Wednesday, January 22, 2025

తెలంగాణ అస్తిత్వం తాకట్టు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర సచివాలయం, తెలంగాణ అమర జ్యోతి మధ్యలో ఉండాల్సిన తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టటంపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ అస్తిత్వాన్ని తాకట్టు పెట్టే సిగ్గుమాలిన చర్య అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ సిఎం రేవంత్ రెడ్డి చర్యకు నిరసనగా మంగళవారం(సెప్టెంబర్ 17) రాష్ట్రంలో ని అన్ని తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలభిషేకాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు కెటిఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ తల్లిని అవమానించేలా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన చర్యను ఎక్కడికక్కడ పార్టీ శ్రేణులతో సహా తెలంగాణ వాదులంతా వ్యతిరేకిస్తూ నిరసన తెలుపాలని కోరారు. తెలంగాణ తల్లి విగ్రహం ఉండాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయటమేమి అంటూ మొత్తం తెలంగాణ సమాజమంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. వెంటనే రేవంత్ రెడ్డి తాను చేసిన తప్పును సరిదిద్దుకోవాలని సూచించారు. లేదంటే కచ్చితంగా తెలంగాణ ప్రజలు సరైన సమయంలో బుద్ధి చెప్పటం ఖాయమని హెచ్చరించారు.

అధికారంలోకి రాగానే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని గాంధీభవన్‌కు తరలిస్తాం.
కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టుకోవాలనుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని…కానీ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయటాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని కెటిఆర్ చెప్పారు. తెలంగాణ సచివాలయం, అమరజ్యోతి మధ్యలో తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని కెసిఆర్ 2023 జులైలోనే ఈ స్థలాన్ని ఎంపిక చేశారని గుర్తు చేశారు. యావత్తు తెలంగాణ సమాజం కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని సగర్వంగా గౌరవించుకునేందుకు కెసిఆర్ ఎంపిక చేసిన స్థలానికి ఆమోదముద్ర వేసిందన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కుసంస్కారంతో తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి విగ్రహాన్ని ఆ స్థలంలో ఏర్పాటు చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ చర్య ప్రతి తెలంగాణ వ్యక్తి మనసును గాయపర్చేలా ఉందని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ తల్లి విగ్రహం కోసం కేటాయించిన ఆ స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని, సకల మర్యాదలతో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని గాంధీ భవన్‌కు తరలిస్తామని తేల్చి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ తల్లి విగ్రహాం కోసం ఏర్పాటు చేసిన స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహం ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఢిల్లీకి బానిసత్వం చేస్తారని తాము ముందునుంచే చెప్పామని కెటిఆర్ గుర్తు చేశారు. తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ప్రజల ప్రయోజనాల కన్నా కూడా కాంగ్రెస్ నాయకులకు స్వప్రయోజనాలే ముఖ్యమైపోయాయని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమకారులమంటూ గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ నాయకులంతా ఢిల్లీకి గులామ్ లేనని తేలిపోయిందన్నారు. తెలంగాణ ప్రజలా..? ఢిల్లీ బాసులా..? అంటే కాంగ్రెస్ నాయకులంతా ఢిల్లీ బాసులకే జీ హుజూర్ అంటారన్న విషయం మరోసారి స్పష్టమైందని అన్నారు. తెలంగాణ అస్తితత్వంతో పెట్టుకున్న వాళ్లెవరు రాజకీయంగా బతికి బట్టకట్టలేదని ఈ సందర్భంగా కెటిఆర్ హెచ్చరించారు. తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ప్రయోజనాల విషయంలో బిఆర్‌ఎస్ మాత్రమే రాజీలేని పోరాటం చేస్తుందని అన్నారు. ఢిల్లీ బాసుల మెప్పు కోసం కాకుండా….తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం బిఆర్‌ఎస్ ముందు నిలబడుతుందని పేర్కొన్నారు. కచ్చితంగా తెలంగాణకు బిఆర్‌ఎస్ శ్రీరామరక్షగా నిలుస్తుందని కెటిఆర్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News