హైదరాబాద్ : తెలంగాణాలో ఒక్క ఎంపీ సీటు అయినా గెలిచి చూపించాలని బిఆర్‌ఎస్‌కు సిఎం రేవంత్‌రెడ్డి విసిరిన సవాల్‌పై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు కెటిఆర్ స్పందించారు. “నేను సిరిసిల్ల ఎంఎల్‌ఎ పదవికి రాజీనామా చేస్తా… రేవంత్‌రెడ్డికి ధైర్యముంటే సిఎం పదవికి, కొడంగల్ ఎంఎల్‌ఎ పదవికి రాజీనామా చేయాలి…ఇద్దరం కలిసి మల్కాజిగిరిలో ఎంపీగా పోటీ చేసి తేల్చుకుందాం” అని కెటిఆర్ సిఎం రేవంత్‌రెడ్డి ప్రతి సవాల్ విసిరారు. రేవంత్‌రెడ్డి సిట్టింగ్ సీటు మల్కాజిగిరిలోనే ఇద్దరం పోటీ చేద్దామని అన్నారు…ఎంపీగా ఆయన పనితీరుకు, మున్సిపల్ శాఖ మంత్రిగా తన పనితీరుకు ప్రజలే సమాధానం చెబుతారని పేర్కొన్నారు. సేఫ్ గేమ్ వద్దు.. డైరెక్ట్ ఫైట్ చేద్దామంటూ రేవంత్ రెడ్డికి కెటిఆ సవాల్ విసిరారు. గతంలోనూ రేవంత్ రెడ్డి సవాల్ చేసి పారిపోయారని గుర్తు చేశారు. 2018లో కొడంగల్‌లో ఓడిపోతే రాజనీయ సన్యాసం చేస్తానని అన్నారని గుర్తు చేశారు. అలాగే జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో సవాల్ చేసి రేవంత్ పారిపోయారని చెప్పారు.
రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, గెలుపు ఓటములే ప్రామాణికం కాదని వ్యాఖ్యానించారు. గతంలో రేవంత్ రెడ్డిని బిఆర్‌ఎస్ పార్టీ ఓడించలేదా అని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ కూడా ఎన్నికల్లో ఓడిపోలేదా..? అని ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో గురువారం మాజీమంత్రి కెటిఆర్ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కల్వకుర్తి నుంచి పారిపోయిన వంశీచంద్ కూడా తమ గురించి మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. ఎవరైనా తమ స్థాయి తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని సూచించారు. మగాడివైతే ఒక్క సీటు గెలవాలని సిఎం మాట్లాడటం సరికాదని, రాజకీయాలలో ఆడవాళ్లు గెలువొద్దా..? అని ప్రశ్నించారు. గెలిచిన ప్రతిసారి మగవాడిని… ఒడితే కాదు అంటావా..? అని ప్రశ్నించారు. కొడంగల్‌లో ఒడిపోయినప్పుడు మగడివికాదా.. రేవంత్‌రెడ్డి మగాడైతే ఇచ్చిన హామీ మేరకు ముందు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
ఆడబిడ్డలకు రూ.2,500 సహా ఇచ్చిన 420 హామీలు అమలు చేయాలని హితవు పలికారు. కాంగ్రెస్ ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్లు ప్రవర్తిస్తుందని మండిపడ్డారు. అంబర్‌పేటలో తాను తమ పార్టీ కార్యకర్తల సమావేశానికి వెళుతుంటే కాంగ్రెస్ కార్యకర్తలు తనను అడ్డుకునే ప్రయత్నం చేశారని అన్నారు. తనను ఎందుకు అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ కార్యకర్తను అడిగితే ఏమీ చెప్పలేకపోయారని పేర్కొన్నారు. లోక్‌సభ అభ్యర్థిత్వాలపై మార్చి 2వ తేదీ నుంచి తెలంగాణ భవన్‌లో కెసిఆర్ సమావేశాలు నిర్వహిస్తారని కెటిఆర్ వెల్లడించారు.
