Thursday, December 12, 2024

ఇది ప్రజా పాలన కాదు.. ప్రజా పీడిత పాలన :కెటిఆర్

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అదానీ వ్యతిరేక నిరసనల్లో కాంగ్రెస్ ద్వంద్వవైఖరి పాటిస్తోందని వ్యాఖ్యానించారు. పార్లమెంట్‌లో ఒకలా, తెలంగాణ అసెంబ్లీలో మరోలా వ్యవహరిస్తోందని ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు.రాహుల్ జీ..ఇది ఎలాంటి వంచన..? పార్లమెంట్‌లో అదానీ – మోదీ ఫొటో ఉన్న టీషర్ట్ ధరించడం మీకు సరైనదే అయితే.. మీ అడుగుజాడల్లో నడిచి తెలంగాణ అసెంబ్లీలో అదానీ – రేవంత్ వ్యవహారాన్ని బయటపెట్టడానికి మాకు ఎందుకు అనుమతి లేదు..? దీనికి సమాధానం చెప్పండి’ అంటూ రాహుల్‌గాంధీని కెటిఆర్ నిలదీశారు. ఈ మేరకు రాహుల్.. మోదీ – అదానీ చిత్రాలతో ఉన్న టీషర్ట్లను ధరించిన ఫొటోలను కెటిఆర్ పోస్టు చేశారు.

తెలంగాణ ప్రజలను ఏమారుస్తాం అనుకుంటే పొరపాటే : కెటిఆర్
ఇది ప్రజా పాలన కాదు.. ప్రజా పీడిత పాలన అని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండిపడ్డారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజల వేదన అరణ్య రోదనగానే మిగిలిందని విమర్శించారు. రైతులను చెరబట్టారని, పేదల ఇండ్లు కూలగొట్టారని ధ్వజమెత్తారు. రైతుబంధు ఎత్తేశారని, రైతుభీమాకు పాతరేశారని, కెసిఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ మాయం చేశారని, అమ్మవడిని ఆగం చేశారని దుయ్యబట్టారు. నిరుద్యోగుల ఉసురు పోసుకున్నారని, ఏక్ పోలీస్ అన్న పోలీసులను అణగదొక్కారని చెప్పారు.

హామీల అమలు అడిగిన ఆడబిడ్డలు, ఆశాలను అవమానించారని మండిపడ్డారు. టీఎస్ టీజీగా చేసి చార్మినార్, కాకతీయ కళాతోరణాలను తొలగించారన్నారు. తెలంగాణ బిడ్డలు లాఠీలకు, తూటాలకు ఎదురొడ్డి ఆత్మబలిదానాలతో ఉద్యమిస్తున్నప్పుడు.. సమైక్యవాదుల పంచనచేరి వంచన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార అహంకారంతో ఇప్పుడు ఏకంగా అమ్మనే మార్చారని విమర్శించారు. చరిత్రను చెరిపేస్తామన్న భ్రమలో తెలంగాణ ప్రజలను ఏమారుస్తాం అనుకుంటే పొరపాటేనని చెప్పారు. తెలంగాణ అన్నీ గమనిస్తున్నది, కాలంబు రాగానే కాటేసి తీరుతుందని కెటిఆర్ ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News