వారి మాయ మాటలను రాష్ట్ర ప్రజలు విశ్వసించరు
సంక్రాంతికి గంగిరెద్దులు
వచ్చినట్టు ఊపుకుంటూ వచ్చి
ఊకదంపుడు ఉపన్యాసాలిస్తారు
క్లబ్బులు, పబ్బులు తప్ప ప్రజా
సమస్యలపై అవగాహన లేని
రాహుల్ కూడా ఏవేవో
మాట్లాడి వెళ్లారు
ఏళ్ల తరబడి పీడించిన
ఫ్లోరోసిస్‌ను కాంగ్రెస్
నియంత్రించలేదు
చేయలేనిది టిఆర్‌ఎస్ ప్రభుత్వం
ఎలా చేయగలిగింది కెసిఆర్‌లా
గత పాలకులు ఉంటే
రాష్ట్రం ఎలా ఉండేదో ఊహించండి :
హాలియా బహిరంగ సభలో
మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : ‘తెలంగాణ ప్రజలను నమ్మించడానికి కొంతమంది పొలిటికల్ టూరిస్టులు రాష్ట్రానికి వస్తుంటా రు.. ఏదోదే మాయమాటలు చెబు తుంటారు. అలాంటి వారి మాటలను రాష్ట్ర ప్రజలు విశ్వసించరు’ అని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసి డెంట్, రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె. తారకరామారావు అన్నారు. సంక్రాంతికి గంగిరెద్దులు వచ్చినట్లు నాయకులు ఊపు కుంటూ రాష్టానికి వచ్చి ఊకదంపుడు ఉపన్యా సాలు ఇస్తారని మండిపడ్డారు. క్లబ్బులు, పబ్బులు, విందులు, చిందులు తప్ప రాష్ట్ర ప్రజా సమస్యలపై ఏ మాత్రం అవగాహన లేని ఎఐసిసి ముఖ్యనాయకుడు రాహుల్‌గాంధీ కూడా రాష్ట్రానికి వచ్చి ఏదేదో మాట్లాడి వెళ్లారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు ఏమైనా రైతుల గురుంచి తెలుసా? ఎడ్లు…. వడ్లు గురింతి తెలుసా? అని నిలదీశారు. దేశాన్ని, రాష్ట్రాన్ని ఆరేడు దశాబ్దాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసింది ఏమిటని ఆయన నిలదీశారు. అందినంత మేరకు దేశ సంపదను ఆ పార్టీ నాయకులు దోచుకున్నారని ఆరోపించారు.
అలాంటి పార్టీ తాజాగా మళ్లీ మరో అవకాశం ఇవ్వాలని ప్రజలను అడుగుతుండడంపై కెటిఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌కు మళ్లీ ప్రజలకు ఎందుకు అవకాశం ఇవ్వాలని ప్రశ్నించారు. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్న కేవలం ఎనిమిది సంవత్సరాల్లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు పాలనలో అన్ని రంగాల్లో తెలంగాణను దేశానికే రోల్‌మోడల్‌గా నిలిపామన్నారు.శనివారం నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని హాలియాలో కెటిఆర్ పర్యటింటారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌పై మరోసారి తనదైన శైలిలో నిప్పులు చెరిగారు. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన రాహుల్‌గాంధీ ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ, కాంగ్రెస్‌కు మరోసారి ఛాన్స్ ఇవ్వాలని అడిగిన విషయాన్ని గుర్తు చేస్తూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
గతంలో చేసిందేమీ లేదు కానీ మా తాతలు నేతులు తాగిండ్రు, మా మూతుల వాసనలు చూడండి అంటూ చెబుతారని ధ్వజమెత్తారు. ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన పెద్దాయన (మాజీ మంత్రి కె. జానారెడ్డి)కు ఏడు సార్లు అవకాశం ఇచ్చినా ఏం ఉద్ధరించలేదని విమర్శించారు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు 10 సార్లు అవకాశం ఇచ్చారన్నారు. 50 ఏండ్లు వారే దేశాన్ని పరిపాలించారన్నారు. 50 ఏండ్లలో ఏం చేయలేని వాళ్ళు…. ఇంకొక్క చాన్స్ ఇవ్వండని అడుగుతుండడం శోచనీయమని మండిపడ్డారు. ప్రజలను, రైతులను అయోమయానికి గురి చేసే దిక్కుమాలిన కథ అని కెటిఆర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది రైతు సంఘర్షణ సభ కాదు.. అది కాంగ్రెస్ నేతలు ఒకరికొకరు తన్నుకోవడానికి పెట్టుకున్న సభ అంటూ ఎద్దేవా చేశారు.
