Saturday, January 11, 2025

రేవంత్‌రెడ్డివి ఆపదమొక్కులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పా ర్లమెంట్ ఎన్నికల్లో గెలిచేందుకు ఆపద మొక్కులు మొక్కుతున్నారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎంఎల్‌ఎ కెటిఆర్ ధ్వజమెత్తారు. ఇచ్చిన మాట నిలుపుకోలేని అసమర్థ నాయకుడు రేవంత్‌రెడ్డి అని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి ఒట్లను వింటున్న దేవుళ్లు భయంతో పారిపోతున్నారని విమర్శించా రు. తెలంగాణ భవన్‌లో శనివారం కెటిఆర్ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. రేవంత్ రెడ్డి తన సొంత జిల్లాలో గెలవడం కూడా కష్టమే అని కెటిఆర్ పేర్కొన్నారు. తాను ఇంఛార్జ్‌గా ఉన్న దగ్గర ఓడిపోతే పరువు పోతుందని రేవంత్ రెడ్డి ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారని ఆరోపించా రు. కాంగ్రెస్ పార్టీ నాయకులవి చిల్లర, ఉద్దెర మాటలు అని విమర్శించారు. ప్రభుత్వం చెప్పిన పథకాలకు సంబంధించి ఇప్పటి దాకా ఒక్క రూపాయి కూడా ఎవరి ఖాతాలోకి చేరలేదని, రూ. 500 బోనస్, రూ. 4 వేల పెన్షన్, రైతు కూలీలకు రూ. 12 వేలు, కౌలు రైతులకు రైతు భరోసా, విద్యార్థినులకు స్కూటీలు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి వీటిలో ఏ ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేదని అన్నారు.

ప్రజలందరికీ కాంగ్రెస్ చెప్పిన మాటలు నమ్మి మోసపోయామని అర్థమైందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ చేతిలో మోసపోయిన ప్రజలంతా మళ్లీ మోసపోకుండా జాగ్రత్త పడాలని కోరారు. ఆగస్ట్ 15న రుణమాఫీ అని మరోసారి రైతులను మోసం చేసే పని పెట్టుకున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డిది మాట నిలుపుకున్న చరిత్ర కాదు అని పేర్కొన్నారు. నేతి బీరకాయలో నెయ్యి ఉండని తీరుగానే రేవంత్ రెడ్డి మాటల్లో నిజాయితీ ఉం డదని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చిన పార్టీకే రేవంత్ రెడ్డి కట్టుబడి లేడు అని, ఆయన ఏ సవాలుకి కట్టుబడి ఉన్నాడో చెప్పాలని అడిగారు. కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం అన్నాడు..జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో కూడా గెలుస్తామని చెప్పి ఓడిపోయిన తర్వాత మాట తప్పాడు అని గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు రేవంత్‌రెడ్డి మోసం పార్ట్ 1 ఎంచుకున్నారు..ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల కోసం మోసం పార్ట్ -2 మొదలు పెట్టారని కెటిఆర్ విమర్శించారు.

రేవంత్ రెడ్డి కచ్చితంగా బిజెపిలో చేరతారు
కేంద్రంలో కాంగ్రెస్ వచ్చేది సచ్చేది లేదని కెటిఆర్ వ్యా ఖ్యానించారు. అందుకే దేవుడి పైన ఒట్లు పెడుతూ ప్రజలను మోసం చేసే పని పెట్టుకున్నారని చెప్పారు. ఒక పార్టీ 24 వసంతాలు పూర్తి చేసుకోవటం చిన్న విషయం కాదు అని పేర్కొన్నారు. ఉద్యమకారులు గొప్ప పరిపాలకులు కాలేరు అని అరుణ్ జైట్లీ అన్నారని, కానీ ఆ మాట తప్పని కెసిఆర్ నిరూపించి చూపించారని తెలిపారు.14 సంవత్సరాల పాటు ఉద్యమం చేసి తెలంగాణ సాధించామని, పదేళ్లు అధికారంలో ఉండి తెలంగాణకు సేవ చేశామని అన్నారు. కాంగ్రెస్ వచ్చిన నాలుగు నెలల్లోనే తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, కరెంటు కోతలు, తాగునీటి కష్టాలు లేని కెసిఆర్ పరిపాలనే మళ్లీ కావాలని అనుకుంటున్నారని వ్యా ఖ్యానించారు. హైదరాబాద్ నగరం సంపూర్ణంగా బిఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించిందని, కాంగ్రెస్, బిజెపిలను పూర్తిగా తిరస్కరించిందని చెప్పారు.

