Sunday, November 24, 2024

ఆ ఆరుగురితో రాజీనామా చేయించు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ జగిత్యాల ప్రతినిధిః ‘రేవంత్ రెడ్డి.. నీవు మొగోడివి అయితే..మీ పార్టీలో చేరిన మా ఆరుగురు ఎంఎల్‌ఎలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రా..’ అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు. జగిత్యాల జిల్లా బిఆర్‌ఎస్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ…పార్టీ ఫిరాయింపులకు పాల్పడే ఎంఎల్‌ఎలను కుక్కల మాదిరి రాళ్లతో కొట్టి చంపాలని రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడారని, మరి ఇప్పుడు ఎవరు పిచ్చికుక్క.. ఎవర్ని రాళ్లతో కొట్టిచంపాలి అని ప్రశ్నించారు. ‘ఆ ఆరుగురు ఎంఎల్‌ఎలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రా.. ఓట్లతో కొట్టి వారిని రాజకీయంగా శ్వాశతంగా సమాధి చేసే బాధ్యత తెలంగాణ సమాజం తీసుకుంటది’ అని స్పష్టం చేశారు. ‘లోకల్ బాడీ ఎన్నికల్లో గల్లీ గల్లీ తిరుగతా.. మీకు అండగా ఉంటా..కవితక్క కూడా వస్తది.. తప్పకుండా తిరుగుతది. మన అభ్యర్ధులను గె లిపించుకొని సంజయ్‌ని జగిత్యాల నుండి తరిమికొడదాం’ అని పిలుపునిచ్చారు.

గాలికి కొట్టుకుపోయేది గడ్డిపోచలు మాత్రమే అని జగిత్యాల ఎంఎల్‌ఎ డాక్టర్ సంజయ్ అని చురకలంటించారు. జగిత్యాలకు పట్టిన శని పోయిందని ఈ నియోజకవర్గ ప్రజలు ఉత్సాహంగా ఉన్నట్లు అనిపిస్తోందని గాలికి గడ్డపారలు కొట్టుకుపోవు.. గట్టి నాయకులు కొట్టుకుపోరని, గాలికి కొట్టుకుపోయేది గడ్డిపోచలు మాత్రమే అన్నారు. కవితక్కతో సహా వేల మంది కష్టపడితే సంజయ్ ఎంఎల్‌ఎ అయిండు. ఇప్పుడు దొంగల్లో కలిసిండు.. రేవంత్ రెడ్డి విసిరే ఎంగిలి మెతులకు ఆశపడి పోయిండని మండిపడ్డారు. ఏ అభివృద్ధి ఆశించి పోయిండు సంజయ్..ఆయన పో యింది ఒక్కదాని కోసం.. ఇయ్యంకుడి బిల్లులు రావాలి.. ఆయన క్రషర్ ఆగొద్దని పోయిండు అని ఆరోపించారు. సొంత అభివృద్ధి కోసం పోయిండు..జగిత్యాల అభివృద్ధి కోసం పోలేదు అని వ్యాఖ్యానించారు. ‘ఒక్క రేవంత్ రెడ్డే కాదు.. అందరూ మాట్లాడారు.. రాహుల్ గాంధీ కూడా చాలా మాట్లాడారు. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో ఫిరాయిస్తే ఆటోమేటిక్ డిస్ క్వాలిఫికేషన్ చేస్తా అని రాహుల్ తుక్కుగూడలో నరికిండు. మేనిఫెస్టోలో పెట్టుడు కాకుండా పాంచ్ న్యాయ్ అనే దాంట్లో కూడా పెట్టారు రాహుల్ గాంధీ. ఇక జీవన్ రెడ్డి కూడా ఆగమైండు.. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి మారొద్దని తాము మేనిఫెస్టోలో పెట్టామని జీవన్ రెడ్డి చెప్పిండు. ఇక ఇప్పుడు జగిత్యాల ప్రజలు నిర్ణయం తీసుకోవాలి. ఓట్లకు వస్తే ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టాలి’ అని కెటిఆర్ అన్నారు.

