రాష్ట్ర ముఖ్యమంత్రిగా, హోం మంత్రి, కొడంగల్ ఎంఎల్‌ఎగా లగచర్లలో పోలీసులు చేసిన దౌర్జన్యానికి బాధ్యత తీసుకొని రేవంత్‌రెడ్డి ముక్కు నేలకి రాసి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ డిమాండ్ చేశారు. దళిత గిరిజనులపై జరిగిన అరాచకాలు, లైంగిక వేధింపులకు బాధ్యత వహించి సిఎం రాజీనామా చేసి క్షమాపణ కోరేవారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డికి ఏమాత్రం సిగ్గు లేనందునే ఇంకా సిఎంగా కొనసాగుతున్నారని మండిపడ్డారు. అధికారం మదంతో విర్రవీగుతున్న రేవంత్ రెడ్డి చెంప మీద కొట్టినట్టుగా జాతీయ మానవ హక్కుల కమీషన్(ఎన్‌హెచ్‌ఆర్‌సి) రిపోర్ట్ ఇచ్చిందని అన్నారు. లగచర్ల ఆడబిడ్డలను లైంగికంగా హింసించిన పోలీసులను సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. మూడేళ్లలో మళ్లీ బిఆర్‌ఎస్సే అధికారంలోకి వస్తుందని, రేవంత్ రెడ్డికి ప్రైవేటు సైన్యంలాగా ఓవరాక్షన్ చేస్తున్న పోలీసు అధికారులను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.
రిటైర్డ్ అయి ఏ మూలలో దాక్కున్నా పట్టుకొచ్చి హిసాబ్ కితాబ్ బరాబర్ చేస్తామని అన్నారు. నందీనగర్‌లో నివాసంలో మంగళవారం లగచర్ల బాధితులు కెటిఆర్‌ను కలిసి బిఆర్‌ఎస్ రజతోత్సవ సభ కోసం రూ.లక్ష విరాళం ఇచ్చారు. ఈ సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ, లగచర్ల రైతులను పోలీసులు చిత్రహింసలు పెట్టి, దారుణంగా కొట్టారని ఎన్‌హెచ్‌ఆర్‌సి రిపోర్ట్‌లో చెప్పారని అన్నారు. ఒక మనిషిని ఎన్ని రకాలుగా శారీరకంగా చిత్రవధ చేసే అవకాశం ఉంటుందో అన్ని రకాలుగా లగచర్ల గిరిజనులను పోలీసులు హింసించారని ఆవేదన వ్యక్తం చేశారు. హీర్యానాయక్‌కు ఛాతిల గుండెనొప్పి వస్తే బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకుపోయారని పేర్కొన్నారు. ప్రభుత్వ దమనకాండకు బలైన లగచర్ల రైతులు తెలంగాణ భవన్‌కు వస్తే న్యాయం దక్కేలా చూస్తామని వాళ్లకు తమ పార్టీ తరపున మాటిచ్చామని, లగచర్ల బాధితులను ఢిల్లీ దాకా తీసుకుపోయి మానవ హక్కుల కమిషన్, జాతీయ ఎస్‌సి, ఎస్‌టి కమిషన్, జాతీయ మహిళా కమిషన్‌ను తమ పార్టీ నేతలు కలిశారని గుర్తు చేశారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన దుర్మార్గమైన పనిని బిఆర్‌ఎస్ దేశం దృష్టికి తీసుకుపోయిందని చెప్పారు. దేశంలో ఇంకా న్యాయం, ధర్మం బతికే ఉన్నాయని, మానవత్వం కూడా మిగిలే ఉన్నదని ఎన్.హెచ్.ఆర్.సి రిపోర్ట్‌తో స్పష్టం అయిందని తెలిపారు. హెచ్.సి.యూ భూముల విషయంలోనూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకుని బడా ఆర్థిక మోసానికి పాల్పడిందని ఇటీవల సుప్రీం కోర్టు నియమించిన సెంట్రల్ ఎంపవర్ కమిటీ నివేదిక ఇచ్చిందని అన్నారు. ఎన్‌హెచ్‌ఆర్‌సి కూడా అధికారం మదంతో విర్రవీగుతున్న రేవంత్ రెడ్డి చెంప మీద కొట్టినట్టుగా రిపోర్ట్ ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేదాకా కొట్లాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. ఇంత కష్టంలో కూడా తమ గురించి ఆలోచించి బిఆర్‌ఎస్ రజతోత్సవ సభకు విరాళం ఇచ్చిన లగచర్ల ఆడబిడ్డలకు కెటిఆర్ ధన్యవాదాలు తెలిపారు.