Monday, January 20, 2025

వన, గృహ మేధం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : పేదల ఇళ్ల జోలికి వెళ్లకుండానే మూసీని ప్రక్షాళన చేయవచ్చని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.టి.రామారావు పేర్కొన్నారు. మూ సీ ప్రక్షాళన అంటూ వికారాబాద్ అడవుల్లో వనమేధం చేస్తున్నారని మండిపడ్డారు. అడవుల్లో 12 వేల చెట్లు నరికేస్తున్నారని ఆరోపించారు. ప్రక్షాళన పేరుతో హైదరాబాద్‌లో గృ హమేధంసృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. మూ సీ శుద్ధీకరణపై తెలంగాణ భవన్‌లో కెటిఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా అధికార కాంగ్రెస్‌పై తీవ్ర స్థా యిలో విరుచుకు పడ్డారు. ఢిల్లీకి మూటలు పంపటం కోసమే ముఖ్యమంత్రికి మూసీపై ప్రేమ ఉందనే అనుమానం బలపడుతోందని కెటిఆర్ పేర్కొన్నారు. నోట్ల రద్దు సమయం లో ప్రధాని మోదీ మాటలు మార్చిన ట్లు.. మూసీపై రేవంత్ రోజుకో మాట మా ట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

మూసీ సుందరీకరణ అనే పదం మాట్లాడిందే మొదట రేవం త్ రెడ్డి అని విమర్శించారు. లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తామని చెప్పింది కూడా రేవంత్ రెడ్డే అని అన్నారు. రూ.50 వేల కోట్లతో మూసీ ప్రక్షాళన చేస్తామని గతంలో చెప్పిన సిఎం రేవంత్ రెడ్డి మళ్లీ మాట మార్చి రూ. లక్షా యాభై వేల కోట్లతో సుందరీకరిస్తామని చె ప్పారని కెటిఆర్ ఆరోపించారు. తుదిదశ లో ఎస్‌టిపిలు, సీవరేజ్ ప్లాంట్‌లు ఉన్నాయ ని, కేవలం రూ.1100 కోట్లతో నల్గొండకు శుద్ధమైన నీరు ఇవ్వవచ్చని పేర్కొన్నారు. రూ.25 వేల కోట్లతో మూసీని ప్రక్షాళనం చే యవచ్చని తెలిపారు.మూసీ సుందరీకరణకు రూ.1.50లక్షల కోట్లు ఎందుకు..? అని ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళన అంటూ అవినీతి చేస్తున్నారని కాంగ్రెస్‌పై మండిపడ్డారు. ప్రజలను అబద్ధాలతో మభ్యపెట్టేందుకు సిఎం యత్నించారని, మూసీ ప్రాంతంలో సర్వే చేయకున్నా చేసినట్లు చెప్పారని అన్నారు.

రూ.లక్షన్నర కోట్ల
ఎలాంటి సర్వే జరగలేదు..
మూసీ పరివాహక ప్రాంతంలో ఎలాంటి సర్వే జరగలేదని, తమ ఇంటికి ఎవరూ రాలేదు.. సర్వే జరగలేదని ప్రజలే చెబుతున్నారని కెటిఆర్ పేర్కొన్నారు. సిఎం రేవంత్‌రెడ్డి రెండు నెలల నుంచి సర్వే చేస్తున్నామని అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పాపం బయటకు రావటంతో ముఖ్యమంత్రికి ముచ్చెమటలు పడుతున్నాయని అన్నారు. గ్రాఫిక్స్ మాయాజాలంతో రేవంత్ అబద్దాలు చెప్పారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీబీలతో, కూలీలను పెట్టి ఇండ్లు కూలగొడుతున్నారు. ఇందుకు సాక్ష్యంగా సోషల్ మీడియాలో కూడా వీడియోలు వచ్చాయని, మూసీ పరివాహక ప్రాంతంలో ఇండ్లను కూలగొట్టేందుకు వచ్చిన ఓ కూలీ కూడా బాధపడ్డట్టు సోషల్ మీడియాలో వీడియోలు వచ్చాయని కెటిఆర్ గుర్తు చేశారు.