నోటికొచ్చిన హామీలు, మాటలు చెప్పారు
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నాయకులు నోటికొచ్చిన హామీలు, మాటలు చెప్పారు అన్నారు. రుణమాఫీ లేదు. నాలుగు వేలు పెన్షన్లు లేవు. ఆడబిడ్డలందరికీ నెల కు రూ. 2500, క్వింటాల్‌కు రూ. 500 బోనస్, బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు, మెనార్టీలకు 20 వేల కోట్లు ఖర్చు చేస్తానని 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కిండని, కానీ ఒక్క హామీ కూడా నెరవేరలేదు అని గుర్తు చేశారు. గాలికి గడ్డపారలు కొట్టుకుపోవు. నిజమైన గులాబీ దండు ఎక్కడికీ పోదు.. తప్పకుండా తిరిగి కెసిఆర్ నాయకత్వంలో విజృంభిస్తాం. తాత్కాలికంగా రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. రెండుసార్లు ఎవరి పొత్తు, మద్దతు అవసరం లేకుండా 2014లో 63, 2018లో 88, 2023లో కూడా మూడో వంతు సీట్లు అంటే 39 స్థానాలు గెలిచాం. 14 సీట్లలో కే వలం స్వల్ప తేడాతో ఓడిపోయాం అని తెలిపారు.

పార్లమెంట్ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది
పార్లమెంట్ ఎన్నికల్లో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మోడీ మీదనే ఎన్నికలు జరిగాయి. దీంతో సమాజం నిట్టనిలువునా చీలిపోయింది. మోడీని వద్దనుకున్నవారు ఇండియా కూటమికి, కావాలనుకున్న వారు ఎన్‌డిఎకు ఓటేశారని, ఏ కూటమిలో లేని వారికి కొంత ఇబ్బంది కలిగిందని అన్నారు. కేరళలో సిపిఎం ఉంది. ఏ కూటమిలో లేదు.. స్వతంత్రంగా మనలాగా పోటీ చేసింది.. 20లో ఒకటి గెలిచింది. ఎపిలో జగన్ , తెలంగాణలో మనం ఓడిపోయాం. ఒడిశాలో నవీన్ పట్నాయక్ సిఎంగా ఉండి కొట్లాడితే ఒక సీటు వచ్చింది. యుపిలో బిఎస్‌పికి ఒక్క సీటు కూడా రాలేదు. పంజాబ్‌లో అకాలీదళ్‌కు ఒక్క సీటు కూడా రాలేదు. ఈ దేశంలో ఎన్నో బలమైన పార్టీలు.. బిజెడి, అకాలీదళ్, బిఎస్‌పి, సిపిఎం, వైఎస్‌ఆర్‌సిపితో పాటు మనకు ఎదురుదెబ్బ తగిలిందని పేర్కొన్నారు.

మళ్లీ ఎగిరేది గులాబీ జెండానే..
రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలు, అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ల్లీ ఎగిరేది గులాబీ జెండానే. మనం భయపడొద్దు.. కెసిఆర్ అండగా ఉన్నారు..మన పనులు ప్రజల కళ్ల ముందున్నాయి. చరిత్రను చెరిపిస్తే చెరిగిపోదు..జగిత్యాలను జిల్లా చేసింది కెసిఆర్.. ఒక్కడు పోయిండు అని భయపడొద్దు. ఎంగిలి మెతుకుల కోసం కొందరు పోతే పోనీ ప్రజలే తీర్పు చెబుతారు అన్నారు. మీ సమస్యలపై మండలిలో ఎల్ రమణ, అసెంబ్లీలో కోరుట్ల ఎంఎల్‌ఎ సంజయ్ గళం విప్పుతారు అన్నారు. రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలు ఉంటాయని అన్నారు. జగిత్యాల ఎంఎల్‌ఎ కూడా కాంగ్రెస్లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుండు అని ఆరోపించారు. ఈ సమావేశంలో బిఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News