ఢిల్లీ పర్యటనకు వెళ్లే ముందు సిఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.పెండ్లికి పోతున్నవో.. పేరంటానికి పోతున్నావో..సావుకు పోతున్నావో.. తెలంగాణ పౌరులుగా 28 సార్లు పోయినవ్.. 28 రూపాయలు కూడా తీసుకురాలేదు.. ఏం చేస్తున్నారు..? అని అడగడం తమ బాధ్యత అని పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధంగా మినహా ఈ ఏడాదిలో అదనంగా కేంద్రం నుండి ఒక్క రూపాయి తెచ్చింది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫైవ్ స్టార్ హోటల్లో కాళ్లు పట్టుకున్నదెవరో ..
ఇడి దాడుల నుండి తప్పించుకోవడానికి ఫైవ్ స్టార్ హోటల్లో చీకట్లో కాళ్లు పట్టుకున్నదెవరో..?..ఇడి చేసిన దాడులు కనీసం బయటకు ప్రకటించకుండా ఎవరి కాళ్ళు పట్టుకుని తప్పించుకున్నారో..? అని సిఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశిస్తూ కెటిఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. మీ బడెబాయ్, చోటే మియాల వ్యవహారం ఎవరికి తెలుసు పిట్టలదొరా అంటూ సెటైర్లు వేశారు. పోరాటం.. మా తెలంగాణ రక్తంలో ఉంది.. మేము నీలా ఎన్నడూ ఢిల్లీ గులాములం కాదు అంటూ ట్వీట్ చేశారు. పదవుల కోసం పెదవులు మూసుకున్న చరిత్ర నీది..కొట్లాడి తెచ్చిన తెలంగాణను తెర్లు చేయాలని ప్రయత్నించి పట్టుబడిన ఓటుకునోటు చరిత్ర నీది అని రేవంత్‌రెడ్డిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. కానీ, మా జెండా, మా ఎజెండా ఎన్నటికీ తెలంగాణ అభివృద్ది అంటూ కెటిఆర్ ట్వీట్ చేశారు.