Friday, January 17, 2025

సిఎంకు సంక్రాంతి సవాల్

- Advertisement -
- Advertisement -

 న్యాయమూర్తి సమక్షంలో ఇద్దరం లైవ్‌లో లైడిటెక్టర్ పరీక్షలు
చేయించుకుందాం తేదీ, సమయం, స్థలం నువ్వే
నిర్ణయించు మళ్లీ విచారణకు రావాలని ఇడి చెప్పలేదు
ఒక్క రూపాయి అవినీతి చేయకున్నా విచారణకు వచ్చా
తప్పు చేయలేదు.. చేయబోను.. తప్పు రుజువుచేస్తే ఏ
శిక్షకైనా సిద్ధ్దం అడిగిన ప్రశ్నలనే తిప్పితిప్పి అడిగారు
రేవంత్‌పై ఎసిబి, ఇడి కేసులున్నాయని నాపై పెట్టించాడు
ఇడి విచారణ అనంతరం మీడియాతో కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : ఎసిబి లాగానే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా అడిగిన ప్రశ్నలనే మళ్లీ మళ్లీ అడిగిందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. ఎసిబి 80 ప్రశ్నలు, ఇడి 40 ప్రశ్నలు అడిగిందని, అన్నింటికి సమాధానాలు ఇచ్చానని చెప్పారు. విచారణకు ఎన్నిసార్లు పిలిచినా వస్తానని ఇడికి చెప్పినట్లు వెల్లడించారు. తెలిపారు. 7 గంటల పాటు కొనసాగిన ఇడి విచారణ అనంతరం ఇడి కార్యాలయం వద్ద కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. తాను ఏ తప్పు చేయకున్నా చట్టాలను గౌరవించే పౌరుడిగా విచారణకు వచ్చానని, ఒక్క రూపాయి అవినీతి చేయలేదని స్పష్టం చేశారు. ఓటుకు నోటుకు కేసులో అడ్డంగా ఎసిబికి రేవంత్ రెడ్డి దొరికారు కాబట్టే తన మీద కూడా ఎసిబి కేసు పెట్టించారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి మీద ఇడి కేసు ఉంది కాబట్టే తన మీద ఈ ఇడి విచారణ జరిపిస్తున్నారని పేర్కొన్నారు.తాను న్యాయమూర్తి, మీడియా ముందు ప్రత్యక్ష విచారణకు సిద్ధం అని, దమ్ముంటే సిఎం రేవంత్‌రెడ్డి రావాలని సవాల్ విసిరారు.

తనపై పెట్టిన కేసుల్లో లై డిటెక్టర్ పరీక్షకు కూడా తాను సిద్ధమని కెటిఆర్ ప్రకటించారు. రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగానే విచారణ జరగాలని, అలా చేస్తే నిజాలు బయటకు వస్తాయని చెప్పారు. రేవంత్‌రెడ్డికి సంక్రాంతి ఆఫర్ ఇస్తున్నా… రేవంత్ రెడ్డి, తాను ఇద్దరం లై డిటెక్టర్ పరీక్షలు చేయించుకుందాం..లైవ్‌లో లై డిటెక్టర్ పరీక్షలకు తాను సిద్ధం అంటూ కెటిఆర్ సవాల్ విసిరారు. లై డిటెక్టర్ పరీక్షలకు తేదీ, సమయం, స్థలం రేవంత్‌రెడ్డి ఇష్టం అని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డికి దైర్యం ఉంటే ఆయన జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో అయినా.. న్యాయమూర్తుల ముందైనా, ఇడి ఆఫీసులోనైనా కూర్చుందామని అన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు, భారత న్యాయవ్యవస్థ మీద, న్యాయమూర్తుల మీద తనకు పూర్తి విశ్వాసం ఉందని, తర్వాత అయినా ప్రజలకు పూర్తి వాస్తవాలు తెలుస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. అంతిమంగా నిజం, న్యాయం, ధర్మం నిజాయితీనే గెలుస్తుందని వ్యాఖ్యానించారు. తాను తప్పు చేయలేదని, చేయబోనని, తప్పు చేశానని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని ఈ సందర్భంగా తెలిపారు.