గత ప్రభుత్వాలే మూసీని మురికి కూపంలో మార్చాయి
తెలంగాణకు ముందు ఉన్న ప్రభుత్వాలు మూసీని మురికి కూపంలా మార్చాయని కెటిఆర్ ఆరోపించారు. మూసీని మురికి కూపంగా మార్చిన పాపం.. కాంగ్రెస్, టిడిపి పార్టీలదే అని పేర్కొన్నారు. మూసీకి పురిట్లోనే రేవంత్ రెడ్డి ఉరేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వంలోనే మూసీని సుందరీకరణ చేయాలనుకున్నామని, లక్షలాదిమంది పొట్ట కొట్టవద్దని తమ పార్టీ అధినేత, మాజీ సిఎం కెసిఆర్ సూచించారని తెలిపారు. మానవీయ కోణంలో మూసీని శుద్ది చేయాలనుకున్నామని, పేదల ఇళ్లు కొట్టాలని తాము అనుకోలేదని తెలిపారు. ముఖ్యమంత్రి మాదిరి కాకుండా.. నల్లగొండ మంత్రులు విషయం తెలసుకుని మాట్లాడాలని సూచించారు. ఇమ్లిబన్ బస్ స్టేషన్, మెట్రో స్టేషన్ కూడా మూసీ రివర్ బెడ్‌లోనే ఉన్నాయని, బఫర్ జోన్‌లో ఉన్న ప్రతి ఇంటికి ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చిందని అన్నారు. ఒక్క పేదవాడి కడుపు కూడా కొట్టకుండా.. నాగోల్, ఉప్పల్ భగాయత్ ప్రాంతంలో మూసీని సుందరీకరించామని వివరించారు.

గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం చొరవతోనే హైదరాబాద్ రోడ్లపై నీరు నిలవటం లేదని మాజీ మంత్రి ఈటల రాజేందర్ కూడా అన్నారని పేర్కొన్నారు. కాళేశ్వరం నీళ్లను గండిపేటకు జోడించటానికి ప్లాన్ చేశామని తెలిపారు. 31 ఎస్‌టిపిలు పూర్తయినట్లయితే మూసీలో స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తుందన్నారు. గతంలోనే స్ట్రాటజిక్ నాలా డెవలప్‌మెంట్‌ను ప్రారంభించినట్లుగా గుర్తు చేశారు. రూ.1000 కోట్లతో ఎస్‌ఎన్‌డీపీ ప్రాజెక్టును ప్రారంభించినట్లుగా పేర్కొన్నారు. రూ.5 వేల కోట్లతో రెండో దశ ఎస్‌ఎన్‌డీపీని చేపట్టాలనుకున్నామని, మళ్లీ తమ ప్రభుత్వం వచ్చి ఉంటే రెండో దశ ఎస్‌ఎన్‌డీపీని ప్రారంభించేవాళ్లమని తెలిపారు. ఎస్‌ఎన్‌డీపీని ప్రారంభించడం వల్లే ప్రస్తుతం మురికినీటి నిల్వ ఉండట్లేదని వివరించారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రెండో దశ ఎస్‌ఎన్‌డీపీ ప్రాజెక్టును రద్దు చేసిందని విమర్శించారు. రూ.540 కోట్లతో మూసీపై 14 బ్రిడ్జిల నిర్మాణానికి ఆమోదం తెలిపామని పేర్కొన్నారు. రూ.3800 కోట్లతో డ్రైనేజీ సీవరేజ్ ప్రాజెక్టు పనులు ప్రారంభించామన్నారు.
మూసీపై రేవంత్‌రెడ్డి రోజుకో మాట మాట్లాడుతున్నారు

