హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి బీసీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ బీసీ ముఖ్య నేతలతో కెటిఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలు, బీసీ కులగణన, స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల సాధన కోసం చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. బీసీ సంబంధిత అంశాలపై బిఆర్ఎస్ త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తుందని కెటిఆర్ చెప్పారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘కులగణనలో ఐదున్నర శాతం జనాభాను తగ్గించారు. దాదాపు 22 లక్షల మంది ఉన్న వారిని లేనట్లు చిత్రీకరించారు. బీసీల జనాభాను తగ్గించారు. కులగణన పూర్తిగా తప్పుల తడక. కులగణన చిత్తుకాగితంతో సమానమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తగులబెట్టారు. బీసీలకు అన్యాయం చేసి తప్పించుకునే ప్రయత్నం చేయవద్దు. రిజర్వేషన్లు 42 శాతమని బీసీ డిక్లరేషన్‌లో చెప్పిన విధంగా మాట నిలబెట్టుకోవాలి. అసెంబ్లీలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు పెట్టాలి. గతంలో బీసీలకు 50శాతానికి పైగా రిజర్వేషన్లు ఇచ్చాం. అసెంబ్లీ, ఎంపీ, స్థానిక ఎన్నికల్లో అత్యధిక సీట్లు కేటాయించాం’ అని కెటిఆర్ చెప్పారు.