రేవంత్ రెడ్డిది పేమెంట్ కోటా
తమది మేనేజ్మెంట్ కోటా అని రేవంత్‌రెడ్డి పదేపదే అంటున్నారని, అయితే..తమది మేనేజ్మెంట్ కోటా అయితే రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీది ఏం కోటా..? అని ప్రశ్నించారు. డబ్బులు ఇచ్చి పదవి తెచ్చుకున్న రేవంత్ రెడ్డిది పేమెంట్ కోటా అని పేర్కొన్నారు. డబ్బులు ఇచ్చి పదవి తెచ్చుకున్నందుకు రేవంత్.. ఢిల్లీకి పేమెంట్ చేయాలి.. బ్యాగులు మోయాలని విమర్శించారు. ఢిల్లీకి కప్పం కట్టాలి కాబట్టి శివకుమార్, రేవంత్ రెడ్డి 18 గంటలు కష్టపడాలని అన్నారు. ఇందుకోసం బిల్డర్లు, వ్యాపారులను బెదిరించాలని చూస్తున్నారని పేర్కొన్నారు. ఢిల్లీకి పేమెంట్ చేసేందుకే భవన నిర్మాణ అనుమతులు ఆపారని ఆరోపించారు. టిఎస్‌బిపాస్ చట్టం ఉన్నప్పటికీ దానిని అమలు చేయడం లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్ని అనుమతులు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. త్వరలో బిల్డర్లు. వ్యాపారులు రేవంత్ తీరును వ్యతిరేకిస్తూ రోడ్డు ఎక్కుతారని పేర్కొన్నారు. అన్ని పార్టీల అభిప్రాయాల ప్రకారమే తమ ప్రభుత్వం 111 జీవో ఎత్తివేతపై నిర్ణయం తీసుకుందని చెప్పారు. 111 జిఒ పరిధిలో ఉన్న అన్ని గ్రామాలు ఆ జిఒ ఎత్తివేయాలని తీర్మానాలు చేశాయని గుర్తు చేశారు.
ఏ విచారణకైనా సిద్ధం
ముఖ్యమంత్రి గుర్తింపు సమస్యతో బాధపడుతున్నట్లు అనిపిస్తోందని, అందుకే పదేపదే నేనే సిఎంను, నేనే పిసిసి అధ్యక్షుడిని చెప్పుకుంటున్నారని కెటిఆర్ ఎద్దేవా చేశారు. ఆయనకు తానే సిఎం అన్న నమ్మకం లేదా..? అని అడిగారు. తమ ప్రభుత్వంలో కొన్ని తప్పులు జరిగి ఉండొచ్చు అని, . పాలనలో అన్నీ ముఖ్యమంత్రి, మంత్రులకు తెలియాలని లేదని అన్నారు. తమ హయాంలో తప్పులు జరిగాయనుకుంటే విచారించి చర్యలు తీసుకోవాలని, తాము ఏ విచారణకైనా సిద్ధమని చెప్పారు.
రేవంత్‌రెడ్డి బిజెపికి పరోక్షంగా సహకరిస్తున్నారు
సిఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో బిజెపికి పరోక్షంగా సహకరిస్తున్నారని కెటిఆర్ ఆరోపించారు. భువనగిరి మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బిజెపి కలిసికట్టుగా పదవులు పంచుకున్నారని గుర్తు చేశారు. తమ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్‌ను దించి కాంగ్రెస్ అభ్యర్థి చైర్మన్ అయితే, బిజెపి అభ్యర్థి వైస్ చైర్మన్ అయ్యారని అన్నారు. కాంగ్రెస్, బిజెపి పార్టీల మధ్య బంధం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత రాజకీయం మరింత రంజుగా ఉంటుందని పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో ఏం జరుగుతుందో చూస్తున్నామని చెప్పారు.
మేడిగడ్డ ప్రమాదం మెదటిది కాదు
సాగునీటి ప్రాజెక్టుల్లో మేడిగడ్డ ప్రమాదం మెదటిది కాదని కెటిఆర్ పేర్కొన్నారు. గతంలో కడెం ప్రాజెక్ట్, ఫరక్కా బ్యారేజి సహా అనేక ప్రాజెక్టులకు రిపేర్లు వచ్చాయని, కానీ అప్పటి ప్రభుత్వాలు మరమత్తులు చేసి కాపాడాయి తప్ప ప్రాజెక్టులను వదిలిపేట్టలేదని అన్నారు. మనదేశంలో ఎన్నో ప్రాజెక్టుల విషయంలో ఇలాంటివి జరిగాయని, ఇదేమీ కొత్త కాదు అని పేర్కొన్నారు. కాళేశ్వరంపై ప్రజలకు వాస్తవాలు తెలిపేందుకు శుక్రవారం(మార్చి 1) బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి మేడిగడ్డ వెళుతున్నామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర స్వరూపాన్ని ప్రజలకు చూపెడతామని చెప్పారు. మార్చి 1న ఉదయం 8.30 గంటలకు పార్టీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మాజీ ఎంపిలు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు అందరం తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి వెళ్తామని చెప్పారు. ముందుగా మేడిగడ్డ బ్యారేజీ వద్ద పగుళ్లను పరిశీలించి అక్కడి నుంచి అన్నారం బ్యారేజీకి వెళతామని, అక్కడ మాజీ మంత్రులు హరీశ్‌రావు, కడియం శ్రీహరిలు కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజంటేషన్ ఇస్తారని తెలిపారు.