ఎంపి సీట్ల కేటాయింపులో సామాజిక సమతూకం
లోక్‌సభ సీట్ల కేటాయింపులో బిఆర్‌ఎస్ సామాజిక సమతూకాన్ని పాటించిందని కెటిఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్,బిజెపిలు మాత్రం సామాజిక సమతూకం పా టించడంలో విఫలమయ్యాయని విమర్శించారు. తాము అం దుబాటులో ఉన్న 12 సీట్లలో ఆరు సీట్లు అంటే 50 శాతం బిసిలకే కేటాయించామని చెప్పారు. తమ పార్టీ కేటాయించిన సీట్లతో సుదీర్ఘకాలం ఉద్యమం చేసిన నాయకులతో పాటు పార్టీకి పనిచేసిన నాయకులు, బిసిలు, దళితులు, గిరిజనులు ఇలా అన్ని వర్గాలు సంతృప్తిగా ఉన్నాయని తెలిపారు. ప్రతి ఇంటికి నీళ్లు, బుల్లెట్ ట్రైన్లు, ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు, ప్రతి ఒక్కరి ఇళ్లు అని చాలా హామిలిచ్చిన మోడీ ఒక్కటి కూడా నెరవేర్చకుండా దేశ ప్రజలను మోసం చేశారని విమర్శించారు. మోడీ తెలంగాణ పుట్టుకను అవమానించారని, రాష్ట్రంపై ఎన్నో సార్లు విషం చిమ్మారని గుర్తు చేశారు.

బిజెపి, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కు
భారత రాష్ట్ర సమితికి 10 నుంచి -12 సీట్లు ఇవ్వాలని కెటిఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అప్పుడు కెసిఆరే రాష్ట్ర రాజకీయాలను శాసించి ప్రజలకు మంచి జరిగేలా చేస్తారని చెప్పారు. నరేంద్ర మోడీని ఇప్పుడు ఉత్తర భారత ప్రజలు కూడా తిరస్కరిస్తున్నారని, తమిళనాడు నాడు సహా చాలా రా ష్ట్రాల్లో ఎక్కడికక్కడ ప్రాంతీయ పార్టీలు నరేంద్ర మోడీని అడ్డుకుంటున్నాయని పేర్కొన్నారు. బిఆర్‌ఎస్‌ను ఎట్టి పరిస్థితుల్లో గెలవనియ్యవద్దంటూ బిజెపి, కాంగ్రెస్ పార్టీలు కు మ్మక్కయ్యాయని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీ బిజెపికి సహకరించేందుకే చాలా చోట్ల డమ్మీ అభ్యర్థులను పెట్టారని అన్నారు. లోక్‌సభ నియోజకవర్గాల్లోని చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఆయా నియో జకవర్గాలతో సంబంధమే లేదని చెప్పారు. మల్కాజిగిరితో సంబంధమే లేని సునీత మహేందర్‌రెడ్డిని అక్కడ పోటీ నిలిపారని, రేవంత్ రెడ్డి బిజెపికి సహకరిస్తున్నాడనే దానికి ఇదే ఉదాహరణ అని వ్యాఖ్యానించారు.

