొక్కి ఉత్తర్వులను ఉల్లంఘించాయన్నారు. జోనల్ విధానంలో ఉన్న ఓపెన్ కోటాను నాన్ లోకల్ కోటాగా అన్వయిస్తూ.. సమైక్య పాలకులు తెలంగాణ యువతకు తీవ్ర అన్యాయం చేశారని అన్నారు. తెలంగాణ ఏర్పడి ఒక దశాబ్ద కాలం అవుతోందని, ఉపాధి కల్పన రంగంలో తెలంగాణ అనేక విజయాలు సాధించిందని కెటిఆర్ తెలిపారు. గత పదేండ్లలో ఇప్పటి దాకా కూడా కెసిఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఉపాధి కల్పన తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా జరిగింది ఏమీ లేదని విమర్శించారు. ఈ దశాబ్ద కాలంలో జరిగిన ఉపాధి కల్పన గురించి తెలంగాణ యువతకు చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. నీళ్లు, నిధులు నియమకాలు ప్రతిపాదికన తెలంగాణ ఉద్యమం జరిగిందని, కెసిఆర్ నాయకత్వంలో సాధించిన ప్రగతి, ఉపాధి కల్పన రంగంలో సాధించిన విజయాలను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నామన్నారు.

కాంగ్రెస్, బిజెపిలకు కెటిఆర్ సవాల్
అటెండర్ నుంచి గ్రూప్ 1 ఆఫీసర్ దాకా 95 శాతం ఉద్యోగాలు స్థానిక పిల్లలకే ఇచ్చే రాష్ట్రం తెలంగాణ తప్ప మరొకటి ఉన్నదా..? ఒకవేళ ఉంటే తెలంగాణ యువతకు చెప్పాలని బిజెపి, కాంగ్రెస్ నాయకత్వాన్ని సవాల్ చేశారు. ఈ రెండు పార్టీలే 75 ఏండ్లు అధికారంలో ఉన్నాయని, 28 రాష్ట్రాల్లో ఆయా పార్టీల ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయని చెప్పారు. కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రపతి, ప్రధానిని కలిసి కొత్త జోనల్ వ్యవస్థను తెచ్చామని, అటెండర్ నుంచి గ్రూప్-1 ఆఫీసర్ దాకా తెలంగాణ యువతకే ఉద్యోగాలు దక్కేలా 95 శాతం రిజర్వేషన్లు కల్పించామని అన్నారు. ఈ రిజర్వేషన్లు భారతదేశంలో ఎక్కడా లేవు అని, ఈ విషయాన్ని తెలంగాణ యువత, వారి తల్లిదండ్రులు గమనించాలని కోరారు. ఇది కెసిఆర్ వల్లే సాధ్యమైందని పేర్కొన్నారు. నిరుద్యోగుల బాధ, నియామకాల్లో వివక్ష చూసిన తర్వాత 95 శాతం రిజర్వేషన్లు కెసిఆర్ కల్పించారని పేర్కొన్నారు. కెసిఆర్ హయాంలో 24,000 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చి, రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చి 24 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించామని కెటిఆర్ తెలిపారు. కెసిఆర్ హయాంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో అన్ని రకాలుగా 26 లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చాయని పేర్కొన్నారు. తెలంగాణ కంటే ఎక్కువ ఉద్యోగాలు ఏ రాష్ట్రంలోనైనా ఇచ్చినట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని కాంగ్రెస్, బిజెపి పార్టీలకు కెటిఆర్ సవాల్ విసిరారు.

బిల్డర్లపై బ్రూ ట్యాక్స్
రాష్ట్రంలో ప్రభుత్వం బిల్డర్లపై బి,ఆర్, యూ ట్యాక్స్‌లు వేస్తున్నారని కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో భవన నిర్మాణ అనుమతులు ఇవ్వకుండా బిల్డర్లను బెదిరిస్తున్నారని ఆరోపించారు. రేపో మాపో ఎక్సైజ్ దుకాణం తెరిచి జూపల్లి ట్యాక్స్ కూడా వస్తుందని అంటున్నారని వ్యాఖ్యానించారు. ఢిల్లీకి సామంత రాజుల్లా కప్పం కడుతున్నారని కెటిఆర్ దుయ్యబట్టారు.
కాంగ్రెస్ సర్కార్ వచ్చాక ఏం జరుగుతుందో ఆలోచించాలి
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏం జరుగుతుందో ఆలోచించాలని కెటిఆర్ కోరారు. పట్టభద్రుల ఎంఎల్‌సి ఉపఎన్నికలో విద్యావంతులు సరైన నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు. యువత ఆశలు నెరవేరాలంటే ఎంఎల్‌సి ఉపఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. కెఎ పాల్ తరహాలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై జోకులు వేయాల్సి వస్తోందని అన్నారు. కరెంట్ పోతుందని మంత్రి నోటి నుంచి మాట ఎలా వస్తుందని ప్రశ్నించారు. ఎలాంటి మూర్ఖులు, జోకర్లు ప్రభుత్వాన్ని నడుపుతున్నారో అర్థం చేసుకోవాలని అన్నారు. ఉస్మానియా విద్యార్థులను అడ్డమీది కూలీలుగా, బీరు బిర్యానీకి ఆశపడే వ్యక్తులుగా అభివర్ణించిన వ్యక్తి రేవంత్‌రెడ్డి అని గుర్తు చేశారు. 20,000ల మెగావాట్ల విద్యుత్ వ్యవస్థ అప్పగిస్తే సన్నాసులకు నడపడం చేత కావడం లేదని మండిపడ్డారు. మేడిగడ్డలో మొన్నటి వరకు తిట్టి ఇపుడు కెసిఆర్ చెప్పిన కాపర్ డ్యామ్ నిర్మించేందుకే ముందుకు వచ్చారని కెటిఆర్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News