ఫ్లోరోసిస్‌ను ఎందుకు అరికట్టలేదు
నియోజకవర్గంలో ఏళ్ళ తరబడి విలయతాండవం చేసిన నీటి ఫ్లోరోసిసెను కాంగ్రెస్ ఎందుకు నియంత్రించలేదో చెప్పాలని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ డిమాండ్ చేశారు. యాభై సంవత్సరాల పాటు దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ నేతలు….ఫ్లోరోసిస్ సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోయాని నిలదీశారు. వారు చేయలేనిది టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎలా చేయగలిగిందన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించాలన్న చిత్తశుద్ధి పాలకులకు ఉండాలన్నారు. అప్పుడే అది సాధ్యమవుతుందన్నారు. ఫ్లోరోసిస్‌పై సిఎం కెసిఆర్ ప్రత్యేక దృష్టి సారించడం వల్లే దానిని రాష్ట్రంలో పూర్తిగా నియంత్రించ గలిగామని కెటిఆర్ పేర్కొన్నారు. మిషన్ భగీరథ పథకంతో ఇంటించికి సురిక్షతమైన మంచినీటిని అందిస్తున్న ఏకైక ప్రభుత్వం టిఆర్‌ఎస్ అని అన్నారు. కేవలం తాగునీరే కాకుండా వ్యవసాయ రంగానికి అవసరమైన సాగునీటిని కూడా సమృద్ధిగా
అందిస్తున్నామన్నారు.
నీటి లభ్యతతో పాటు 24 గంటల పాటు నాణ్యమైన కరెంటును అందిస్తున్న కారణంగానే రాష్ట్రంలో వ్యవసాయ రంగం అద్భుతంగా అభివృద్ధి చెందుతోందన్నారు. కెసిఆర్‌లా గత పాలకులు ఆలోచించి ఉంటే తెలంగాణ ఏ స్థాయిలో ఉండేదో ఒక్కసారి ప్రజలు ఆలోచించాలని కెటిఆర్ సూచించారు. గత పాలకులు ఉత్త సొల్లు కబుర్లు చెబితే….కెసిఆర్ ఇచ్చిన హామీలతో పాటు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. రైతుబంధు, రైతుబీమా వలే గత ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదని కెటిఆర్ ప్రశ్నించారు. అలాగే నెల్లికల్ లిఫ్ట్‌ను ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు. ఈ ప్రశ్నలపై ఎన్నిసార్లు అడిగినా కాంగ్రెస్ నేతల నుంచి తగు సమాధానం రాదన్నారు. ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప మనం అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చే పరిస్థితి లేదని విమర్శించారు. సాగర్ నియోజకవర్గం ఉప ఎన్నిక సందర్భంగా కెసిఆర్ ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నారన్నారు. దీని కారణంగానే ప్రస్తుతం నాగార్జునసాగర్‌లో పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయన్నారు. ఎన్నికలప్పుడు కెసిఆర్ డిగ్రీ కాలేజీ ఇస్తానని చెప్పారని….. అది కూడా మంజూరు చేశారన్నారు.
పేదలకు అండగా ఉన్నాం… కాబట్టే పింఛన్‌ను పది రెట్లు పెంచామని కెటిఆర్ వెల్లడించారు. అలాగే ఆరోగ్యలక్ష్మి ద్వారా తల్లీబిడ్డకు పౌష్ఠికాహారం అందిస్తున్నామన్నారు. సన్నబియ్యంతో పౌష్ఠికాహారం అందిస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో ఒక్క తెలంగాణ మాత్రమేనని అన్నారు. రాష్ట్రంలో వెయ్యికి పైగా విద్యాసంస్థలు ప్రారంభించామని.. విదేశీ విద్య కోసం రూ.20 లక్షలు ఇస్తున్నామని వివరించారు. కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లేకపోయినప్పటికీ సిఎం కెసిఆర్ ఎంతో దూరదృష్టితో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లగలుగుతున్నారన్నారు. అలాంటి నేతపై ప్రజల్లో అచంచలమైన విశ్వాసం ఉందన్నారు. అందుకే విపక్షాలకు చెందిన నేతలు ఎన్ని గాలికబుర్లు చెప్పినా….వచ్చే ఎన్నికల్లోనూ మళ్లీ టిఆర్‌ఎస్‌దే అధికారమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సభలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మంత్రులతో పాటు పలువురు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.