Wednesday, January 22, 2025

నాకు కుటుంబం, భార్యాపిల్లలు లేరా?

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : మంత్రి కొండా సురేఖ తమకు సంబంధం లేని వ్యవహారంలో తమపై ఏడుస్తున్నారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. కొండా సురేఖపై సోషల్ మీడియా పోస్టింగ్‌లతో తమకు సంబంధం లేదని, కొండా సురేఖ ఏడిస్తే తమకేం సంబంధం అని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో కెసిఆర్‌పై, తమపై దాడి చేయలేదా..? దారుణంగా మాట్లాడలేదా అని నిలదీశారు. తాను హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారని కొండా సురేఖ అనలేదా..? అని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో ఎవరిపై దాడి జరగలేదని అన్నారు.నాకు కుటుంబం.. భార్య.. పిల్లలు లేరా..? అని కెటిఆర్ అడిగారు. మొదట.. మహిళా మంత్రులు కొండా సురేఖ, సీతక్కలు సిఎం రేవంత్ నోరును ఫినాయిల్‌తో కడగాలని అన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడే థర్డ్ రేట్ మాటలు మాట్లాడారని మండిపడ్డారు. చేతకాకనే కాంగ్రెస్ తమపై దాడులు చేయిస్తోందని మండిపడ్డారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము లేకనే దాడులు చేయిస్తోందన్నారు. మూసీ బాధితుల కోసం గురువారం ఎల్.బి.నగర్‌కు వెళుతున్నామని.. కాంగ్రెస్ వాళ్ళుఅడ్డొస్తే ఏం చేయాలో అది చేస్తామన్నామని అన్నారు. మా ఆత్మరక్షణ కూడా మేము చూసుకోవాలి కదా అని కెటిఆర్ వ్యాఖ్యానించారు.

మర్యాద ఇచ్చి పుచ్చుకోవడంలో ఉంటుంది: సబితా ఇంద్రారెడ్డి
కెటిఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను బిఆర్‌ఎస్ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. బాధ్యత గల పదవిలో ఉండి బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం సరికాదని మండిపడింది. ఈ మేరకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు.కెటిఆర్ గురించి కొండా సురేఖ మాట్లాడింది ఆక్షేపణీయమని పేర్కొన్నారు. రాజకీయాల్లో వ్యక్తిగత ఆరోపణలు చేయడం తగదని హితవు పలికారు. మర్యాద ఇచ్చి పుచ్చుకోవడంలో ఉంటుందని మంత్రి కొండా సురేఖకు సబితా ఇంద్రారెడ్డి సూచించారు. రాజకీయాల్లో వ్యక్తిగత ఆరోపణలు చేయకూడదని, తిరిగి ఆస్కారం ఇవ్వకూడదని ఆక్షేపించారు. వ్యవస్థలో ఉన్న లోటుపాట్లు గురించి మాట్లాడాలని, సమాజానికి ఆదర్శంగా ఉండాలని సబిత తెలిపారు. కొండా సురేఖ చేసిన ఆరోపణతో కెటిఆర్ తల్లి, భార్య, బిడ్డ, చెల్లి బాధపడరా అని ప్రశ్నించారు. వాళ్లు ఆడబిడ్డలు కారా..? ఒక తోటి మహిళగా ఆలోచించారా..? అని అడిగారు.

కొండా సురేఖ బేషరతుగా క్షమాపణ చెప్పాలి: హరీశ్‌రావు
కెటిఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీశ్‌రావు ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. రాజకీయ వాదనల్లో పసలేకే వ్యక్తిగత దూషణలకు దిగుతారన్న మార్గరెట్ థాచర్ కోట్‌ను హరీశ్‌రావు పోస్టు చేశారు.
మంత్రి కొండా సురేఖపై పరువునష్టం దావా వేస్తాం : సత్యవతి రాథోడ్
రాష్ట్రంలో మహిళలపై దాడులు, మానభంగాలు, హత్యలు జరిగినా ఏ రోజు మాట్లాడని కొండా సురేఖ, తనపై వచ్చిన ట్రోలింగ్ వార్తలను చూపించుకుంటూ ఏడుస్తుందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. కొండా సురేఖ చిత్ర పరిశ్రమలోని మహిళలను కించపరిచేలా మాట్లాడారని, ప్రభుత్వంలో ఉన్న మహిళ మంత్రి ఇలా మాట్లాడడం శోచనీయమన్నారు. మంత్రి కొండా సురేఖ ఇలానే మాట్లాడితే పరువునష్టం దావా వేస్తామని సత్యవతి రాథోడ్ హెచ్చరించారు.

కొండా సురేఖకు మంత్రివర్గంలో ఉండే అర్హత లేదు : ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్
కొండా సురేఖకు మంత్రివర్గంలో ఉండే అర్హత లేదని, ఆమె చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ నీచ సంస్కృతికి నిదర్శనమని బిఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించారు. కొండా సురేఖ తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని, వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై లీగల్‌గా ముందుకెళ్తామని తెలిపారు. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, కొండా సురేఖతో అసంబద్ధమైన వ్యాఖ్యలు చేయిస్తున్నారని ఆక్షేపించారు.

మంత్రి కొండా సురేఖకు బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ బుధవారం రాత్రి లీగల్ నోటీసులు పంపారు. తనపై మంతి సురేఖ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, 24 గంటల్లో క్షమాపణ చెప్పాలని కెటీఆర్ డిమాండ్ చేశారు. తనపై అబద్దాలు, అసత్యాలు దురుద్దేశపూర్వకంగా మాట్లాడినందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. భవిష్యత్తులోనూ ఇలాంటి దురుద్దేశపూర్వక, చిల్లర మాటలు మాట్లాడవద్దని ఆయన హితవు పలికారు.

మంత్రి సురేఖ క్షమాపణ చెప్పనిపక్షంలో పరువు నష్టం దావా, క్రిమినల్ కేసులను వేస్తానని హెచ్చరించారు. తాను మంత్రిగా పనిచేస్తున్న కాలంలో ఫోన్ టాపింగ్ చేశారంటూ సురేఖ చేసిన వ్యాఖ్యలతో పాటు, నాగచైతన్య సమంత విడిపోవడానికి కారణం తానే అంటూ కొన్ని దుర్వేశపూర్వక వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. తన గౌరవానికి, ప్రతిష్టకు భంగం కలిగించాలన్న ఉద్దేశంతో సమంత-, నాగచైతన్య పేర్లను తీసుకుంటూ అడ్డగోలు వ్యాఖ్యలు చేశారని కేటీఆర్ తన లీగల్ నోటీసులో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News