మూసీ సుందరీకరణపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజుకో మాట మాట్లాడుతూ.. అపరిచితుడిలాగా మారిపోయాడని కెటిఆర్ విమర్శించారు. మూసీ సుందరీకరణ చేస్తాం అని మొట్టమొదట చెప్పిందే రేవంత్ రెడ్డి..తర్వాత అసలు సుందరీకరణ మాట ఎక్కడి నుంచి వచ్చిందని అంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ఒక రోజు సుందరీకరణ అంటాడు.. మరొక రోజు ప్రక్షాళన అంటాడు.. మరో రోజు పునరుజ్జీవం అంటాడు అని విమర్శించారు. మూసీ సుందరీకరణ అనే మాట మొట్టమొదటు వాడింది రేవంత్ రెడ్డి అని, గోపన్‌పల్లిలో సిఎం మాట్లాడుతూ లక్షన్నర కోట్లతో మూసీ సుందరీకరణ చేస్తామని చెప్పారని, కానీ ఇప్పుడు ఆయన ఒక అపరిచితుడిలా మారి, లక్షన్నర కోట్లు ఎవరు అన్నారని అంటున్నారని ఎద్దేవా చేశారు.

రెండు రిజర్వాయర్ల వెనుక ఒక ఉద్దేశం ఉంది
మూసీ నది కృష్ణానదికి ఉపనది అని, పైన అనంతగిరి కొండల్లో ముచ్కుంద వద్ద మూసీ ఉద్భవించిందని కెటిఆర్ తెలిపారు. 267 కి.మీ. ప్రయాణం చేసి హైదరాబాద్ నగరం మీదుగా వాడపల్లి వద్ద కృష్ణా నదిలో కలుస్తుందని, 1591లో కులీకుతుబ్ షా హైదరాబాద్ నగరాన్ని మూసీ తీరాన నిర్మించారని వివరించారు. రెండు నదులుగా మూసా ఈసాగా ప్రారంభమై.. హైదరాబాద్‌లోని బాపు ఘాట్ వద్ద మూసీ నదిగా ఏర్పడుతాయని, గతంలో ఈ నదిని ముచ్కుంద అని కూడా పిలిచేవారని చెప్పారు. 1908లో మూసీలో ఒక భయంకరమైన వరద వచ్చి, కుంభవృష్టి లాంటి వర్షం పడడం కారణంగా అతి పెద్ద వరద సంభవించి 15 వేల మంది మరణించారని పేర్కొన్నారు. నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ ప్రజలను వరద నుంచి కాపాడాలని చెప్పి.. నాటి ప్రముఖ ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను పిలిచి చర్చించారని వివరించారు.

నాడు ఆయన డిజైన్ చేసింది ఉస్మాన్ సాగర్(గండిపేట) 1920లో పూర్తిగా, హిమాయాత్ సాగర్ 1927లో పూర్తయిందని అన్నారు. ఈ రెండింటి రిజర్వాయర్ల వెనుక ఒక ఉద్దేశం ఉందని, ఒకటి హైదరాబాద్ ప్రజలకు మంచినీరు అందించడం, రెండోది భారీగా వరదలు వచ్చిన వాటిని ఆపేందుకు అని అన్నారు. హైదరాబాద్‌లో ఆవాసాలు మునగకుండా, ప్రాణ ఆస్తి నష్టం కలగకుండా.. రక్షణ కవచం లాగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రెండు రిజర్వాయర్లు నిర్మించారని, ఆ తర్వాత 95 ఏండ్ల పాటు మూసీలో ఏ ప్రభుత్వం గొప్పగా పని చేసింది లేదని తెలిపారు.మూసీలో ఒక్క చుక్క నీరు వదిలినా నిల్వదు అని, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తినా జరజర నీరు కిందకు పోతోందని చెప్పారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య రిజర్వాయర్లను ఆ విధంగా ప్లాన్ చేశారని అన్నారు. ఎలాంటి ఉపద్రవం లేకుండా సమతుల్యంగా రూపొందించారని, ప్రాణ నష్టం లేకుండా కాపాడుకోవచ్చు అని చాలా ముందు చూపుతో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈ రెండు రిజర్వాయర్లను కట్టించారని కెటిఆర్ వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News