మేడిగడ్డ ప్రాజెక్టులో ప్రమాదం జరిగినప్పుడు ఎన్నికల కోడ్ ఉందని, అందుకే తాము ఏమీ చేయలేకపోయామని చెప్పారు. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మరమ్మత్తులపైన, ఇంజనీరింగ్ పరిష్కారాల దిశగా కార్యచరణ ఉండాలని చెప్పారు. మేడిగడ్డలో మూడు పిల్లర్లకు పగుళ్లు రావడం దురదృష్టకరనమని, కాళేశ్వరంపై దుష్ప్రచారం మాని పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం అంటే కేవలం ఒక బ్యారేజీ కాదు అని, 15 రిజర్వాయర్లు, 21 పంప్‌హౌజ్‌లు, 203 కిలో మీటర్ల సొరంగాలు అని పేర్కొన్నారు. మేడిగడ్డలో 84 పిల్లర్లు ఉంటే 3 కుంగిపోయాయని, 3 పిల్లర్లు కుంగితే బ్యారేజీ మెుత్తం కొట్టుకుపోయినట్లు చెబుతున్నారని మండిపడ్డారు. అందుకే కాళేశ్వరమంటే ఏంటో సజీవంగా చూపెట్టాలనుకుంటున్నామని వెల్లడించారు. తమపై కక్షతో రైతులకు నీళ్లు ఇవ్వకుండా ఆపొద్దని కెటిఆర్ అన్నారు. తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తామంటే వ్యవహరించండి, కానీ రైతులకు నీళ్లు ఇవ్వాలని కోరారు. తమ న్యాయస్ధానాలపై నమ్మకం ఉందని, అవసరం అయితే కాంగ్రెస్ కక్షపూరిత చర్యలపై పోరాడతామని చెప్పారు.ఉత్తమ్ కూమార్ రెడ్డి వ్యవహారశైలి, ప్రభుత్వం తీరుపై కెటిఆర్ మండిపడ్డారు.
సునీల్ కనుగోలు సలహాలు తీసుకుంటారా..?
ప్రభుత్వం ప్రాజెక్టు కొట్టుకుపోవాలన్న కుట్ర చేస్తున్నట్లుగా కనిపిస్తుందని ఆరోపించారు. మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తమ సలహాలు వద్దంటున్నారని, ఆయన సునీల్ కనుగోలు సలహాలు తీసుకుంటారా..? అని ప్రశ్నించారు. ప్రాజెక్టుల విషయంలో తమ సలహాలు వద్దు అంటే నిపుణుల సలహాలు తీసుకోవాలని సూచించారు. తమ సలహలు వద్దంటే నిపుణుల కమీటి వేయాలని అన్నారు. నాలుగు నెలల్లో కాఫర్ డ్యాం కట్టి మరమత్తులు చేయాలని తెలిపారు. మార్చి నెలాఖరు నాటికి నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నారని,త్వరగా మరమ్మత్తులు చేసి త్వరగా రైతులకు సాగునీరు ఇవ్వాలని చెప్పారు. ఇప్పటికే పలు ప్రాంతాలలో పంటలు ఎండి పోతున్నాయని చెప్పారు. ఇప్పుడు కూడా సూమారు 5వేల క్యూసెక్కుల నీళ్లు కిందకు పొతున్నాయని పేర్కొన్నారు.
ఒక వైపు కాళేశ్వరం విఫలం అంటూనే.. కాళేశ్వరం ద్వారా హైదరాబాద్‌కు నీళ్లు ఇస్తామంటున్నారని చెప్పారు. ఈ విషయంలో కాంగ్రెస్ కన్యూఫ్యూజన్‌లో ఉందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకుంటే తమకు అప్పగించాలని ఇప్పటికే హరీష్ రావు చెప్పారని, తమకు నీటి పారుదల శాఖను అప్పగించినా, ప్రభుత్వాన్ని అప్పగించినా చేసి చూపిస్తామని తెలిపారు. ఒక్క మేడిగడ్డ బ్యారేజీనే కాళేశ్వరం మొత్తం అన్నట్లుగా సిఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి చేస్తున్న ప్రచారం అపాలని అన్నారు.
