ఏటా 2కోట్ల ఉద్యోగాల హామీ, 16 లక్షల ఖాళీల భర్తీ ఎప్పుడో?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లక్షా32వేల ఉద్యోగాలు వేసింది, మరో లక్ష ఖాళీలను భర్తీ
చేయబోతున్నాం, కేంద్రంలో కొలువుల భర్తీ కోసం త్వరలోనే యువతతో కలిసి ఆందోళనలు
ప్రధాని మోడీకి ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ మరో లేఖాస్త్రం
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ సర్కార్‌పై టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ మరోసారి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాల కల్పనపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష వైఖరి తీరును నిలదీశారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఎంతో గంభీరంగా మీరు మాట్లాడినదంతా ఢాంభికమే అనడానికి ఎనిమిదేళ్ల మీ పాలనే నిదర్శనంగా కనిపిస్తున్నదని ధ్వజమెత్తారు. మీ అసమర్థ నిర్ణయాలు, ఆర్ధిక విధానాలతో కొత్త ఉద్యోగాలు రాలేదు సరికదా… ఉన్న ఉపాధి అవకాశాలకు గండి కొట్టారని మండిపడడారు. ఈ మేరకు గురువారం ప్రధానికి ఆయన ఒక లేఖాస్త్రాన్ని సంధించారు.
ఈ లేఖలో యువతకు ఉపాధిక అవకాశాలను కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కెటిఆర్ ఆరోపించారు.
కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు అవుతున్నా… ఇప్పటి వరకు కనీసం తెలంగాణ రాష్ట్రం కల్పించినన్ని ఉద్యోగాలు కూడా కల్పించ లేకపోయారని విమర్శించారు. ఇది కేంద్ర ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనం కాదా? అని ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను ఎప్పుడు భర్తీ చేస్తారని నిలదీశారు. అలాగే మీరు (బిజెపి ప్రభుత్వం) ఇస్తామన్న రెండు కోట్ల ఉద్యోగాల భర్తీకి సంబంధించి చేపట్టిన చర్యలు ఏమిటని ప్రశ్నించారు.
ప్రజల ఆకాంక్షలు, అలుపెరగని ఉద్యమాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన టిఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా… తెలంగాణ యువత తరపున తాను కీలకమైన అంశాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నానని అన్నారు. తెలంగాణ ఉద్యమానికి ప్రాతిపాదిక అయిన నీళ్లు…- నిధులు…- నియామకాలు అనే కీలక అంశాల్లో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ఎనిమిది సంవత్సరాలుగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం అద్భుతమైన కృషి చేస్తున్నదన్నారు. ముఖ్యంగా రాష్ట్ర యువతకు కావాల్సిన ఉపాధి అవకాశాల కల్పన కోసం రెండంచెల వ్యూహంతో పనిచేస్తున్నామన్నారు.
త్రిరకణ శుద్ధిగా ప్రయత్నాలు చేస్తున్నాం
నూతన రాష్ట్రం అయినప్పటికీ వినూత్న, విప్లవాత్మక పారిశ్రామిక విధానాలతో లక్షల కోట్ల రూపాయలను తెలంగాణకు పెట్టుబడులుగా తెచ్చామని మోడీకి రాసిన లేఖలో కెటిఆర్ పేర్కొన్నారు. త్రికరణ శుద్ధిగా తాము చేస్తున్న ప్రయత్నాలతో ప్రైవేటురంగంలో సుమారు 16 లక్షల ఉపాధి అవకాశాలను యువతను కల్పించామన్నారు. భారత ప్రధానమంత్రి అయిన మీకు ఈ విషయంలో తగినంత సమాచారం ఉండే ఉంటుందని భావిస్తున్నానని అన్నారు. పారిశ్రామిక, ప్రైవేటు రంగ ఉద్యోగాల్లో రాష్ట్ర ప్రభుత్వం సాధిస్తున్న పురోగతిని మీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వమే పలు వేదికలపై లెక్కలేనన్ని సార్లు ప్రశంసించిన విషయం మీకు తెలిసే ఉంటుందన్నారు. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న తాము ప్రభుత్వ రంగంలోనూ ఇప్పటిదాకా సుమారు లక్షా 32 వేల ఉద్యోగాలను మేం భర్తీ చేశామని వివరించారు. తాజాగా మరో లక్ష ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను మొదలుపెట్టామన్నారు. టిఆర్‌ఎస్‌ది ఒట్టి మాటల ప్రభుత్వం కాదు… గట్టి చేతల ప్రభుత్వమని ప్రజల చేతనే శభాష్ అనిపించుకుంటున్నామన్నారు. ఒక రాష్ట్రంగా తమకున్న పరిమిత వనరులతోనే భారీ ఉపాధి, ఉద్యోగ అవకాశాలను రాష్ట్ర ప్రజలకు కల్పిస్తున్నామన్నారు.
