బిఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి కెటిఆర్ మరోసారి సిఎం రేవంత్‌రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సిఎం రేవంత్‌రెడ్డి కంప్యూటర్ల మూలాధారాలు కనిపెట్టి మళ్లీ ఆవిష్కరిస్తున్నారని ఎక్స్ వేదికగా ఎద్దేవా చేశారు. దిల్లీ బాసులను ప్రసన్నం చేసుకునేందుకు విమానాలు ఎక్కే పనిలో నిమగ్నమై, సీఎం తన విధులు విస్మరిస్తున్నారని ఆక్షేపించారు. సెప్టెంబరు 3వ తేదీన పాలమూరు- రంగారెడ్డి నీటి ఎత్తిపోతల పథకంలోని వట్టెం పంపుహౌస్‌లో వరదలు రావడంతో తీవ్ర ఆందోళన నెలకొందని పేర్కొన్నారు. ఈ ఘటనలో బాహుబలి మోటార్లు నీట మునిగాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది అత్యవసరమైనప్పటికీ, ఇప్పటి వరకు కేవలం ఒక మీటరు నీరు మాత్రమే తొలగించారని, మరో 18 మీటర్ల మేర తక్షణమే నీరు తొలగించాలని ఆయన సూచించారు. నీటిని తొలగించని పక్షంలో పంప్‌లు పాడయిపోయే ప్రమాదం ఉందన్నారు.
’మిస్టర్ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి, రైతులకు ముఖ్యమైన ప్రతి దాన్ని నాశనం చేయడానికి మీరు ఎందుకు నరకయాతన పడుతున్నారో సమాధానం ఇవ్వండి?’ అంటూ ప్రశ్నించారు. మరోవైపు అగ్రిహబ్‌లను కొనియాడుతూ ట్వీట్ చేశారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో నూతన ఆవిష్కరణలు ప్రోత్సహించడానికి, బ్లాక్ చైన్, రోబోటిక్స్, క్లౌడ్, డ్రోన్ల, వంటి అధునాతన సాంకేతికలతో రైతుల సమస్యలకు పరిష్కారాలు చూపడానికి అగ్రిహబ్‌లు ఉపయోగపడుతున్నట్లు ఆయన తెలిపారు. వీటిని 2021 ఆగస్టులో ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అప్పటి కెసిఆర్ ప్రభుత్వం స్థాపించిందని గుర్తు చేశారు. ఇది దేశంలోనే వ్యవసాయ రంగంలో మొదటి ఇంక్యుబేటర్‌గా గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. వరంగల్, జగిత్యాల, వికారాబాద్‌లో అగ్రిహబ్ ప్రాంతీయ కేంద్రాలు ఉన్నాయని, ఏ సదుద్దేశంతో నెలకొల్పామో దాన్ని అగ్రిహబ్ విజయవంతంగా నెరవేరుస్తోందన్నారు. అగ్రిహబ్‌లు అన్నదాతలకు అండగా నిలుస్తున్నందుకు సంతోషంగా ఉందని తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.
కెసిఆర్ ఘనతలను ఎప్పటికీ చెరిపివేయలేరు
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఘనతలను ఎప్పటికీ చెరిపివేయలేరని స్పష్టం చేశారు. గణాంకాలు ఎప్పుడూ అబద్ధం చెప్పవని, కెసిఆర్ ఘనతలు చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. తలసరి ఆదాయంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థిక సలహా మండలి నివేదిక విడుదల చేసిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘చెప్పాల్సిన వాళ్లే చెబుతున్నారు. బిఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రం ఎంతటి అద్భుతమైన పురోగతి సాధించిందో చెప్పడానికి పిఎం మోదీ ఆర్థిక సలహా మండలి నివేదికే గీటురాయి. జాతీయ తలసరి ఆదాయం సగటు కంటే తెలంగాణ తలసరి ఆదాయం సగటు 94 శాతం అధికం. ఇదంతా కేవలం తొమ్మిదన్నరేళ్లలోనే సాధించాం. కెసిఆర్ తెలంగాణను అన్ని రంగాల్లోనూ అభివృద్ధికి నమూనాగా నిలిపారు‘ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.