Sunday, January 19, 2025

కాళేశ్వరంపై విష ప్రచారం..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పా ర్టీకి కాళేశ్వరం గురించి ఎలాంటి అవగాహన లేదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపె ద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం అని, ఆ ప్రాజెక్ట్ గొప్పతనం గురించి తెలుసుకోవాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు అ క్కడికి వెళ్లి చూసి నేర్చుకోవచ్చనని ఆయన పే ర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎన్ని బరాజులు…ఎన్ని కాలువలు ఉన్నాయి..? ఎన్ని పంప్ హౌస్‌లు ఉన్నాయి..? అనే అంశాలను కాంగ్రెస్ తెలుసుకోవచ్చని అన్నారు. కానీ కాళేశ్వరం గురించి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కనీస ఇంగిత జ్ఞానం లేదని విమర్శించా రు. కాళేశ్వరం అద్భుతమైన ప్రాజెక్ట్ అని, ఆ ప్రాజెక్ట్ కట్టిందే తాము అయినప్పుడు చూడాల్సింది తాము కాదు, కాంగ్రెస్ పార్టీనే అని పే ర్కొన్నారు.

కాళేశ్వరం ద్వారా వచ్చిన నీటితో పండించిన పంటల సహాయంతోనే ఇప్పుడు తెలంగాణ దేశానికి ధాన్యాదారంగా నిలుస్తున్నదని, దేశానికి అన్నపూర్ణగా మారిందని వ్యాఖ్యానించారు. కాబట్టి కాలేశ్వరం ప్రాజెక్టు విజయం గురించి తమకు చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రాజెక్టులో ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం సరిచేయాలని, అందుకు ప్రభుత్వానికి పూర్తి అధికార యంత్రాంగం ఉందని చెప్పారు. మేడిగడ్డ వద్ద జరిగిన ఇబ్బందిని పట్టుకొని మెత్తం కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా విఫలమైందనే కుటిల ప్రయత్నం చేస్తే అది సూర్యుడి మీద ఉమ్మేసినట్లే అని విమర్శించారు. రాజకీయ దురుద్దేశంతో అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టు అపవాదుకి గురిచేసి భ్రష్టు పట్టించాలని చూస్తే అది కాంగ్రెస్ అమాయకత్వమని పేర్కొన్నారు.

ఎక్కడైనా తప్పులు జరిగితే బయటపెట్టాలని, ఏ విచారణకైనా తాము సిద్ధమని గతంలోనే పదుల సార్లు చెప్పామని అన్నారు. కాంగ్రెస్ నాయకుల తీరు చూస్తుంటే బిఆర్‌ఎస్ పార్టీని అధికారంలో ఉంది.. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నారన్నట్టు మాట్లాడుతున్నారు విమర్శించారు. కేవలం బట్ట కాల్చి మీదేసే ప్రయత్నం చేస్తున్నారని, అడ్డగోలుగా భాద్యత లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అడ్డగోలుగా హామీలను అమలు చేయడం వారికి అసాధ్యం అన్నారు. పది సంవత్సరాలలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం నగరాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసిందని చెప్పారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పాలనపైన ప్రజల అసంతృప్తి నెలకొందని పేర్కొన్నారు. పార్టీ కార్పొరేటర్ల వెంట, జిహెచ్‌ఎంసి పార్టీ శ్రేణుల వెంట మొత్తం పార్టీ నిలబడుతుందని తెలిపారు. అధికారులు, ప్రభుత్వం ఒత్తిడికిలోనై గతంలో ఇచ్చిన నిధులను, పనులు చేయడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత విధానంపైన ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

రేవంత్‌రెడ్డికి క్రిమినల్ ఆలోచనలు తప్ప ఇంకొకటి లేదు
రాష్ట్రాన్ని నడుపుతున్న వ్యక్తే ఒక క్రిమినల్, ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన దొంగ అని సిఎం రేవంత్ రెడ్డిపై కెటిఅర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డికి క్రిమినల్ ఆలోచనలు తప్ప ఇంకొకటి లేదని మండిపడ్డారు. అధికారం రేవంత్‌రెడ్డి చేతిలో ఉందని, ఆయన ఎవరిపైనా అయినా చర్యలు తీసుకోవాలనుకుంటే నిరభ్యంతరంగా చర్యలు తీసుకోవచ్చని అన్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టారని ఆరోపించారు. తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతూ కృష్ణా జలాలను కాంగ్రెస్ ప్రభుత్వం కెఆర్‌ఎంబికి అప్పజెప్పిందని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఈ నెల 13న చలో నల్లగొండ కార్యక్రమాన్ని తీసుకున్నామని చెప్పారు. కృష్ణానది బేసిన్‌లో ఉన్న హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఖమ్మం, నల్లగొండ జిల్లాల పరిధిలోని ప్రజా ప్రతినిధులతోని సమావేశం పెట్టుకున్నామని, అందులో భాగంగానే హైదరాబాద్ ప్రజాప్రతినిధులతో శనివారం సమావేశం నిర్వహించుకున్నామని తెలిపారు. ఈ నెల 13న చలో నల్గొండ సభను విజయవంతం చేయడంపై కృష్ణా బేసిన్‌లో ఉండే జిల్లాల ప్రజలు నాయకులూ కదిలి రావాలని కోరారు. ఎవరైనా తమ పార్టీ నుంచి వెళ్తారు అంటే దానిపైన తాము చేసేది ఏం లేదని అన్నారు. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే అని వ్యాఖ్యానించారు.

హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం
రాజకీయ దురుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగర అభివృద్ధిని అడ్డుకుంటుంది బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో జిహెచ్‌ఎంసి పరిధిలోని బిఆర్‌ఎస్ పార్టీ కార్పొరేటర్లతో శనివారం కెటిఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, పార్టీ ఎంఎల్‌ఎలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, 60 రోజుల కాంగ్రెస్ పార్టీ పరిపాలన అయోమయంగా ఉందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలలో ఉన్న 13 కార్యక్రమాలతో పాటు ఇచ్చిన 420 హామీలకు అమలుకు రూ.57 వేల కోట్లు మాత్రమే ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయించిందని చెప్పారు. మహాలక్ష్మి పథకం కోసం దరఖాస్తు చేసుకున్న మహిళా సోదరీమణులకు ఇవ్వాల్సిన మొత్తమే రూ.50 వేల కోట్ల పైన అవుతుందని అన్నారు. మరి రైతుబంధు, ఆసరా, రుణమాఫీ వంటి పథకాల అమలకు ఎక్కడి నుంచి నిధులు తెస్తారో బడ్జెట్‌లో చెప్పలేదని పేర్కొన్నారు.

ఫార్మాసిటీ, మెట్రో విస్తరణ వంటి భారీ ప్రాజెక్టులను రద్దు చేయడం వలన రాష్ట్ర అభివృద్ధి కూడా దెబ్బతినే అవకాశం ఉందని, అభివృద్ధి దెబ్బతింటే, రాష్ట్రానికి రాబడి, రెవెన్యూ తగ్గే ప్రమాదం ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపైన దృష్టి పెట్టకుండా, కేవలం ప్రజలను తప్పు దోవ పట్టించే అటెన్షన్ డైవర్షన్ ప్రయత్నాలను ప్రజలు ఎక్కువ రోజులు నమ్మరని అన్నారు. తమ పార్టీ నాయకులు ఎంఎల్‌ఎ టికెట్లు ఆశించి.. రాజకీయ కారణాలతో అవకాశం రాకున్నా పార్టీ కోసం నిబద్ధతతో పనిచేశారని చెప్పారు. ప్రతి ఒక్క కార్పొరేటర్, పార్టీ శ్రేణులు చేసిన కృషి వల్లనే హైదరాబాద్‌లో బిఆర్‌ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయగలిగిందని వ్యాఖ్యానించారు. గత పది సంవత్సరాలలో ప్రతిరోజు పార్టీ కార్పొరేటర్లు ప్రజల్లో నిలబడి మరీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసేలా చూశారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ దురుద్దేశాలతో నగర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని, జిహెచ్‌ఎంసి పాలకవర్గం బాధ్యతలను నిర్వహించడంలో ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించారు.

ప్రజా పాలన అని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ జిహెచ్‌ఎంసి జనరల్ బాడీ సమావేశం జరుగకుండా, స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికలు కాకుండా ఆపుతుందని పేర్కొన్నారు. రాజ్యాంగం ఏర్పాటు చేసిన ఐదు అంచెల పరిపాలన వ్యవస్థలో భాగంగా ఏర్పాటైన స్థానిక ప్రభుత్వం జిహెచ్‌ఎంసి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. జిహెచ్‌ఎంసికి చట్టం ప్రకారం ఉన్న విస్తృత అధికారాలను ఉపయోగించుకుని రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులను ఎదుర్కొనే ప్రయత్నం చేయాలని కార్పోరేటర్లకు సూచించారు. జిహెచ్‌ఎంసి పాలకమండలి, ప్రజలచేత ఎన్నికైన కార్పొరేటర్లు తమకున్న అధికారులను ఉపయోగించుకోవాలని దిశానిర్ధేశం చేశారు.

కాంగ్రెస్ పార్టీకి కాళేశ్వరం గురించి ఎలాంటి అవగాహన లేదు
నాకు గొప్ప గౌరవమిచ్చిన పార్టీకి జీవితాంతం నిబద్ధతతో పనిచేస్తా : మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
జిహెచ్‌ఎంసి జనరల్ బాడీ సమావేశాన్ని హైదరాబాద్ ప్రజల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అజెండా కోసం నిర్వహిస్తామని జీహెచ్‌ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మిఅన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడి మేరకు అధికారులు ప్రజాప్రతినిధులకు సహకరించడం లేదని చెప్పారు. అధికారుల ఒత్తిడిని, వారి పరిమితులను అర్థం చేసుకోగలుగుతాం కానీ… ప్రభుత్వం అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి నగర అభివృద్ధిని అడ్డుకోవద్దని కోరారు. స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికలు, జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించే అంశాన్ని నిర్ణయించడం కోసమే తాను ముఖ్యమంత్రిని కలిశానని, ఇదే విషయాన్ని సిఎంకు కూడా చాలా స్పష్టంగా చెప్పానని తెలిపారు. తెలంగాణ కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం 1969 నుంచి కొట్లాడిన కుటుంబం తమది అని పేర్కొన్నారు. ఒక సాధారణ కార్పొరేటర్‌గా ఉన్న తనను మేయర్‌గా అవకాశం ఇచ్చి గొప్ప గౌరవమిచ్చిన పార్టీకి జీవితాంతం నిబద్ధతతో పనిచేస్తానని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News