Wednesday, January 22, 2025

పంద్రాగస్టు నుంచి ఇండ్ల పంపిణీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్/ఎల్బీనగర్ ః రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో మళ్లీ వచ్చేది బిఆర్‌ఎస్ ప్రభుత్వమేనని మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి తారక రామారావు ధీమా వ్యక్తం చేశారు. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు వదులుకోరని సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టబోతున్నారని చెప్పారు. నగరంలోని ఎల్బీనగర్ నియోజకవర్గంలోని హస్తినాపురంలో లబ్దిదారులకు భూ క్రమబద్ధీకరణ పత్రాలను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో లక్ష రెండు పడక గదుల ఇళ్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. పక్కా ఇళ్ల విషయంలో కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను ఖండించారు.

సీఎం కేసీఆర్ వయసుకు గౌరవం ఇవ్వకుండా నోటికొచ్చినట్లు అడ్డుగోలుగా మాట్లాడే పార్టీలకు బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్ ప్రజల అవసరాల దృష్ట్యా ఇప్పటికే 70కి.మీల మెట్రో రైలు మార్గం పూర్తయిందని అతి తక్కువ ఖర్చుతో ఓఆర్‌ఆర్ చుట్టూ 159 కి.మీల మెట్రోకు ప్రణాళికలు రచించినట్లు వివరించారు. త్వరగా భూసేకరణ పూర్తి చేసి మొత్తం 334 కి.మీ మెట్రో మార్గాన్ని నాలుగేళ్లలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.

అక్టోబర్‌లోగా లక్ష రెండు పడకల ఇళ్లు పేదలకు పంపిణీ
నగరంలో రెండు పడకల ఇళ్లు లక్ష పూర్తిఅయినట్లు వాటిని ఆగస్టు 15 నుంచి అక్టోబరులోగా పంపిణీ చేయబోతున్నామని ప్రకటించారు. ఇప్పటికే ఇండ్లు పూరైనట్లు కేటాయింపులు చేసుకుని నియోజకవర్గానికి 4వేల చొప్పున ఇస్తున్నట్లు తెలిపారు. గృహలక్ష్మీ పథకం కింద నియోజకవర్గానికి మూడు వేల కుటుంబాలకు ఇస్తామని చెప్పారు. ఒక్క ఎల్బీనగర్ నియోజకవర్గంలోనే డబుల్ బెడ్రూం ఇండ్లు 4 వేలు, గృహలక్ష్మీ పథకం కింద 3వేలు వస్తాయని అన్నారు. జీవో నెం.58, 59 కింద 11వేలు వచ్చాయని, జీవో నెం.118 కింద 18 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరిందన్నారు. అంటే ఒక్క నియోజకవర్గంలోనే 40 వేల పైచిలుకు కుటుంబాలకు సొంతింటి కల నెరవేరుతుందన్నారు.

సంక్షేమ కార్యక్రమాలు, వ్యక్తిగతంగా లాభం జరిగే పథకాలు మాత్రమే కాదని హైదరాబాద్ విస్తరణను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని పేర్కొన్నారు. రానున్న 50 నుంచి వందేండ్లలో ఎంత అభివృద్ధి జరిగినా సరే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మెట్రో నిర్మాణం చేపడుతున్నట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టులో భాగంగా నియోజకవర్గంలోని నాగోలు నుంచి ఎల్బీనగర్ మార్గాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ మీదుగా ఓఆర్‌ఆర్ దాకా మెట్రోను తీసుకెళ్తున్నామని, అదేవిధంగా ఓఆర్‌ఆర్ చుట్టూ 159 కిలోమీటర్ల పొడవున మెట్రో రైలు నిర్మించాలని నిర్ణయించామని చెప్పారు. కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు చెబితే నమ్మశక్యంగా అనిపించదని కేసీఆర్ ఏ ఛాలెంజ్ తీసుకున్నా అలాగే అనిపిస్తుందన్నారు.