అర పైసా అవినీతి కూడా జరగలేదు

ఫార్ములా ఈ రేసు కేసులో అర పైసా అవినీతి కూడా జరగలేదని కెటిఆర్ పునరుద్ఘాంటించారు. 8 గంటలు వాళ్ళ ఇదే అడిగారు తాను ఇదే చెప్పానని అన్నారు. తప్పు చేసినట్టు రుజువు చేస్తే నేను ఏ శిక్షకైనా సిద్ధం అని పేర్కొన్నారు. పారదర్శకంగా నిధుల బదిలీ జరిగిందని, ఇంకెక్కడ మనీ లాండరింగ్ అని ఎసిబి,ఇడి అధికారులను అడిగానని అన్నారు.

విచారణ పేరుతో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయొద్దు

ఫార్ములా ఈ-రేస్ కేసు విచారణకు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లు ఖర్చువుతుందని తెలిసిందని కెటిఆర్ అన్నారు. ఈ విషయంలో తనకు ఇబ్బందిగా ఉందని వ్యాఖ్యానించారు. తాను నిజాయతీ గల వ్యక్తిని అని, కేసులన్నింటినీ న్యాయపరంగా ఎదుర్కొంటానని చెప్పారు. విచారణ పేరుతో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయొద్దని, ఈ డబ్బుతో ఇంకొక 500 మంది రైతులకు రుణమాఫీ చేయొచ్చని తెలిపారు. కక్ష సాధింపు విచారణ మంచిది కాదని అన్నారు. మళ్లీ విచారణకు రావాలని ఇడి అధికారులు చెప్పలేదని, పిలిస్తే తప్పకుండా హాజరవుతానని తెలిపారు. ఇడి కార్యాలయానికి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మీడియా ప్రతినిధులకు కెటిఆర్ ధన్యవాదాలు తెలిపారు.

మంత్రిగా నేను తీసుకున్న గొప్ప నిర్ణయాల్లో ఇది ఒకటి : కెటిఆర్ ట్వీట్

ఫార్ములా- ఈని తెలంగాణకు తీసుకువచ్చి ప్రపంచ పటంలో హైదరాబాద్ నగరాన్ని నిలపడం మంత్రిగా తాను తీసుకున్న గొప్ప నిర్ణయాల్లో ఒకటిగా నిలుస్తుందని కెటిఆర్ పేర్కొన్నారు. సోమవారం ఇడి విచారణకు వెళ్లే ముందు ఫార్ములా ఈ రేసుకు సంబంధించిన నిర్ణయాలపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ రేసు సందర్భంగా అంతర్జాతీయ రేసర్లు, ఈ- మొబిలిటీ రంగానికి చెందిన ప్రముఖులు హైదరాబాద్ నగరాన్ని ప్రశంసలతో ముంచెత్తినట్లు పేర్కొన్నారు. ఎన్ని రకాల చిల్లర కేసులు, బురదజల్లే కార్యక్రమాలు, రాజకీయ వేధింపులకు పాల్పడినా ఈ రేసు ద్వారా సాధించిన విజయాలను తగ్గించలేవు అని తెలిపారు. మంత్రిగా ఉన్నా లేకున్నా బ్రాండ్ హైదరాబాదును పెంపొందించడమే ఎల్లవేళలా ముఖ్యమైన అంశంగా తాను భావిస్తానని వ్యాఖ్యానించారు.

ఫార్ములా -ఈ రేసు హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ క్రీడా పటంలో నిలిపిందని, ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించేందుకు విజన్, నిబద్ధత, హైదరాబాద్ నగరం అంటే అమితమైన ప్రేమ ఉండాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన 46 కోట్ల రూపాయల డబ్బులు ఫార్ములా- ఈ సంస్థకు అత్యంత పారదర్శకంగా బదిలీ చేసినట్లు స్పష్టం చేశారు. కేవలం బ్యాంక్ లావాదేవీగా స్పష్టమైన రికార్డు ఉందని, ఒక్క రూపాయి కూడా వృధా కాలేదని అన్నారు. ప్రతినయా పైసాకు లెక్క ఉందని, అలాంటప్పుడు ఇందులో అవినీతి, మనీలాండరింగ్ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న అసంబద్ధమైన రేసు రద్దు నిర్ణయం వల్లనే రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లిందని ఆరోపించారు. ఎలాంటి తప్పు లేకున్నా కేవలం రాజకీయ వేధింపుల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టు కేసులు విచారణల పేరుతో ఈ అంశాన్ని లాగుతుందని ఆరోపించారు. కచ్చితంగా ఈ అంశంలో నిజమే గెలుస్తుందని, ఇదే అంశాన్ని రాష్ట్ర ప్రజలు, కోర్టులు కూడా త్వరలో తెలుసుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పటిదాకా న్యాయం కోసం తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందంటూ కెటిఆర్ ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News