మన తెలంగాణ/సిరిసిల్ల ప్రతినిధి: హైదరాబాద్‌కు వస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రానికి ఇచ్చే నిధుల గురించి ఇప్పుడైనా ఏదైనా చెబుతారా?.. కాకుంటే.. వర్గాలు, మతాల పేరుతో జనాలను రెచ్చగొట్టి వెళ్తారో చూడాలని ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. రేపు హైదరాబాద్‌కు వచ్చి అమిత్ షా నిజాంను తిట్టడం, హిందుత్వం గూర్చి మాట్లాడం తప్ప ఏం చేస్తారో చూద్దామన్నారు. ఓట్ల కోసమే అమిత్ షా రాష్ట్ర పర్యటనలకు వస్తున్నారే గానీ, రాష్ట్రానికి రూ.10వేల కోట్లు తీసుకురావచ్చు కదా అన్నారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో మత విద్వేషాలు రెచ్చగొట్టే యత్నం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. రెచ్చగొట్టే యత్నం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. శుక్రవారం సిరిసిల్లలో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వే డుకల ప్రారంభోత్సవం సందర్భంగా అంబేద్కర్ విగ్రహనికి పూలమాలలు వేసి, అనంతరం జూనియర్ కళాశాలలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని మాట్లాడుతూ.. త్యాగాలతో సిద్ధించిన తెలంగాణను కులం, మతం పేరుతో చిచ్చుపెట్టి మనుషుల మధ్య అంతరాలు సృష్టించేందుకు కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. సంక్షేమానికి ట్రేడ్ మార్కుగా తెలంగాణ నిలుస్తోందన్నారు. గతాన్ని తవ్వి వైషమ్యాలు రెచ్చగొట్టి మత పిచ్చిలేపి తెలంగాణ సమాజాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు అప్రమత్తంగా లేకపోతే తెలంగాణ దశాబ్దాల పాటు వెనక్కిపోయే ప్రమాదముందని కెటిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి వచ్చే కేంద్రమంత్రులు, బిజెపి నేతలు తెలంగాణకు నిధులు తీసుకురావాలని సూచించారు. రాష్ట్రానికి పనికివచ్చే ఒక్క పథకం ఇవ్వని కేంద్రం 8సంవత్సరాల తరువాత సెప్టెంబర్ 17ను గుర్తించడం ఏమిటన్నారు. ఇప్పటికే ఇతర రాష్ట్రాలకు చెందిన ఇద్దరు సిఎంలు వచ్చి మాట్లాడి వెళ్లారని వారి వల్ల తెలంగాణకు ఒరిగిందేమి లేదన్నారు. తెలంగాణ నుంచి రూపాయి తీసుకుని 46 పైసలు మాత్రమే రాష్ట్రానికి ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం నుంచి అమిత్ షా ఏ మేరకు నిదులు తెస్తారో చెప్పాలన్నారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 3 లేకపోతే ఈ రోజు తెలంగాణ రాష్ట్రమే లేదన్నారు. ఎనిమిదేళ్ల పాలనలో అన్నివర్గాల ప్రజలకు న్యాయం చేసే దిశగా సంక్షేమాన్ని, అభివృద్ధిని కలగలిపి అందించే దిశగా ఎన్నో సంస్కరణలు తీసుకువస్తున్నామన్నారు. అంతా సమైక్యంగా ఉండాలనే సమైక్యతా ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఒక్క కాలేజీ కూడా తెలంగాణకు కేంద్రం ఇవ్వలేదని, సిరిసిల్లకు మెగా పవర్‌లూమ్ క్లస్టర్‌ను అడుగుతున్నా ఇవ్వటంలేదని విమర్శించారు. దేశంలో హైదరాబాద్ రాష్ట్రాన్ని ఐక్యం చేసిన రోజును గుర్తు చేసుకుంటూ మూడు రోజులు వేడుకలను ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. తన తాత కేశవరావును 1980లో ప్రభుత్వం స్వాతంత్య్ర సమరయోధునిగా గుర్తించి 2000 సంవత్సరం వరకు పెన్షన్ ఇచ్చిందని, ఆ తరువాత తమ అమ్మమ్మకు ఆ పెన్షన్ వచ్చిందన్నారు. సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేట, వీర్నపల్లి మండలాలకు త్వరలోనే ప్యాకేజి9 ద్వారా నీరు అందుతుందన్నారు. కార్యక్రమంలో ప్రణాళిక సంఘం రా్రష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, పవర్‌లూమ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, జడ్పి చైర్‌పర్సన్ అరుణ, మున్సిపల్ చైర్‌పర్సన్ కళ, జిల్లా రైతుబంధు అధ్యక్షులు గడ్డం నర్సయ్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, కలెక్టర్ అనురాగ్ జయంతి, జడ్పి సిఇఓ గౌతంరెడ్డి, అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్, సత్యప్రసాద్, ఆర్‌డిఓ శ్రీనివాసరావు, ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, ప్రజలు పాల్గొన్నారు.
KTR Slams Amit Shah to visit to hyderabad