తెలంగాణ సాధిస్తా బయలుదేరినప్పుడు చాలామంది నమ్మలేదని కానీ తెలంగాణ సాధించడమే కాదు సాధించిన తెలంగాణను తలసరి ఆదాయంలో భారతదేశంలోనే అగ్రభాగంలో నిలబెట్టారని గుర్తు చేశారు. ప్రపంచంలోనే అత్యంత లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు (కాళేశ్వరం)ను ఐదేండ్లలో కడతామంటే ఎవరూ నమ్మలేదన్నారు. మనదేశంలో ఒక ప్రాజెక్టు మొదలైందంటే ఆ ప్రాజెక్టు పూర్తయ్యేసరికి ఐదారుగురు ముఖ్యమంత్రులు మారతారు. కానీ ఒక్క ముఖ్యమంత్రి పట్టుబట్టి ఐదేండ్లలో ప్రపంచంలో అతిపెద్దలిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి అరుదైన విషయమన్నారు. ఇంటింటికీ నీళ్లు ఇస్తానని, రాష్ట్రంలోని ప్రతి గ్రామీణ ప్రాంతంలో ఇంటింటికీ నీళ్లు ఇచ్చిన నాయకుడు ప్రశంసించారు.

దశాబ్దాల నుంచి పేరుకుపోయిన నల్లగొండ ఫ్లొరైడ్, పాలమూరులో వలసలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నారని దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఎన్నో సమస్యలను పరిష్కరించుకున్నామని వెల్లడించారు. కరోనా వచ్చిన తర్వాత ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తరహాలో తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ( టిమ్స్ ) పెట్టి నగరానికి నాలుగువైపులా ఒక్కో చోట 2వేల పడకలతో ఆస్పత్రులను నిర్మిస్తున్నామని చెప్పారు. నిమ్స్‌లో మరో రెండు వేల పడకలు జత చేసి కొత్తగా 10 వేల పడకలు పేదల సౌలభ్యం కోసం ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ వచ్చాక కొత్తగా జిల్లాలను ఏర్పాటు చేసుకున్నాం. భారత దేశంలో ఎక్కడా లేనట్టుగా జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసుకుంటున్నామని తెలిపారు.

ఎల్బీనగర్‌లో జీవో 118 కింద పట్టాలు పంపిణీ చేసిన మంత్రి కేటీఆర్ ః
ఎల్బీనగర్ నియోజకవర్గంలో జీవో 118 కింద రెగ్యులరైజ్ చేసిన పట్టాలను లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఆయన మాట్లాడుతూ పట్టాల రెగ్యులరైజేషన్‌లో ఎమ్మెల్యే దేవిరెడ్డి కృషి ఎంతో ఉందన్నారు. మహానగరంలో జీవో నెం.58, 59 కింద లక్ష పైచిలుకు కుటుంబాలకు పట్టాలు వస్తేనే ఎల్బీనగర్ నియోజకవర్గంలోనే 11 వేల పైచిలుకు పట్టాలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. జీవో 118 ప్రకారం ఒక్కొక్కరికి గరిష్టంగా వెయ్యి గజాల వరకు నిర్మాణాలతో కూడిన స్థలాన్ని క్రమబద్ధీకరించారు. ఇందుకోసం గజానికి రూ.250 చొప్పున నామమాత్రపు ఫీజును వసూలు చేశారు. అలా క్రమబద్ధీకరించిన స్థలాలకు సంబంధించిన పట్టాలను లబ్ధిదారులకు అందజేశారు.

ఈ జీవోతో ఎల్బీనగర్ నియోజకవర్గంలో లబ్ది పొందిన కాలనీలు ః శ్రీనిధి కాలనీ, మల్లికార్జున హిల్స్, మారుతీనగర్ కాలనీ, శ్రీనిధి కాలనీ, జనార్దన్‌రెడ్డి నగర్, మారుతీనగర్, ఈస్ట్ మారుతినగర్, అవంతి కాలనీ, మాధవనగర్ కాలనీ, మల్లారెడ్డి కాలనీ, రాజిరెడ్డి నగర్, ఎస్‌వి కాలనీ, వినాయకనగర్, బాలాజీనగర్, శ్రీరామహిల్స్, వివేకానందనగర్, రాగాల ఎన్‌క్లేవ్, పద్మావతి నగర్, కమలానగర్, సీఆర్ ఎన్‌క్లేవ్, గణేశ్‌నగర్, లలితానగర్ నార్త్ కాలనీ, ఈశ్వరిపురం కాలనీ, జైపూర్ కాలనీ, కో ఆపరేటివ్ బ్యాంక్ కాలనీ, సాయినగర్, ఎస్‌కేడీ నగర్, శ్రీరామ్ నగర్, బీఎన్ రెడ్డి నగర్, వైదేహినగర్, శ్రీపురం కాలనీ, సాగర్ కాంప్లెక్స్, విజయ్‌నగర్ కాలనీ, సీబీఐ కాలనీ, సామనగర్ కాలనీ, కాస్మోపాలిటన్ కాలనీ, బ్యాంకు కాలనీ లబ్ది పొందినట్లు వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News