Tuesday, December 24, 2024

కెసిఆర్ ఆనవాళ్లు చెరిపేయడం.. రేవంత్ జేజమ్మ వల్ల కూడా కాదు

- Advertisement -
- Advertisement -
తెలంగాణ అంటేనే కెసిఆర్: బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో కెసిఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలంటే తెలంగాణనే లేకుండా చేయాలని బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పేర్కొన్నారు. కెసిఆర్ ఆనవాళ్లు చెరిపేయాలంటే రేవంత్ రెడ్డి వల్ల కాదు.. ఆయన జేజమ్మ వల్ల కూడా కాదు అని తేల్చిచెప్పారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మే డే వేడుకల్లో కెటిఆర్ పాల్గొని ప్రసంగించారు. చెమటబొట్టే చరిత్రకు ఆధారం అని అలిశెట్టి ప్రభాకర్ అన్నారని, శ్రా మికులే చరిత్ర నిర్మాతలు.. కార్మికులే సంపద సృష్టికర్త లు.. శ్రమైన జీవన సౌందర్యానికి సమానమైనది ఏది లేద ని మహాకవి శ్రీశ్రీ అన్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమంలో కార్మికవర్గం నిర్వహించిన పాత్ర ఎనలేనిదని పేర్కొన్నారు. సకల జనుల సమ్మెలో సింగరేణి కార్మికులు జంగ్ సైరన్ చేయడంతో విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయిందని, వారు తమ సత్తా చాటారని గుర్తు చేశారు.

ఆ తర్వాత ఆర్‌టిసి కార్మికులు నిరవధికంగా అండగా నిలిచారని, పబ్లిక్ సెక్టార్‌లో పని చేసే కార్మికులు కూడా తమ విధులను బహిష్కరించి ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు గుర్తు చేశారు. అనేక పోరాటాల తర్వాత తెలంగాణ సాధించుకున్నామని, సాధించుకున్న తెలంగాణలో అద్భుతాలు జరిగాయని కెటిఆర్ చెప్పారు. బిఆర్‌ఎస్ హయాంలో చిన్నచితకా పని చేయలేదు అని, కాళేశ్వరం నిర్మించాం… కాళేశ్వరం నిర్మాణంలో వేలాది మంది కార్మికుల శ్రమ ఉందని అన్నారు. తాజ్‌మహల్‌ను తలదన్నేలా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయం నిర్మించామని, అందులోనూ మన కార్మికుల శ్రమ ఉందని, అద్భుతమైన యాదాద్రి నిర్మాణంలో వందలాది కార్మికుల శ్రమ ఇమిడి ఉన్నదని వ్యాఖ్యానించారు.

కెసిఆర్ ఆనవాళ్లు చెరిపేయాలంటే కాళేశ్వరం కూల్చేయా యాదాద్రి ఆలయం, సెక్రటేరియట్, అంబేద్కర్ విగ్ర హం, కమాండ్ కంట్రోల్ సెంటర్ వంటి వాటిని కూల్చేయాలని తెలిపారు. వీటన్నింటికి మించి తెలంగాణలో కెసిఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలంటే తెలంగాణనే లే కుండా చేయాలని, ఎందుకంటే తెలంగాణ అంటేనే గుర్తొచ్చేది కెసిఆర్ అని పేర్కొన్నారు. మళ్లా తన పాత బాస్‌తో మాట్లాడుకుని అటుఇటు చేసి కలుపుకుంటే తప్ప కెసిఆర్ ఆనవాళ్లు లేకుండా చేసే సత్తా రేవంత్ రెడ్డికి కానీ ఆయన ప్రభుత్వానికి గానీ లేదని అన్నారు. ఆ విషయంలో మన కు రెండో అభిప్రాయం అవసరం లేదని స్పష్టం చేశారు.

కెసిఆర్ కార్మిక పక్షపాతి
బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కార్మిక పక్షపాతి అని కెటిఆర్ స్పష్టం చేశారు. బిఆర్‌ఎస్ హ యాంలో కార్మికులకు అండగా నిలిచినట్టే.. భవిష్యత్తులోనూ వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని భరో సా ఇచ్చారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చిరుద్యోగులను కెసిఆర్ మంచిగా చూసుకున్నారని చెప్పారు. 20,455 బిఆర్‌ఎలను, 25 వేల ఔటో సోర్సింగ్ విద్యుత్ ఉద్యోగులను క్రమబద్దీకరించామని తెలిపారు. 5 వేల మంది పిఎసిఎస్ ఉద్యోగులకు హెచ్‌ఆర్ పాలసీని అమ లు చేసింది కెసిఆర్ అని పేర్కొన్నారు. 3,974 మంది సెర్ప్ ఉద్యోగులకు పే స్కేల్ అమలు చేశామని, ఆర్‌టిసి ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసింది కెసిఆర్ ప్రభుత్వమని అన్నారు. మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా నియమించారని, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పిఆర్‌సి వర్తింపజేశారని చెప్పారు. సింగరేణి లాభాల్లో 20 శాతం వాటా కార్మికులకు ఉండేదని, కానీ కెసిఆర్ వచ్చిన తర్వాత లాభాల్లో 32 శాతం వాటా ఇచ్చారని అన్నారు. అంతేకాకుండా అంగన్వాడీ టీచర్లకు, ఆశా వర్కర్లకు, సెర్ప్ ఉద్యోగులకు, జిహెచ్‌ఎంసిలో పారిశుద్ధ్య కార్మికులకు కెసిఆర్ జీతాలు పెంచారని కెటిఆర్ గుర్తు చేశారు.

మోడీ కార్పొరేట్లను పట్టించుకున్నడు కానీ కార్మికులకు చేసిందేమీ లేదు
ప్రధాని నరేంద్ర మోదీ రైతుల ఆదాయం డబుల్ చేస్తాన్నారు, కానీ చేయలేదని కెటిఆర్ అన్నారు. ప్రపంచ కుబేరుల జాబితాలో 2014లో 609వ స్థానంలో ఉన్న అదానీ ఇప్పుడు 2వ స్థానానికి ఎగబాకిండని, ఆయన సంపద లక్షల రెట్లు పెరిగిందని, దీనికి కారణం మోదీనే అని ఆరోపించారు. మోడీ కార్పొరేట్లను పట్టించుకున్నడు కానీ కార్మికులకు చేసిందేమీ లేదని విమర్శించారు. ఏం చేశారో చెప్పే దమ్ము కూడా బిజెపి పార్టీ నేతలకు లేదని పేర్కొన్నారు. గట్టిగా మాట్లాడితే జై శ్రీరాం అంటారని అన్నారు. దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం తగదని వ్యాఖ్యానించారు. శ్రీరాముడు అందరివాడు అని, లంగలకు, దొంగలకుఓట్లు వేయమని శ్రీరాముడు చెప్పలేదని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రజ ల తరపున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఎంపీ ఎన్నికల్లో సామాజిక న్యాయం పాటించామని, ఈ ఎన్నికల్లో 12 సీట్లు గెలిపిస్తే రాబోయే సంవత్సర కాలంలో తెలంగాణ రాజకీయాలను కెసిఆర్ శాసిస్తారని చెప్పారు. మళ్లీ తెలంగాణలో గులాబీ జెండా ఎగరబోతదని కెటిఆర్ ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News