ప్రజల దృష్టి మరల్చేందుకే పోటీ యాత్ర
తాము మేడిగడ్డకు వెళుతుంటే, తమకు పోటీగా కాంగ్రెస్ పాలమూరు యాత్ర చేస్తామంటుందని, ఇది ముమ్మాటికీ తమకు పోటీ యాత్రనే అని కెటిఆర్ పేర్కొన్నారు. ప్రజల దృష్టి మర్చలడం కోసమే పోటీ యాత్ర చేస్తున్నారని ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయ్యిందని, కేవలం కాలువలు తవ్వడమే మిగిలిందని చెప్పారు. రిజర్వాయర్లు, పాలమూరు ప్రజలకు మీయాత్రతో మేము కట్టిన రిజర్వార్ల గురించి గుర్తు చేసిన వారు అవుతారు
ఎస్‌డిఎస్‌ఎది రాజకీయ ప్రేరేపిత నివేదిక
ప్రాజెక్టులో కనీసం ఒక్క శాంపిల్ అయినా తీసుకోకుండా కేంద్రం పరిధిలో ఎన్‌డిఎస్‌ఎ రెండు రోజుల్లో నివేదిక ఇచ్చిందని కెటిఆర్ పేర్కొన్నారు. ఎన్‌డిఎస్‌ఎది రాజకీయ ప్రేరేపిత నివేదిక అని, అందుకే ప్రభుత్వానికి కన్నా ముందు ఆ నివేదిక మీడియాకి చేరిందని చెప్పారు. ఎన్నికలలో లబ్దిపొందేందుకు కేవలం రెండు రోజుల్లోనే ఆదరాబాదరాగా ఎన్‌డిఎస్‌ఎ నివేదిక ఇచ్చిందని విమర్శించారు. ఇప్పటికైనా ఎన్‌డిఎస్‌ఎ కనీసం ఒక్క సాంపిల్ తీసుకున్నదా..? అని ప్రశ్నించారు. ప్రాజెక్టును పరిశీలించకుండా, శాంపిల్ తీసుకోకుండా ఎన్‌డిఎస్‌ఎ రిపోర్టు ఎప్పుడు వస్తుందో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పాలనిఅ అన్నారు. తమ ప్రభుత్వం సమాచారం, నివేదికలు ఇవ్వకుంటే ఎన్‌డిఎస్‌ఎ సమగ్రమైన రిపోర్టు ఎలా ఇచ్చిందో చెప్పాలని అడిగారు. బిజెపి అధ్వర్యంలోని కేంద్ర సంస్ధలపై కాంగ్రెస్ మంత్రి ఉత్తమ్‌కు అంతా నమ్మకం ఎందుకు..? అని నిలదీశారు. కేవలం తమకు అనుకూలంగా ఉన్నందుకేనా అని అని పేర్కొన్నారు. మరి సిబిఐ, ఇడిలపై కూడా ఇంతే నమ్మకం ఉన్నదా చెప్పాలని అన్నారు.
ప్రభుత్వానికి కామన్‌సెన్స్ లేదు
రైతాంగాన్ని అదుకోవాలన్న సెన్స్, కామన్ సెన్సు ప్రభుత్వానికి లేదని కెటిఆర్ విమర్శించారు. కిందకుపోతున్న నీళ్లని ఎత్తిపోసేందుకు ఒక పంపుతో అయినా నీళ్లు అందించాలని అన్నారు. సముద్రంలో నీరు వృథాగా కలిసిపోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అక్కడ ఉన్న సమస్య ఎంటో తెలుసుకుని మంత్రి ఉత్తమ్ పరిష్కారానికి ప్రయత్నం చేయాలని చెప్పారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి బ్యారేజీకి, రిజర్వాయర్‌కు తేడా తేలియదని, ముందు ఆ తేడా తెలుకోవాలని సూచించారు. సెన్స్ ఉన్న మంత్రి నీళ్లు ఎత్తిపోసి, రైతులకు నీళ్లు ఎలా ఇవ్వాలో చూడాలని అన్నారు.
వెదిరే శ్రీరాం ఒక్కటే తెలివైన వాడా..?
కాళేశ్వరం ప్రాజెక్టుకు 400 అనుమతులున్నాయని, అప్పుడు అనుమతులు ఇచ్చి, ఇప్పుడు ఇవ్వలేదంటే ఎటా..? అని కెటిఆర్ ప్రశ్నించారు. జలశక్తి మంత్రిత్వ శాఖ సలహాదారు వెదిరే శ్రీరాం ఒక్కటే తెలివైన వాడా..? అనుమతులు ఇచ్చిన వాళ్లు తెలివిలేని వాళ్లా..? అని నిలదీశారు.
వెదిరే శ్రీరాం ఎంపి కోసం తాపత్రయంతో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని కెటిఆర్ ఆరోపించారు.