Wednesday, October 16, 2024

లక్ష కోట్లు మింగేందుకే మూసీ సుందరీకరణ:కెటిఆర్

- Advertisement -
- Advertisement -

మూసీ సుందరీకరణ పేరుతో లక్ష కోట్లను మింగేందుకే రేవంత్ ప్రభుత్వం ఆరాటపడుతోందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలకే దిక్కు లేదంటే లక్షన్నర కోట్లుతో మూసీ ప్రక్షాళనకు ఖర్చు చేస్తారంట అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ సీనియర్ లీడర్ మహమ్మద్ అలావుద్దీన్ పటేల్ సహా ఆయన అనుచరులు తెలంగాణ భవన్‌లో కెటిఆర్ సమక్షంలో బుధవారం గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ సంక్షేమ పథకాల కోసం పైసలు ఇస్తే కమీషన్లు రావు కదా? అదే మూసీ ప్రాజెక్ట్ అయితే లక్షా కోట్లు మింగొచ్చనే ధీమాతో ప్రభుత్వం ఆఘమేఘాల మీద పని చేస్తోందని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ, వాళ్ల బావకు కోట్ల రూపాయలు దోచి పెట్టొచ్చుననే ధీమాతో చేస్తున్నారని ఆరోపించారు.

మనం గల్లా పట్టి అడిగే వరకు ఈ కాంగ్రెస్ పార్టీ మోసం కొనసాగుతూనే ఉంటదని కెటిఆర్ అన్నారు. మనం ఏదైనా సమస్య వస్తే కలెక్టర్లకు చెప్పాలంట, ఇంటింటికి ఓట్ల కోసం వచ్చిన వాళ్లను మాత్రం అడగవద్దంట అని అన్నారు. ప్రజలకు ఏం ఇదేం ఖర్మ, ఎవరైతే మనకు తప్పుడు హామీలు ఇచ్చారో వాళ్లనే పట్టుకోవాలి తప్ప కలెక్టర్లు ఏం చేస్తారని అన్నారు. కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులను పట్టుకొని మనం అడగాలని కేటీఆర్ పార్టీ నాయకులకు సూచించారు. కెసిఆర్ జాబ్ పొగొట్టండి, మీకు ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలంటూ రాహుల్ గాంధీ అశోక్ నగర్‌కు వచ్చి ఇది నా గ్యారంటీ అని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డికి తప్ప తెలంగాణ యువతకు ఉద్యోగాలు రాలేదని కేటీఆర్ విమర్శించారు. మహిళలకు రూ.2500 ఇస్తామని ఇచ్చిన హామీ మేరకు కోటి 60 లక్షల మంది మహిళలు రూ.2500ల కోసం వేచి చూస్తున్నారని అన్నారు.

వృద్ధులకు రూ.4 వేలు, ఇంట్లో ఇద్దరికీ పింఛన్ ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఒక్కరికన్నా వచ్చిందా? అంటే లేనే లేదని అన్నారు. ఉన్న రైతు బంధు, ఉన్న పింఛన్ కూడా వస్తలేదని లబ్దిదారులు మనోవేదనకు గురవుతున్నారని తెలిపారు. అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చిందని, ఇప్పుడు ఏమైనయ్ అంటే సమాధానం చెబుతలేదని అన్నారు. కళ్యాణలక్ష్మి పేరుతో తులం బంగారం ఇస్తామని ఇచ్చిన హామీ కనీసం గుర్తుకు కూడా లేదని, తులం ఇనుము కూడా ఇవ్వడని కేటీఆర్ ఘాటుగా విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News