Wednesday, January 22, 2025

సిఎం సొంత నియోజకవర్గంలోనే కాంగ్రెస్ సర్కారుపై తిరుగుబాటు

- Advertisement -
- Advertisement -

సిఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లోనే కాంగ్రెస్ సర్కారుపై తిరుగుబాటు మొదలైందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫార్మా సిటీని తీవ్రంగా వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత కొడంగల్‌లోనే ఫార్మా కంపెనీ ఏర్పాటుకు రంగం సిద్ధం చేయడంతో స్థానిక ప్రజలు తరిమికొట్టే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. కొడంగల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపిపి దయాకర్ రెడ్డితోపాటు బిఎస్‌పి తరపున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన నర్మదతోపాటు కొడంగల్ నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన దాదాపు వంద మంది శనివారం నందినగర్‌లో నివాసంలో కెటిఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా కొడంగల్ నియోజకవర్గాన్ని తక్కువ ఖర్చుతో సస్యశ్యామలం చేసే ప్రణాళికలు పక్కనపెట్టి, కేవలం కమీషన్ల కోసం కొడంగల్ లిఫ్ట్ ప్రాజెక్టును చేపట్టారని మండిపడ్డారు. మొన్నటిదాకా రేవంత్ రెడ్డి తిట్టిపోసిన మెగా ఇంజనీరింగ్ కంపెనీకి, మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కంపెనీకి కాంట్రాక్టు కట్టబెట్టడం వెనక ఉన్న మతలబు ఏంటో అర్థం చేసుకోవాలన్నారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు అనేక వర్గాల ధర్నాలు, రాస్తారోకోలతో తెలంగాణ అట్టడుకుతుంటే… మంత్రులు విహార యాత్రల్లో ఎంజాయ్ చేస్తున్నారని దుయ్యబట్టారు. చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుందని వ్యాఖ్యానించారు. పదేళ్లు ప్రగతిపథంలో పరుగులు పెట్టిన తెలంగాణ రాష్ట్ర ఆదాయం తగ్గుతోందని, కాంగ్రెస్ నేతల ఆదాయం మాత్రం పెరుగుతోందని ధ్వజమెత్తారు.

దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కబెట్టుకోవాలనే ఆలోచనతో కాంగ్రెస్ నేతలు మూటలు నింపుకునే పనిలో మునిగి తేలుతున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వ హెలికాప్టర్ ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో తరిస్తోందని, ఇది అధికార దుర్వినియోగం కాకపోతే మరేంటని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా కలిసికట్టుగా పనిచేసి కొడంగల్‌లో కాంగ్రెస్‌ను మట్టికరిపించాలని కెటిఆర్ పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News