Monday, January 6, 2025

ధైర్యం కోల్పోవద్దు.. బుల్డోజర్లకు అడ్డుపడతాం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని హైదర్‌గూడలో సోమవారం పర్యటించారు. మూసీ ప్రాజెక్టు బాధితులను పరామర్శించారు. అండగా ఉంటామని వారికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1920 నుంచి 2020 వరకు మూసిలో ఎలాంటి సమస్య తలెత్తలేదన్నారు. 2020లో తొలిసారిగా భారీ వర్షం కురవడంతో ఇబ్బందులు వచ్చాయని గుర్తు చేశారు. అప్పుడు కూడా కేసీఆర్ ప్రజలకు ఇబ్బందులు పెట్టవద్దన్నారన్నారు. కానీ కాంగ్రెసోళ్లే పర్మిషన్ ఇచ్చి, వాళ్లే రిజిస్ట్రేషన్ చేసి, వాళ్లే ఇళ్లను కూలగొడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వంలో కుడి చేయి ఏం చేస్తుందో.. ఎడమ చేయికి తెలియటం లేదన్నారు. రేవంత్ రెడ్డి ఒక అన్ ఫిట్, అసమర్థ సీఎం అని, ఇక్కడ మార్కింగ్ ఇచ్చిన బిల్డింగ్లకు సంబంధించి విలువ లెక్కిస్తే దాదాపు వెయ్యి కోట్ల వరకు ప్రజల ఆస్తి ఉంటుందన్నారు. 2400 కిలోమీటర్లు ఉన్న నమామీ గంగే ప్రాజెక్ట్ కోసం రూ.40వేల కోట్లు ఖర్చు చేశారని, 55 కిలోమీటర్ల మూసీకి మాత్రం రూ.లక్షా 50 వేల కోట్లంట అంటూ విమర్శించారు.

ఢిల్లీ కాంగ్రెస్‌కు రూ.25వేల కోట్లు పంపటానికే రూ.లక్షా50 వేల కోట్లు ప్రాజెక్ట్ పెట్టుకున్నారని ఆరోపించారు. వాళ్ల బుల్డోజర్లకు అడ్డుగా మేముంటామని, ధైర్యం కోల్పోవద్దన్నారు. హైదరాబాద్‌లో లక్షల మంది వాళ్ల ఇళ్ల కోసం ఆందోళన చెందుతున్నారని, హైదరాబాద్‌లో ప్రజలు బీఆర్‌ఎస్‌ను గెలిపించుకుని కక్ష పెట్టుకుని ఈ కుట్ర చేస్తున్నారన్నారు. ఉత్తర ప్రదేశ్‌లో బుల్డోజర్ రాజ్ నహీ ఛలేగా అని రాహుల్ గాంధీ అంటాడని, మరి తెలంగాణలో వారి అయ్య జాగీరా బుల్డోజర్ రాజ్ నడిపించేందుకు? అంటూ నిలదీశారు. సోషల్ మీడియాలో ఆయనను తిడుతున్న తిట్లు చూస్తుంటే మనిషి అనేటోడు ఎప్పుడో సచ్చిపోతుండే అన్నారు. నీ సొంత ఇళ్లు కూడా చెరువు కుంటలోనే ఉందని, దాన్ని కూలగొట్టే దమ్ముందా నీకు అని ప్రశ్నించారు. దుర్గం చెరువులో వాళ్ల అన్న గానీ ఇళ్లు కూడా కూలగొట్టరంట. వాళ్ల మంత్రులు, వాళ్ల ఎమ్మెల్యేలందరి ఇళ్లు హిమాయత్‌సాగర్ చుట్టు ఉన్నాయని, నీకు నిజాయితీ, చిత్తశుద్ది ఉంటే ముందు వాళ్ల ఇళ్లు కూలగొట్టాలని డిమాండ్ చేశారు. పేదలు, మధ్య తరగతి వాళ్లకు ఇళ్లు అనేది ఒక ఎమోషన్ అని, అలాంటి ఇళ్లను కూలగొడితే వాళ్ల ఆశలను కూలగొట్టినట్లేనన్నారు.

ప్రజలు సంఘటితంగా ఉంటేనే ఈ ప్రభుత్వంతో మనం కొట్లాడగలమని.. ఒక్కరికి సమస్య వచ్చిన సరే అందరూ రావాలన్నారు. 18వేల ఇళ్లు అంటున్నారని, ఏ ఒక్కరి ఇళ్లు కూడా కూల్చనివ్వమన్నారు. పేదల ఇళ్లు కూల్చి.. పెద్ద, పెద్ద మాల్స్ కడుతావా? ఏదైనా పనిచేసే ముందు ప్రభుత్వానికి ఆలోచన ఉండాలన్నారు. రూ.5 వేలు ఇస్తే మీరు మాట్లాడుతున్నారని అంటున్నారని, సిగ్గు లేకుండా ఓ మంత్రి ఇలాంటి ప్రకటనలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ వెనుక బడా బిల్డర్లు ఉన్నారని పిచ్చి ప్రకటనలు చేస్తున్నారని, మీలో ఎవరైనా డబ్బుల కోసం మాట్లాడుతున్నారా? అన్నారు. రేవంత్ రెడ్డి నువ్వు మగాడివైతే ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమే భూ సేకరణ చట్టం తెచ్చిందని, మీకు చట్టాలు తెలియాలని, మా లీగల్ సెల్ తరపున మీకు అవగాహన కల్పిస్తామన్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ప్రజల ఆక్రందనలను చూపించాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. రేవంత్ రెడ్డి అన్నకు నాలుగు బెడ్ల రూమ్ ఇద్దామన్నారు. ఆయన ఇళ్లు మారతాడా చూద్దామని, ప్రజల శక్తి ముందు ఎవ్వరైనా తల వంచాల్సిందేనని, మీకోసం మేము బుల్డోజర్లకు అడ్డుగా నిలుస్తామన్నారు. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు. మీరు ఒక్క పైసా కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News