దేశ ప్రజలకు ఉద్యోగ, ఉపాధి కల్పించడంలో ప్రధానమంత్రిగా మీరు విఫలమయ్యారనే భావన నెలకొన్నదిని మోడీకి రాసిన లేఖలో కెటిఆర్ విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన వాగ్ధానాలు, చెప్పిన మాటలను అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తిగా మర్చిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్రం వద్ద పకోడి ఉద్యోగాలే మిగిలాయి
కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు, కరోనా లాక్ డౌన్ వంటి అనాలోచిత నిర్ణయాలతో దేశ ప్రజల ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు కోలుకోలేని దెబ్బ తాకిందని కెటిఆర్ వ్యాఖ్యానించారు. ఉన్న ఉద్యోగాలు పొయి… కేవలం పకోడీ ఉద్యోగాలే మిగిలాయన్నది వాస్తవమన్నారు. భారీ ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే విదేశీ పరిశ్రమలను దేశానికి రప్పించే విషయంలో మీకు ఒక స్పష్టమైన విధానం లేదని విమర్శించారు. వ్యవసాయం రంగంతో పాటు దాని తరువాత అత్యధికంగా ప్రజలు ఆధారపడ్డ టెక్స్‌టైల్స్ రంగ అభివృద్ధిపై బిజెపి ప్రభుత్వానికి అసలు చిత్తశుద్ధే లేదని మండిపడ్డారు. అందుకే పొరుగున ఉన్న చిన్న దేశాల కన్నా తక్కువమందికి ఈరంగంలో ఉపాధి లభిస్తున్నదన్నారు.
కావాలనే కీలక రంగాలను విస్మరించిన కేంద్రం
మన ఆర్థిక వ్యవస్థలో కీలకమైన వ్యవసాయ, టెక్స్‌టైల్స్ రంగాలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కావాలని విస్మరింటిందని కెటిఆర్ ఆరోపించారు. దీని కారణంగా ఇవ్వాళ దేశంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయాయన్నది నూటికి నూరుశాతం నిజమన్నారు. మీ ఈ విధానాల వలనే గత 45 ఏళ్ళలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం పెరిగిందన్నారు. భారత ప్రభుత్వ గణాంకాలే ఇందుకు తిరుగులేని సాక్ష్యమని ఆ లేఖలో కెటిఆర్ వ్యాఖ్యానించారు.
ఉద్యోగాలను భర్తీ చేయకుండా మోడీ సర్కార్ నిద్రపోతోంది
దేశానికి పెట్టుబడులను భారీగా రప్పించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో మీ ప్రభుత్వం విఫలమైందని కెటిఆర్ పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న కేంద్రప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిద్రపోతున్నారా? ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వంలోని ఖాళీలతోపాటు పబ్లిక్ సెక్టార్ లోని అనేక కంపెనీల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకుండా ఎందుకు పెండింగ్‌లో పెట్టారని నిలదీశారు. ఒక వైపు ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకుండా తాత్సారం చేస్తున్న మీరు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను అందినకాడికి అమ్ముతూ లక్షలాది ఉద్యోగాలను రద్దు చేస్తున్నారన్నారు. ప్రస్తుత లెక్కల ప్రకారం ఖాళీగా ఉన్న 16 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను మీ నాయకత్వంలోని సర్కార్ ఎప్పుడు భర్తీ చేస్తుందన్నది భేతాళ ప్రశ్నగా మిగిలిపోయిందన్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీలో మీరు విఫలం అయిన నేపథ్యంలో మీ నుంచి కొన్ని ప్రశ్నలకు సమాధానాలను దేశ యువత ఆశిస్తోందన్నారు. వాటిల్లో…..
1. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను ఎప్పుడు భర్తీ చేస్తారు?
2. మీరు ఇస్తామన్న రెండు కోట్ల ఉద్యోగాల భర్తీకి సంబంధించి చేపట్టిన చర్యలు ఏమిటి?
3. మీరు ఇస్తామన్న యేటా రెండు కోట్ల ఉద్యోగాల్లో తెలంగాణ యువతకు దక్కే, దక్కిన ఉద్యోగాలు ఎన్ని?
4. ఒకవైపుప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకుండా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడంతో జరుగుతున్న ఉద్యోగాల నష్టం పైన మన మీ సమాధానం ఏమిటి?
5. ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేయడంతో ఆయా సంస్థల్లో రిజర్వేషన్ అమలుకాదు. ఫలితంగా కోట్లాది దళిత, గిరిజన, బీసీ వర్గాలకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు దక్కవు. ఈ విషయంలో ఆయా వర్గాల యువతకు మీరు ఏం సమాధానం చెబుతారు?
6. ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు ఇతోధికంగా చేయూతనిస్తున్న తెలంగాణ రాష్ట్రానికి మీరు ఇవ్వాలనుకుంటున్న ప్రాధాన్యం ఏంటీ?
7. ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనపై ఇక్కడి యువతకి మీరు ఏం చెపుతారు?
8. హైదరాబాద్ ఐటిఐఆర్ ప్రాజెక్టు పునరుద్ధరణ లేదా ప్రత్యామ్నాయంగా మరో ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని 8 సంవత్సరాలుగా తెలంగాణ యువత తరఫున మేం చేస్తున్న డిమాండ్ పై మీ దగ్గర సమాధానం ఉన్నదా ? సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అని మీరు ఓ వైపు గప్పాలు కొడుతుంటే…. మీ పార్టీ నేతలు మాత్రం సబ్ కో సత్తేనాశ్ కరో అన్నట్టే వ్యవహరిస్తున్నారు. ఈ వైఖరి వలన కేవలం దేశంలోనే కాకుండా వీదేశాల్లోని భారతీయుల ఉపాధికి ప్రమాదం ఏర్పడుతున్నదని అన్నారు. పార్టీ విద్వేష రాజకీయాలతో పారిశ్రామికంగా వెనుకబడే ప్రమాదంలోకి మనదేశం వేగంగా వెళుతోందన్నారు. ఫలితంగా కోట్లాది మంది ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు దెబ్బతినే అవకాశం ఉందన్నారు. మీరు గతంలో కూడా తెలంగాణకు వచ్చి తియ్యగ, పుల్లగ మాట్లాడారన్నారు. కాని పైసా సాయం చెయ్యలేదన్నారు. కనీసం ఇప్పుడైనా తెలంగాణ గడ్డ నుంచి దేశ యువతకు ఉపాధి…ఉద్యోగ కల్పనపై మీ వైఖరి స్పష్టం చేయండి? అని కెటిఆర్ డిమాండ్ చేశారు. అలాగే దేశ యువత ఉద్యోగాలపైన తాను లేవనెత్తిన అంశాలకు సవివరంగా సమాధానాలు ఇవ్వాలన్నారు. కేంద్రంలో పెండింగ్‌లో ఉన్న 16 లక్షల ఉద్యోగాల భర్తీకి ఏం చర్యలు తీసుకుంటారో వివరించాలన్నారు. లేనిపక్షంలో తెలంగాణ యువతతో కలిసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకువచ్చేలా, ఉద్యోగాల భర్తీ జరిగేదాకా ఉద్యమిస్తామని మోడీకి రాసిని లేఖలో కెటిఆర్ హెచ్చరించారు.
KTR Slams BJP Govt over Jobs