మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెద్ద మార్పే తెచ్చిందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎద్దేవా చేశారు. ఆనాటి కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ హాస్టళ్లలో పురుగుల అన్నం, నీళ్ల చారు ఉంటే నేడు బల్లిపడిన టిఫిన్లు, చిట్టెలుకలు తిరిగే చట్నీలు దర్శనమిస్తున్నాయని విమర్శించారు. సుల్తాన్‌పూర్ జెఎన్‌టియు హాస్టల్‌లో చట్నీలో ఎలుక దర్శనం ఇవ్వడం, పలు హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్‌పై కెటిఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రజలు మార్పు రావాలి కాంగ్రెస్ కావాలని కోరుకుంటే మొత్తానికి కాంగ్రెసోళ్లు వచ్చారు…పెద్ద మార్పే తెచ్చారని కెటిఆర్ పేర్కొన్నారు. మొన్న భువనగిరి సాంఘిక సంక్షేమ పాఠశాలలో, కలుషిత ఆహారం తిన్న విద్యార్థి జీవితం విషాదాంతం..నిన్న కోమటిపల్లి హాస్టల్‌లో ఉప్మాలో బల్లి పడి 20 మంది విద్యార్థులకు వాంతులు చేసుకున్నారనే వార్తలు షాక్‌కు గురి చేశాయని పేర్కొన్నారు.
సుల్తాన్‌పూర్ జెఎన్‌టియు హాస్టల్‌లో చట్నీలో చిట్టెలుక దర్శనంతో విద్యార్థులు బెంబేలెత్తి పోయారని మండిపడ్డారు. ఈ విషాహారం తింటే, విద్యార్థుల ప్రాణాలకు గ్యారెంటీ ఎవరు..? అని కెటిఆర్ ప్రశ్నించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులకు భరోసా ఎక్కడ ఉందని నిలదీశారు. కలుషిత ఆహారం వల్ల, పిల్లలు ఆడుకోవాల్సిన వయసులో ఆసుపత్రుల పాలవుతున్నారని దుయ్యబట్టారు. అస్తవ్యస్థంగా మారిన ప్రభుత్వ వ్యవస్థ వల్లే, విద్యార్థులకు ఈ అవస్థలు వచ్చాయని పేర్కొన్నారు. ఇకనైనా కాంగ్రెస్ సర్కారు కళ్లు తెరవాలని లేకపోతే భావిభారత పౌరుల నిండు ప్రాణాలకే ప్రమాదమని ఆవేదన వ్యక్తం చేశారు. సర్కారు ఈ వైఫల్యాలను సరిచేయకపోతే ఊహించని విషాదం ముంచుకొస్తొందని కెటిఆర్ ఆగ్రహం చెందారు.
ఇకో పార్క్ పనులపై స్పందించిన కెటిఆర్ : దేశంలోనే అతిపెద్ద ఏవియరీ, అక్వేరియం, బోర్డ్ వాక్ సౌకర్యాలతో పచ్చదనం కనువిందు చేసేలా సుందరమైన ల్యాండ్ స్కేప్‌లతో బిఆర్‌ఎస్ సర్కారు ఇకో పార్క్ చేపట్టిందని ఎక్స్ వేదికగా కెటిఆర్ గుర్తుచేశారు. 2022 అక్టోబర్‌లో తమ ప్రభుత్వం హిమాయత్ సాగర్ లేక్ ఫ్రంట్‌లో ఇకో పార్క్ ప్రాజెక్టును చేపట్టిందని, అయితే, తాము అధికారంలో ఉన్నంతవరకు ఆ పార్క్ పనులు సవ్యంగానే సాగినప్పటికీ, గత కొంత కాలంగా సరైన మద్దతు లేక పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయినట్టు తెలిపారు. ఇకో పార్క్‌కు సంబంధిచిన ఫోటోలను కెటిఆర్ ఎక్స్‌లో పోస్టు చేశారు. తక్షణం ప్రాజెక్టు పనులను ముందుకు తీసుకువెళ్లేందుకు సిఎంఒ చర్యలు చేపట్టాలని కెటిఆర్ కోరారు.