కడియంది మామూలు ద్రోహం కాదు
కెసిఆర్‌కు కడియం శ్రీహరి చేసిన ద్రోహం మామాలుది కాదు అని, ఆయన చర్య వరంగల్ ప్రజల మనసులను కూడా బా ధించిందని పేర్కొన్నారు. వరంగల్ గర్వకారణమైన కాకతీయ కళాతోరణాన్ని అధికారచిహ్నంలో నుంచి తీసేసిన రేవంత్ రెడ్డితో కలిసి నందుకు కడియం శ్రీహరి వరంగల్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. వరంగల్‌లో కడియం శ్రీహరి, ఆయన కూతురు మూడవ స్థానానికి పడిపోయారని అన్నారు. రాహుల్ గాంధీ, రేవంత్‌రెడ్డి వచ్చి ప్రచారం చేసినా సరే కడియం శ్రీహరి మూడో స్థానం దాటి ముందుకు రాలేరని పేర్కొన్నారు.
మల్కాజిగిరిలో కచ్చితంగా గెలిచేది బిఆర్‌ఎస్సే
మల్కాజిగిరిలో కచ్చితంగా గెలిచేది బిఆర్‌ఎస్సే.. అది ఈటల రాజేందర్‌కు కూడా తెలుసు అని కెటిఆర్ అన్నారు. మల్లారెడ్డి రాజకీయ అనుభవంతో వ్యూహంతోనే ఆ కామెంట్ చేశారని, ఈటెల రాజేందర్‌ను మునగ చెట్టు ఎక్కిచ్చి తన రాజకీయ అనుభవాన్ని చాటుకున్నారని పేర్కొన్నారు. మల్లారెడ్డి అన్న మాట అంతరార్థం తెల్వక కొంతమంది ఆగమావుతున్నారని చెప్పారు. కొంతమంది నాయకులు స్వార్థం కోసం పార్టీ నుంచి వెళ్లిపోయినా సరే… శ్రేణులు అంతా వెళ్లడం అసాధ్యమని పేర్కొన్నారు. బిఆర్‌ఎస్‌లోనే తనకు గౌరవం ఉండేదని పార్టీ మారిన తర్వాత ఈటల రాజేందర్ చెప్పిన మాటను గుర్తుంచుకోవాలని అన్నారు.

కోపంగా అనేక సామాజిక వర్గాలు
రాష్ట్రంలో 10- నుంచి 12 ఎంపి స్థానాలు సాధిస్తే కేంద్రంలో రానున్న ప్రభుత్వంలో కీలకపాత్ర వహించే అవకాశం ఉం టుందని కెటిఆర్ చెప్పారు. ఎన్‌డిఎ, ఇండియా కూటమిలో లేకుండా కూడా సుమారు 13 పార్టీలు బయట ఉన్నాయని తెలిపారు. ఎన్నికల తర్వాత ఉచిత బస్సు కార్యక్రమం రద్దు అవుతుందని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓట్లు వేయకుంటే దాన్ని రద్దు చేస్తామని సిఎం ప్రజలను బెదిరిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో బస్సులు నడిపే పరిస్థితి లేకుండా మారిందని చెప్పారు. సమాజంలో ఉన్న అనేక సామాజిక వర్గాల ప్రజలు రేవంత్ రెడ్డి పైన కోపంగా ఉన్నారని, మాదిగ సామాజిక వర్గంతో పాటు…మంత్రి పదవి దక్కని ముదిరాజ్ సోదరులు…ఎంపీ సీటు దక్కని గౌడ, యాదవ సోదరులు రేవంత్‌ను ఓడించాలని భావిస్తున్నారని అన్నారు. రంజాన్ పండుగకు కూడా స్పందించని రేవంత్ తీరుపైన మైనార్టీలు కోపంగా ఉన్నారని పేర్కొన్నారు. ఇలా ఏ సామాజిక వర్గమైన సరే కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా ఎన్నికల్లో నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News